గుజరాత్: దళిత పెళ్లికొడుకు గుర్రం ఎక్కడంపై వివాదం, పోలీసు రక్షణలో వివాహం

దళితుడి వివాహం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, గుర్రంపై కూర్చున్న పెళ్లికొడుకు ప్రశాంత్ సోలంకీ
    • రచయిత, భార్గవ్ పారిఖ్
    • హోదా, బీబీసీ కోసం

గుజరాత్‌లో దళితులపై జరుగుతున్న అత్యాచార ఘటనల్లో తాజాగా మరో ఉదంతం ముందుకు వచ్చింది.

ఒక దళిత పెళ్లికొడుకు తన పెళ్లి బృందంతో కలిసి గుజరాత్‌లోని మాణ్సా తాలూకా పార్సా గ్రామంలోకి గుర్రంపై కూర్చొని ఊరేగింపుగా వెళ్లడానికి ప్రయత్నించగా, అగ్రకులం అని చెప్పుకునే కొందరు అతడిని అడ్డుకొని గుర్రం పైనుంచి కిందకు దించేశారు.

పార్సా గ్రామానికి చెందిన దర్బార్ అనే కులం వాళ్లు ఈ పెళ్లి బృందాన్ని అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రెండు సముదాయాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల రక్షణ ఏర్పాట్ల మధ్యే పెళ్లి వేడుక పూర్తయింది.

దళితుడి వివాహం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, మహసాణా బోరియావీ నుంచి పార్సా గ్రామానికి చేరుకున్న పెళ్లి బృందం

వివాదం ఎలా మొదలైంది?

మహసాణా జిల్లా బోరియావీ గ్రామానికి చెందిన ప్రశాంత్ సోలంకి పెళ్లి బృందంతో కలిసి పార్సా గ్రామానికి బయలుదేరారు. పార్సా గ్రామ సరిహద్దులోకి చేరుకున్న తర్వాత ఊరేగింపుగా పెళ్లి వారింటికి బయలుదేరగా, దర్బార్ కులానికి చెందిన కొందరు వారిని అడ్డుకున్నారు.

"నేను గుర్రంపైకి ఎక్కుతుండగా కొంత మంది అక్కడికి వచ్చి నన్ను అడ్డుకున్నారు. గుర్రం ఎందుకు ఎక్కుతున్నావ్ అంటూ నన్ను బెదిరించారు" అని ప్రశాంత్ సోలంకీ బీబీసితో చెప్పారు.

ప్రశాంత్ బావమరిది రితేశ్ పర్మార్ బీబీతో మాట్లాడుతూ, "మేం మగ పెళ్లి వారిని ఆహ్వానించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అప్పుడే కొందరు దర్బార్ కులస్థులు మా బావ ప్రశాంత్‌ను అడ్డుకొని గుర్రం ఎక్కి ఊరేగింపు తీయొద్దని బెదిరించినట్టు నాకు సమాచారం అందింది" అని చెప్పారు.

"వాళ్లు గుర్రం యజమానిని కూడా బెదిరించడంతో వాళ్లు గుర్రాన్ని తీసుకొని ఊళ్లోంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మేం పోలీసులకు సమాచారం చేరవేశాం. పోలీసులూ, సర్పంచ్ రాజేశ్ పటేల్ ఇక్కడికి వచ్చి పరిస్థితిని శాంతింపజేశారు. సర్పంచ్ మరో గుర్రం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గుర్రంపై ఊరేగింపు జరిగింది. ఆ తర్వాత పెళ్లి జరిగింది."

దళితుడి వివాహం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, గ్రామంలో పోలీసు రక్షణలో దళిత యువకుడి పెళ్లి జరిగింది.

అయితే ముహూర్తానికి మూడు గంటలు ఆలస్యంగా ఈ వివాహం జరిగింది.

పెళ్లి జరిగేంత సేపు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసు బందోబస్తు మధ్యే పెళ్లి పూర్తయ్యింది.

ఒక దళిత యువకుడు గుర్రం ఎక్కి పెళ్లి ఊరేగింపులో వెళ్లడం పట్ల ఒక కులం వారు అభ్యంతరం చెప్పారని గాంధీనగర్ డీఎస్‌పీ ఆర్‌జీ భావసార్ తెలిపారు.

అయితే పోలీసులు రక్షణ కల్పించడంతో గుర్రంపైనే ఊరేగింపు జరిగిందని ఆయన చెప్పారు.

దళితుడి వివాహం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

రాజీ ప్రయత్నాలు

రెండు కులాల వారి మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పార్సా గ్రామ సర్పంచ్ రాజేశ్ పటేల్ బీబీసీకి తెలిపారు. ఈ ఘటన సందర్భంగా దర్బార్ కులానికి చెందిన కొందరు పెద్దవయసు వారు తమ వాళ్లకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినట్టు కూడా ఆయన చెప్పారు.

"భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడడం కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. జరిగిన ఘటన విషయంలో పోలీసు కేసు కాకుండా చూడడం కోసం కూడా ప్రయత్నిస్తున్నాం" అని చెప్పారు.

దళితుడి వివాహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2017లో నమోదైన దళితులపై అత్యాచార కేసులు 1515

దళితుల కోసం గుజరాత్‌ ప్రభుత్వం చేస్తున్నదేంటి?

గుజరాత్‌లో దళితులపై అత్యాచార ఘటనలు ఇటీవలి కాలంలో చాలానే జరిగాయి. 2016లో జరిగిన ఉనా ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ అంశంపై గుజరాత్ సామాజిక న్యాయం, హక్కుల శాఖ మంత్రి ఈశ్వర్ పర్మార్‌తో బీబీసీ మాట్లాడింది. గుజరాత్‌లో దళితులపై అత్యాచారాల ఘటనలు పెరుగుతుండడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లోని ప్రతి గ్రామం నుంచి సర్పంచ్‌లను పిలిచి తమ తమ గ్రామాల్లో సౌహార్ద సంబంధాలు నెలకొనేలా చూడాలని కోరనున్నట్టు ఆయన చెప్పారు.

గుజరాత్‌లో కులాల మధ్య వైషమ్యాలు పెరుగుతుండడం విచారకరమన్నారు. పార్సా గ్రామంలో సర్పంచ్ రెండు కులాల మధ్య గొడవను శాంతింపజేసి ఆదర్శంగా నిలిచారని ఆయన చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ సర్పంచ్‌లు ఇలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు.

దళితుడి వివాహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ

గుజరాత్‌లో దళితుల పరిస్థితి

జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, గుజరాత్‌లో 2016లో షెడ్యూల్డు కులాలపై 1322 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2015లో ఈ సంఖ్య 1010.

దళితులపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ఆర్‌టీఐ కార్యకర్త కౌశిక్ పర్మార్ వేసిన పిటిషన్ ద్వారా గుజరాత్‌లో దళితులపై జరుగుతున్న అత్యాచారాల గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ వివరాల ప్రకారం, గుజరాత్‌లో 2017లో అట్రాసిటీ చట్టం కింద 1515 కేసులు నమోదయ్యాయి.

2017లో దళితులపై జరిగిన అత్యాచార ఘటనల్లో 25 హత్యలు, 71 దాడులు, 103 రేప్ కేసులు నమోదయ్యాయి.

సీనియర్ పాత్రికేయుడు ప్రకాశ్ షా ఈ అంశంపై బీబీసీతో మాట్లాడుతూ, గుజరాత్‌లో దళితులపై అత్యాచారాలు గతంలోనూ జరుగుతూ ఉండేవి కానీ బీజీపీ పాలనలో ఇవి పెరిగిపోతున్నాయన్నారు.

"ప్రస్తుతం జరుగుతున్న అత్యాచార కేసుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అంశం ఏంటంటే, దాడులకు పాల్పడుతున్న వారు తమ అగ్రకుల ఆధిపత్యాన్ని బాహాటంగా చాటుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందుత్వ భావజాలంలో భాగంగా దళిత వ్యతిరేక మనస్తత్వం బాగా పెరిగిపోతోంది" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)