#BBCShe: విజయవంతమైన కులాంతర వివాహాల్ని మీడియా ఎందుకు చూపదు?

- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
మరాఠీ సినిమా 'సైరాట్' లోని చివరి దృశ్యం నా కళ్ల ముందు కదలాడింది. ఆ దృశ్యంలో 'ఉన్నత' కులానికి చెందిన మహిళ కుటుంబం ఆమెనూ, 'కింది' కులానికి చెందిన ఆమె భర్తనూ ఇద్దరినీ చంపేస్తారు.
హత్య దృశ్యాన్ని నేరుగా చూపించరు గానీ ఆ దంపతుల చిన్నారి బాబు ఏడుస్తుండగా తెరపై ఆవిష్కృతమయ్యే హింసా, క్రూరత్వాలు మన మనసును పిండేస్తాయి.
నాగ్‌పూర్‌లో #BBCShe నిర్వహించిన కార్యక్రమంలో ఒక యువతి మాట్లాడుతుంటే, ఆమె మాటల్లో వేదన, భయ వాతావరణం కళ్లకు గట్టినట్టయ్యింది.
"వేర్వేరు మతాలు, కులాలకు చెందిన వారు పెళ్లి చేసుకున్నప్పుడు వారికి వ్యతిరేకంగా సాగే వాదనలూ, జరిగే హింసకు సంబంధించిన వార్తలు మీడియాలో చూపిస్తారు. ఇలాంటి వాటితో మాపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటే మాపై ఏం జరుగుతుందోనన్న భయాలు మమ్మల్ని ఆవరిస్తాయి" అని ఆమె అన్నారు.
ఇలాంటి జంటల్లో సక్సెస్ అయిన వాటి గురించి మీడియా ఎందుకు చెప్పదు? కులాంతర, మతాంతర వివాహాలకు కుటుంబాలు అంగీకరించిన ఉదంతాలు, అమ్మాయి-అబ్బాయి తమ తల్లిదండ్రులను ఒప్పించిన సంఘటనలు ఎందుకు చూపరు?"

అలాంటి జంటలకు ఉదాహరణగా ఆ యువతి తన టీచర్‌ను మాకు పరిచయం చేశారు. ఆ టీచర్ దక్షిణ భారతదేశానికి చెందిన మహిళ కాగా, ఆమె భర్త మహారాష్ట్ర వాసి. ఇద్దరి కులాలు వేర్వేరు.
టీచర్ కుటుంబం వారి పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించగా, ఆమె భర్త కుటుంబం అభ్యంతరం చెప్పలేదు.
తన భర్త సోదరుడు కొన్నేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకోవడమే అందుకు కారణమని టీచర్ చెప్పారు.
అప్పుడు ఆ కుటుంబం వారి పెళ్లిని అంగీకరించలేదు. దాంతో వారిద్దరూ కోర్టులో మ్యారేజి చేసుకొని నగరం నుంచి పారిపోయారు. ఆ తర్వాత కుటుంబం వారి జాడ కనుక్కొని, విడాకులు తీసుకోవాలంటూ ఇద్దరిపై చాలా కాలం పాటు ఒత్తిడి చేసింది.
అయినా ఆ దంపతులు మొండిగా నిలబడ్డారు. ఓ నెల రోజులు అజ్ఞాత జీవితం గడిపాక చివరికి ఇంటికి తిరిగొచ్చారు. అప్పుడా కుటుంబం వారిని తమలో కలుపుకుంది.

అందుకే, ఈ టీచర్ భర్త వేరే కులానికి చెందిన మహిళతో పెళ్లి ప్రతిపాదన చేసినప్పుడు వారి కుటుంబం అడ్డు చెప్పలేదు.
తనది మాత్రం చాలా ఛాందసవాద భావాలు గల కుటుంబం అని టీచర్ అంటారు. భర్త కుటుంబం సుముఖంగా ఉన్నప్పటికీ తన తల్లిదండ్రులు మాత్రం దాదాపు ఒక సంవత్సరం వరకు తన కోసం అబ్బాయిల్ని చూస్తూనే ఉన్నారని ఆమె చెప్పారు.
"భర్త కుటుంబం చివరకు ఒప్పుకోవడానికి కారణం ఒక పాజిటివ్ అనుభవం ఉండడమే. భర్త సోదరుడు-వదినల పోరాటం మా మార్గాన్ని సుగమం చేసింది. మీడియాలో ఇలాంటి అనుభవాలపై కథనాలు వస్తే మరెందరో అమ్మాయిలు, అబ్బాయిల పోరాటం సులువవుతుంది."
పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల లాగానే మహారాష్ట్రలో కూడా కులాంతర లేదా మతాంతర వివాహం చేసుకున్న అమ్మాయిలను, అబ్బాయిలను హత్య చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి.
ఇలాంటి ఒక సంబంధం, వారిపై ఓ కుటుంబం పాల్పడే హింసకు సంబంధించిన కథపై రూపొందిందే 'సైరాట్' సినిమా.

తూర్పు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ శాంతియుత నగరంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి హింసకు సంబంధించిన వార్తలు పెద్దగా వినిపించవు. అయితే పశ్చిమ మహారాష్ట్రలో మాత్రం ఇలాంటి కేసులు చాలానే వెలుగులోకి వచ్చాయి.
అయితే చారిత్రకంగా చూసినపుడు, నాగ్‌పూర్‌లో కులం గురించిన చర్చకు చాలా ప్రాధాన్యం ఉంది.
బాబాసాహెబ్ అంబేడ్కర్ 1956లో కులం ఆధారంగా జరిగే వివక్షను వ్యతిరేకిస్తూ హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధాన్ని స్వీకరించింది ఈ నగరంలోనే.
ఆయన నేతృత్వంలో 'కింది' కులానికి చెందిన దాదాపు ఐదు లక్షల మంది మతం మార్చుకొని బౌద్ధాన్ని స్వీకరించారు. నేటికీ ఆ ప్రదేశాన్ని 'దీక్షాభూమి'గా వ్యవహరిస్తారు.
నాటి ఆ చరిత్రాత్మక చర్య ప్రభావం నేటికీ మహారాష్ట్రలో కనిపిస్తుంది. 2011 జనగణన ప్రకారం భారత్‌లో బౌద్ధాన్ని అవలంబించే వారి జనాభాలో 75 శాతం మహారాష్ట్రలోనే ఉంటారు.
రూపా కుల్‌కర్ణీ బోధి 1945లో నాగ్‌పూర్‌లోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1956లో కాదు గానీ, 1992లో - అంటే తన 47వ ఏట ఆమె హిందూ మతాన్ని త్యజించి బౌద్ధ మతాన్ని స్వీకరించారు.

ఆమె అలా ఎందుకు చేశారు? ఆమె 'ఉన్నత' కులంలో జన్మించారు. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో సంస్కృతం బోధించే ప్రొఫెసర్‌గా ఉన్నారు. మరి ఆమెకు ఎలాంటి వివక్ష ఎదురై ఉంటుంది?
"నేను ఇళ్లలో పని చేసే కార్మికులతో పని చేయడం ప్రారంభించాను. వారంతా చిన్న కులాలని పిలిచే వాటికి చెందిన వారే. వారి పరిస్థితులు చాలా దయనీయంగా ఉండేవి. దాంతో నాకు నా కులం ఒక భారంగా, కళంకంగా అనిపించసాగింది. దాంతో దాన్ని వదిలెయ్యాలని నిర్ణయించుకున్నాను" అని ఆమె నాతో చెప్పారు.
న్యూస్ చానెల్స్, వార్తా పత్రికలు, సినిమా కథలు, ఆఖరుకు టీవీల్లో వచ్చే సీరియల్స్ కూడా కులం ప్రాతిపదికన వేరుగా ఉండాలనే సంస్కృతిని ప్రోత్సహించేవేనని రూపా కుల్‌కర్ణీ బోధి అంటారు.
అత్యధిక మరాఠీ సీరియల్స్ 'ఉన్నత' కులాలకు చెందిన సంపన్న కుటుంబాల జీవితాలనే చూపిస్తాయి. వాటిలో 'కింది కులాల' వారిని ఇళ్లలో పని చేసే పనిమనుషుల్లా, కూలీలుగా మాత్రమే చూపిస్తాయి. వారంతా అసలు కథకు విడిగా, దూరంగా విసిరేసినట్టుగా ఉంటారు.
వేర్వేరు కులాల మధ్య అంతరాల్ని చెరిపెయ్యాలంటే అది మూడు పద్ధతుల్లో సాధ్యమని బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు - పెళ్లిళ్లు, సహపంక్తి భోజనాలు, సాంస్కృతిక సంబంధాలు.
నాగ్‌పూర్ కాలేజీలో కలిసిన యువతి ఇలాంటి సాంస్కృతిక సంబంధాల గురించి మరింత బాహాటంగా చర్చ జరగాలని కోరుకుంటున్నారు.
ఇందుకు తన టీచర్ అనుభవమే ఒక సానుకూల ఉదాహరణ అని ఆమె నొక్కి చెబుతారు. మరి ఆ టీచర్ తల్లిదండ్రుల సంగతేంటి? వారికి మీడియా ఇలాంటి సానుకూల కథనాలను పరిచయం చేయడం లేదు కదా మరి....
ఇవి కూడా చదవండి:
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- #UnseenLives: ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- #UnseenLives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా?
- తమిళనాడు 'పరువు' హత్య: తండ్రికే మరణశిక్ష పడేట్లు చేసిన యువతి
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- స్ట్రాబెర్రీల్లో సూదులు.. ముక్కలుగా కోసుకుని తినండి - హెచ్చరించిన ప్రభుత్వం
- మిర్యాలగూడలో 'పరువు' హత్య: ‘మా నాన్నను ఒప్పిస్తాను, ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటాం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








