గుజరాత్: గుర్రం ఎక్కిన 'నేరానికి' దళిత యువకుడి హత్య

ఫొటో సోర్స్, SOCIAL MEDIA / BHARGAV PARIKH/BBC
గుర్రం ఎక్కిన నేరానికి గుజరాత్‌లో ఓ దళిత యువకుడిని కొందరు హత్య చేశారు.
భావ్‌నగర్ జిల్లాలోని టీంబా గ్రామానికి చెందిన ప్రదీప్ రాథోడ్ గుర్రంపై ఎక్కి ఇంట్లోంచి బయటకు వెళ్లి శవంగా మారాడు. ఆయనకు 21 ఏళ్లు.
ఈ ఘటన గురువారం రాత్రి పొద్దుపోయాక జరిగింది. తిరిగొచ్చాక కలిసి భోజనం చేద్దామని ఇంట్లోంచి బయటకు వెళ్లడానికి ముందు ప్రదీప్ తన తండ్రితో చెప్పాడు. రాత్రి చాలా సేపటి దాకా ఆయన తిరిగి రాకపోవడంతో తండ్రి వెతకడం ప్రారంభించారు.
గ్రామానికి కొద్ది దూరంలో ప్రదీప్ శవం లభ్యమైంది. పక్కనే గుర్రం కట్టేసి ఉంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
శవపరీక్ష కోసం ప్రదీప్ శవాన్ని భావ్‌నగర్‌లో ఉన్న సర్ టి. హాస్పిటల్‌కు తరలించారు. అయితే కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకోవడానికి నిరాకరించారు.
ప్రదీప్ హత్యకు పాల్పడ్డ నిందితులందరినీ అరెస్ట్ చేసే దాకా తాము శవాన్ని తీసుకునేది లేదని వారంటున్నారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA/BHARGAV PARIKH/BBC
ఆ సాయంత్రం అసలేం జరిగింది?
మృతుడు ప్రదీప్ తండ్రి కాలూభాయి బీబీసీ ప్రతినిధి భార్గవ్ పారేఖ్‌తో మాట్లాడుతూ, రెండు నెలల క్రితం ప్రదీప్ గుర్రాన్ని కొన్నాడని తెలిపారు.
"బయటి గ్రామాల వాళ్లు ప్రదీప్‌ను గుర్రం ఎక్కవద్దని అనే వాళ్లు. అతన్ని బెదిరించారు కూడా" అని ఆయన అన్నారు.
"దాంతో ప్రదీప్ తన గుర్రాన్ని అమ్మేయాలని అనుకున్నాడు. కానీ నేనే వారించాను. నిన్న సాయంత్రం ప్రదీప్ గుర్రం ఎక్కి పొలం వైపు వెళ్లాడు. ఇంట్లోంచి వెళ్లడానికి ముందు, తాను తిరిగొచ్చాక కలిసి భోంచేద్దామని అన్నాడు."
ఎంతకూ అతడు తిరిగిరాకపోవడంతో వెతకడానికి బయలుదేరానని కాలూభాయి చెప్పారు. టీంబా గ్రామానికి కొద్ది దూరంలో ప్రదీప్ శవం లభ్యమైనట్టు ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA/BHARGAV PARIKH/BBC
టీంబా గ్రామంలో దాదాపు 300 జనాభా ఉంటుంది. గుర్రం ఎక్కొద్దంటూ ప్రదీప్‌ను పీప్రాలా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎనిమిది రోజుల క్రితం బెదిరించారని కాలూభాయి పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు వారి పేర్లు తెలియదనీ, అయితే వాళ్లు గుర్రాన్ని అమ్మేయాలని ఒత్తిడి చేసినట్టు ఆయన తెలిపారు. అలా చేయకపోతే చంపేస్తామని వారు బెదిరించారని కూడా కాలూభాయి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉమ్రాయా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ కేజే తల్పడా మాట్లాడుతూ, "మేం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. కేసు విచారణ వేగంగా జరగడానికి భావ్‌నగర్ క్రైం బ్రాంచ్ మద్దతు తీసుకుంటున్నాం" అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుజరాత్ ప్రభుత్వం ఈ హత్య విషయంలో స్పందించింది. "ఘటనా స్థలానికి వెళ్లాలని మేం భావ్‌నగర్ జిల్లా ఎస్‌పీ, కలెక్టర్‌లను ఆదేశించాం. ఈ కేసుకు సంబంధించి వెంటనే నివేదిక అందజేయాలని కోరాం. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తాం" అని సామాజిక న్యాయ శాఖ మంత్రి ఈశ్వర్‌భాయి పర్మార్ చెప్పారు.
ఈ ప్రాంతంలో దళితులపై అత్యాచారాలు పెరిగిపోయాయని దళిత నేత అశోక్ గిల్లాధర్ అన్నారు. గతంలోనూ దళితుల హత్యలు జరిగాయని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








