ప్రణయ్, అమృత అసలు వీళ్లెవరు?

ఫొటో సోర్స్, amrutha.pranay.3/facebook
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్, గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఓ దుండగుడు మాటువేసి అతన్ని నరికి చంపాడు.
పట్టపగలే జరిగిన ఈ హత్యతో మిర్యాలగూడ పట్టణం ఉలిక్కిపడింది. దీన్ని కులహంకార హత్యగానే భావిస్తున్నామని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు.
ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ది షెడ్యూల్డ్ కులానికి (మాల) చెందిన మధ్యతరగతి కుటుంబం. అమ్మాయిది వైశ్య సామాజిక వర్గం. ఆమె తండ్రి స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అని స్థానికులు చెబుతున్నారు.
తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమృత తండ్రి తిరునగరు మారుతిరావే కిరాయి హంతకులతో ప్రణయ్‌ని హత్య చేయించి ఉంటారని పోలీసులు భావిస్తూ మారుతీరావును ఏ1గా, అతని తమ్ముడు శ్రవణ్‌ను ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, amrutha.pranay.3/facebook

ఫొటో సోర్స్, amrutha.pranay.3/facebook
10 తరగతి నుంచే పరిచయం
ప్రణయ్ పదో తరగతి, అమృత తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే స్నేహితులు. తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరూ ఇంజినీరింగ్ (బీటెక్) పూర్తిచేశారు. పెళ్లి చేసుకుంటామని ఇరువురి కుటుంబ సభ్యులను అడిగితే, అమ్మాయి తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. దాంతో వారు ఈ ఏడాది జనవరి 31న హైదరాబాద్ వెళ్లి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు.
తర్వాత ప్రణయ్ ఇంట్లోనే కాపురం చేస్తున్నారు.
తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతిరావు ప్రయత్నాలు చేసినా ఆమె ఒప్పుకోలేదు. అప్పటి నుంచి తమపై మారుతిరావు కక్ష పెంచుకున్నారని అబ్బాయి తండ్రి బాలాస్వామి తెలిపారు. వివాహమైన 2 నెలల తర్వాత నుంచి తన హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానంతో ప్రణయ్ అప్రమత్తంగా ఉంటున్నారు.

ఫొటో సోర్స్, UGC
సీసీ కెమెరాలో హత్య దృశ్యాలు
ప్రస్తుతం అమృత గర్భవతి కావడంతో వైద్య పరీక్షల కోసం ప్రణయ్, అతని తల్లి కలిసి ఆమెను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పరీక్షలు పూర్తయిన తర్వాత 1.30 ప్రాంతంలో ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి మాంసం దుకాణాల్లో వాడే కత్తితో ప్రణయ్ మెడపై నరికాడు. దాంతో కిందపడిపోయిన ప్రణయ్‌పై మరోసారి వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా ఆస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. హంతకుడు కత్తిని సమీపంలోనే పడవేసి పరారయ్యాడు.
ఆగస్టు 22న కూడా ప్రణయ్ ఇంటి ముందు దుండగులు రెక్కీ నిర్వహించినట్టు ప్రణయ్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గుర్తించారు.

ఫొటో సోర్స్, amrutha.pranay.3/facebook
నిందితుల అరెస్ట్
వివాహం చేసుకున్న కొన్ని రోజులకే తమకు రక్షణ కల్పించాలని ప్రణయ్, అమృత దంపతులు ఐజీని కలిసి కోరారని పోలీసులు తెలిపారు.
హత్య జరిగిన విషయం తెలియగానే ఘటనా స్థలాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్, డీఎస్పీ పి.శ్రీనివాస్, ఆర్డీఓ జగన్నాథరావు, తహసీల్దార్ కృష్ణారెడ్డి పరిశీలించారు.
ప్రణయ్‌కు ప్రాణహాని ఉందని తమకు ఫిర్యాదు వచ్చిందని, దాంతో యువతి తండ్రి మారుతీరావును పిలిచి హెచ్చరించామని ఎస్పీ వెల్లడించారు.
ఈ హత్య కిరాయి హంతకుల చేత చేయించినట్లు అనుమానాలున్నాయని అన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు.
కాగా, ఈ కేసులో ఏ-1 నిందితుడు తిరునగరు మారుతిరావు, ఏ-2 నిందితుడు శ్రవణ్‌లతో పాటు హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న మరో ఇద్దరిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ఫొటో సోర్స్, NAlgonda police/fb
దూరంగా వెళ్లిపోవాలని చెప్పాను: ప్రణయ్ తండ్రి
"కోటీశ్వరుడైన మారుతిరావు ఎప్పుడు ఏం చేయిస్తాడోనని మాకు భయముండేది. దాంతో ఇంటికి దూరంగా వెళ్లిపోయి బతకాలని నా కొడుకు, కోడలికి చెప్పాను. కానీ, నా కోడలు అంగీకరించలేదు. మా నాన్నను ఒప్పిస్తాను, ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటాం అని చెప్పింది" అని ప్రణయ్ తండ్రి బాలస్వామి చెప్పారు.
అయితే, కొంత కాలంగా అమృతతో వారి తల్లిదండ్రులు ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించారని, అలా నమ్మించి తమ కొడుకును హత్య చేయించారని ప్రణయ్ తల్లిదండ్రులు ఆరోపించారు.
హైదరాబాద్ వైపు వెళ్లిన కారు
హత్య జరగడానికి గంట ముందు అమృత తండ్రి మారుతిరావు కారులో హైదరాబాద్ వైపు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాలకు ఆయన కారు మాడ్గులపల్లి వద్ద నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై ఉన్న టోల్‌గేట్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లినట్టు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మిర్యాలగూడ బంద్
ప్రణయ్ హత్యకు నిరసనగా శనివారం మిర్యాలగూడ బంద్‌కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. దాంతో పట్టణంలో అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.
సోషల్ మీడియాలో నెటిజన్ల సానుభూతి
అమృతకు ఫేస్‌బుక్‌లో నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఈనెల 13వ తేదీన వినాయక చవితి పూజ చేసుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టిన ఆమె ‘ఫీలింగ్ బ్లెస్డ్’ అని పేర్కొంది. ప్రణయ్ హత్య అనంతరం ఈ ఫొటోకు చాలామంది కామెంట్లు చేశారు. ఎక్కువ మంది ఆమెను సోదరి అని సంబోధిస్తూ.. ఆమెకు సానుభూతిని వ్యక్తం చేశారు.
‘‘దేవుడు ఎక్కడ వున్నాడు ? ఎందుకు ఇలా చేశాడు?’ అని అడిగినా సమాధానం ఇవ్వడు. మీరు ధైర్యంగా ఉండండి’’ అని దుశ్యంత్ కుమార్ అనే నెటిజన్ కామెంట్ చేశారు.
‘నీ బేబీలో ప్రణయ్‌ని చూసుకో సిస్టర్. స్టే స్ట్రాంగ్’ అని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.
‘ఇలాంటి కులం గజ్జి, డబ్బు అధికారం ఉన్నాయని, డబ్బుంటే ఏమైనా చేయవచ్చు అనే ధోరణి పోవాలంటే మారుతీరావు లాంటి వారికి ఉరిశిక్ష వేయాలి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘రాజకీయ నాయకులూ ‘కళా పోషకులే’.. కానీ వారి సంబంధాలపై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు’
- స్ట్రాబెర్రీల్లో సూదులు.. ముక్కలుగా కోసుకుని తినండి - హెచ్చరించిన ప్రభుత్వం
- బొమ్మ కాదు బాంబు: పిల్లలను చంపేస్తున్న క్లస్టర్ బాంబులు
- అభిప్రాయం: 2019 ఎన్నికల దిశగా బీజేపీ కుల సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి?
- లైంగికానందం కోసం మహిళలు సెక్స్ చేయటం సరికాదని మహాత్మా గాంధీ ఎందుకన్నారు?
- C/o కంచరపాలెం: తెలుగు సినిమా ఎదుగుతోంది
- చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్: 'ఇదో చిన్న కేసు.. మీడియానే పెద్దది చేసి చూపిస్తోంది'
- పగలు టైలర్... రాత్రి కిల్లర్ - ‘33 మందిని హత్య చేశాడు’
- Apple Iphone xs: మొదటిసారిగా ఐ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ - ఐ వాచ్‌లో ECG
- సూప్‌లో ఎలుక.. రూ.1365 కోట్లు నష్టపోయిన రెస్టారెంట్
- 'లవ్ జిహాద్'.. ప్రేమ - 'ప్రత్యేక వివాహం'
- ఆ దెబ్బలకు కడుపులో బిడ్డ కూడా చచ్చిపోయింది!
- ‘అందరూ నిర్దోషులైతే.. ఈ దళితుల్ని చంపిందెవరు?’
- #BBCShe: విజయవంతమైన కులాంతర వివాహాల్ని మీడియా ఎందుకు చూపదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








