ఈ దళిత విద్యార్థి ఎందుకు గుజరాత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు?

- రచయిత, రాక్సీ గగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్లో అనేక మంది పేషెంట్లు, దిగులుగా ఉన్న ముఖాలు, పొడవాటి క్యూల నడుమ, మాస్టర్ ఆఫ్ సర్జరీ చదువుతున్న ఓ మూడో సంవత్సరం విద్యార్థి చికిత్స పొందుతున్నారు.
ఆత్యహత్యకు ప్రయత్నించిన డాక్టర్ మారీ రాజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పై అధికారులు అందరి ఎదుటా తనను అవమానించారని, తనను బలవంతంగా కుర్చీ నుంచి లేచి నిలబెట్టారని, తన సహచరులు, పై వారికి టీ ఇప్పించారని రాజ్ అంటున్నారు.
తమిళనాడుకు చెందిన డాక్టర్ మారీ రాజ్, జూన్ 2015లో తాను కాలేజీలో చేరిన నాటి నుంచి తన పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రికి చెందిన తొమ్మిది మంది డాక్టర్లపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు.
కుల, ప్రాంతం, భాషా వివక్షను ఎదుర్కొన్నానని చెబుతున్న డాక్టర్ రాజ్ తిరిగి తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయి చదువును పూర్తి చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం రాజ్ ఆసుపత్రిలోని సర్జికల్ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని రైతు కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ రాజ్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడానికి దేశంలోని ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా తనకు అడ్మిషన్ దొరికేదని, అయితే తాను కావాలనే గుజరాత్‌కు వచ్చినట్లు తెలిపారు.
''ఇప్పుడు నేను మా రాష్ట్రానికి తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నాను'' అని ఆసుపత్రిలో గదిలో ఒంటరిగా కూర్చున్న ఆయన బీబీసీ ప్రతినిధితో చెప్పారు.
జనవరి 5, 2018న తన పైఅధికారులు, సహచరులదరి ఎదుటా అవమానించడం వల్లే తాను తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు.
ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగిన ఆయనను వెంటనే సివిల్ హాస్పిటల్ అత్యవసర వార్డుకు తరలించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ సంఘటనపై ఆయన షాహీబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కులం, మతం కారణంగానే తన అర్హతలకు తగిన పనిని కేటాయించడం లేదని డాక్టర్ రాజ్ అన్నారు.

ఫొటో సోర్స్, facebook
డాక్టర్ రాజ్ పని చేస్తున్న విభాగపు అధినేత డాక్టర్ ప్రశాంత్ మెహతా, రాజ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారమూ లేదని బీబీసీ ప్రతినిధికి తెలిపారు.
''గత రెండు నెలలుగా ఆయన నాతో పని చేస్తున్నారు. అతనూ, నేను చాలా తక్కువసార్లు కలిశాం. ఇక్కడ అనేక మంది షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు పని చేస్తున్నారు. వారిలో ఎవ్వరూ కూడా ఇక్కడ ఎలాంటి సమస్యనూ ఎదుర్కోలేదు'' అని డాక్టర్ మెహతా అన్నారు.
జనవరి 5న, ఒక సర్జరీ చేస్తానని డాక్టర్ మారీ రాజ్ డిమాండ్ చేసినట్లు డాక్టర్ మెహతా తెలిపారు.
''ఈ విభాగానికి అధిపతిగా నేను ఒక విద్యార్థిని సర్జరీ చేయడానికి అనుమతించను. అతను గత 2 నెలల్లో సుమారు 22 సర్జరీలలో భాగం పంచుకున్నారు'' అని డాక్టర్ మెహతా తెలిపారు.
షెడ్యూల్డ్ కులాల అత్యాచార నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద డాక్టర్ రాజ్ చేసిన ఫిర్యాదులో డాక్టర్ మెహతా కూడా ఒక నిందితుడు.
డాక్టర్ రాజ్ ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని ఎఫ్ డివిజన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజేశ్ గఢియా బీబీసీకి తెలిపారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/MAYURESH KONNUR
తన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని డాక్టర్ రాజ్ ఆరోపించడం ఇది మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2015లోనే ఆయన దీనిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వాటిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు.
తన సీనియర్లు వచ్చినపుడు తాను కూర్చున్న కుర్చీని ఖాళీ చేయించారని, తనతో అందరికీ స్నాక్స్, టీ ఇప్పించారని తనకు జరిగిన అవమానాన్ని వివరించారు. తన అర్హతలకు తగిన పని చేయడానికి తనకు ఎన్నడూ అవకాశం ఇవ్వలేదని అన్నారు.
''నేను మూడో సంవత్సరం విద్యార్థిని. సీనియర్ డాక్టర్లతో కలిసి మేజర్ సర్జరీలు చేసే అవకాశం నాకివ్వాలి. కానీ నాపట్ల ప్రతిసారీ వివక్ష ప్రదర్శించారు'' అని డాక్టర్ రాజ్ బీబీసీ ప్రతినిధికి తెలిపారు.
''నన్ను వీళ్లు ఒక బానిసగా ట్రీట్ చేసారు. ఆపరేషన్ థియేటర్ బయట ఒక సెక్యూరిటీ గార్డులా నిలబెట్టారు. నేను తప్ప డిపార్ట్‌మెంట్‌లోని మిగతా రెసిడెంట్ డాక్టర్లంతా సెమినార్ క్లాసులు తీసుకోవడానికి అనుమతించారు'' అని తెలిపారు.
సోమవారం నుంచి తనను డాక్టర్లు ఎవరూ విజిట్ చేయడం లేదని అన్నారు.
''నాకు ట్రీట్‌మెంట్ కానీ, ఆహారం కానీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందే నాకు ఆహారాన్ని తీసుకొస్తున్నారు'' అని వివరించారు.
రాజ్ అన్నయ్య జపాన్‌లో శాస్త్రవేత్తగా పని చేస్తుండగా, తమ్ముడు తమిళనాడులో ఎంబీబీఎస్ చదువుతున్నారు.
ఆయన తల్లి ఎం.ఇందిర గత ఏడాది సెప్టెంబర్‌లో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ఛైర్మన్‌కు తన కుమారుడు ఎదుర్కొంటున్న వివక్ష గురించి లేఖ రాసారు.
2016 సంవత్సరపు జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం షెడ్యూల్డ్ కులాల వారిపై జరిగిన నేరాలు, అత్యాచారాల విషయంలో మొదటి పది స్థానాలలో ఉన్న రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి.
భారతదేశంలో గత కొన్నేళ్లలో వెనుకబడిన కులాల వారిపై జరిగే నేరాలు పెరిగిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ నేరాలలో శిక్ష పడే రేటు మాత్రం తగ్గుతోంది.
ఇటీవల మహారాష్ట్రలోని భీమా-కోరెగాంలో మహార్ కులస్తులు పేష్వాలపై సాధించిన ద్విశతాబ్ది విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన అల్లర్లలో దళితులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








