స్త్రీపురుష సమానత్వంపై మనం వియత్నాం నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొన్ని రోజుల క్రితం నేను వియత్నాం పర్యటనకు వెళ్లాను. ఆ దేశంలో గమనించిన విషయం ఏమిటంటే, అక్కడ మహిళలకు ప్రత్యేకంగా సీట్లు లేవు.
బస్సు స్టేషన్లలో కానీ, విమానాశ్రయాలలో కానీ ఎక్కడా మహిళలకు విడిగా క్యూలు లేవు. బహిరంగ ప్రదేశాల్లో కూడా వాళ్లకు ఎక్కడా, ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయలేదు.
దీని గురించి నేను స్థానికులను ప్రశ్నించినపుడు, వాళ్లు చాలా ఆశ్చర్యపోయారు.
వారిలో ఒకరు, ''మేమంతా సమానమైనపుడు ఇంకా ప్రత్యేకమైన సదుపాయాలు కానీ, ఏర్పాట్లు కానీ ఎందుకు?'' అని ప్రశ్నించారు.

వియత్నాంలో స్త్రీపురుషులు సమానం
వియత్నాంలో పర్యటించేప్పుడు మన దృష్టిని ఆకర్షించే మొదటి విషయం - అక్కడ స్త్రీపురుషులను సమానంగా పరిగణిస్తారు. అక్కడ ప్రతిచోటా మహిళలు కూడా పురుషులతో సమానంగా చురుగ్గా ఉంటారు.
వాళ్లు దుకాణాలు నిర్వహిస్తారు. ఫుట్‌పాత్‌లపై తినుబండారాలు విక్రయిస్తారు. రెస్టారెంట్లలో పురుషులతో కలిసి పని చేస్తూ కనిపిస్తారు.
ఆఫీసుల్లో కూడా వాళ్లు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు. అలాగే ఆటల్లో కూడా వాళ్లు చురుగ్గా పాల్గొంటారు.
పాఠశాలల్లో బాలికల సంఖ్య బాలుర సంఖ్యతో సమానంగా కనిపిస్తుంది. అదే విధంగా రాజకీయాల్లోనూ వాళ్లు స్వేచ్ఛగా పాల్గొంటారు.
వియత్నాం మహిళలు ఎలాంటి భయమూ లేకుండా అంతటా తిరగ్గలరు.
మహిళలు చీకటి పడే వరకు ఆఫీసుల్లో పని చేయడం అక్కడ పెద్ద విషయం కాదు. ఎవరో వచ్చి తమపై దాడి చేస్తారనే భయం వాళ్లకు లేదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు
నేరాల సంఖ్య తక్కువగా ఉన్న దేశాల్లో వియత్నాం ఒకటి.
మహిళలపై అత్యాచారాలు, వేధింపులు అనేది అక్కడ చాలా పెద్ద వార్త.
ఇక్కడ మహిళలు తమ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం ప్రయత్నిస్తుంటారు. వీళ్లు బయట ఎంత పని చేస్తారో, ఇంట్లో కూడా అంత పని చేస్తారు.
వియత్నాంలో ఫాస్ట్ ఫుడ్ తినడం చాలా తక్కువని చెప్పొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అందులోనూ మహిళలు ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా కనిపిస్తారు.

యుద్ధరంగంలోనూ సై..
వియత్నాం యుద్ధంలో ఇక్కడి మహిళలు కూడా అమెరికా సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ ఇరవై ఏళ్ల యుద్ధంలో లక్షల మంది మహిళలు అసువులు బాసారు.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ వియత్నాం యుద్ధంలో పాల్గొనే మహిళలకు అద్భుతమైన శిక్షణను ఇచ్చింది. యుద్ధం ముగిశాక, వాళ్లు తమ సేవలు అందజేసేందుకు వీలుగా ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారు కూడా.
వియత్నాం సమాజం కూడా మగ పిల్లలకే ప్రాధాన్యమిస్తుంది. అయితే ఆడపిల్ల పుట్టినా, వాళ్ల పట్ల ఎలాంటి వివక్షా ప్రదర్శించరు.
ప్రస్తుతం అక్కడ మొత్తం జనాభాలో మహిళలు 49 శాతం మంది ఉన్నారు. రాబోయే కాలంలో వాళ్ల జనాభా పురుషుల సంఖ్యను దాటిపోతుందని భావిస్తున్నారు.
సమానత్వం కోసం వియత్నాం మహిళల పోరాటం
వియత్నాం మహిళలకు ఈ సమానత్వం ఆయాచితంగా ఏమీ దక్కలేదు. అందుకోసం వాళ్లు చాలా కాలం పోరాడాల్సి వచ్చింది. 1930లో ఇక్కడి మహిళలు వియత్నాం మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా తమ హక్కుల కోసం పోరాడారు.
భారతదేశంలో మాదిరే వియత్నాం జనాభాలో కూడా ఎక్కువ మంది యువత ఉన్నారు. వాళ్లలో అబ్బాయిల సంఖ్యకన్నా అమ్మాయిల సంఖ్యే ఎక్కువ.
వియత్నాంలో నేనొక కాల్ సెంటర్‌కు వెళ్లగా, అక్కడ 80 శాతం మంది మహిళలే కనిపించారు.

చైనా పాలనతో సమాజంలో మార్పులు
వియత్నాంలోని పాత తరంతో మాట్లాడితే, గతంలో వియత్నాంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదని, ఆ రోజుల్లో మహిళలు ఎంతో శక్తిమంతులని తెలిసింది.
కానీ దాదాపు వెయ్యేళ్లు చైనా పాలన కింద నలిగిపోయాక, ఆ దేశంలో పురుషాధిక్యత పెరిగింది.
అక్కడ ఒక వృద్ధుడు నేటి సమాజం క్రమంగా మహిళలకు ఎలా అనుకూలంగా మారిందో వివరించారు.
మరి భారత సమాజం వాళ్ల నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకుంటుందా?
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








