చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్: 'ఇదో చిన్న కేసు.. మీడియానే పెద్దది చేసి చూపిస్తోంది'

చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో ఆందోళన చేసిన సమయంలో నమోదైన కేసులో ఈ వారెంట్ జారీ అయింది.

చంద్రబాబుతో పాటు, ఆనాటి ఆందోళనలో పాల్గొన్న ప్రస్తుత రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు, మరో 14 మంది నాయకులకు కూడా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.

వీరందరినీ అరెస్టు చేసి సెప్టెంబర్ 21 లోగా కోర్టు ముందు హాజరుపరచాలని ధర్మాబాద్ పోలీసులను మేజిస్ట్రేట్ ఆదేశించారు.

2010లో ఏం జరిగింది?

గోదావరి నదిపై నాందేడ్ జిల్లాలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.

అక్రమంగా కడుతున్న ఆ ప్రాజెక్టును నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ దిల్లీలోనూ పలుమార్లు అఖిలపక్ష నాయకులు ధర్నాలు, నిరసలు చేపట్టారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

ఆ ప్రాజెక్టును 'సందర్శించేందుకు' 2010లో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు కలిసి వెళ్లారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్రలో అరెస్టు అయిన తర్వాత హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట చంద్రబాబు నిరసన

నాందేడ్ జిల్లాలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు వీల్లేదన్నారు. దాంతో తొలుత రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద ధర్నా చేపట్టిన టీడీపీ నాయకులు, తర్వాత బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

వారిని తీసుకెళ్లి ధర్మాబాద్‌లోని ఓ ఐటీఐ కళాశాలలో ఉంచారు. అనంతరం విమానంలో హైదరాబాద్‌కు పంపించారు.

మహారాష్ట్ర పోలీసులు తమపట్ల క్రూరంగా వ్యవహరించారని, లాఠీ ఛార్జి చేసి ఎమ్మెల్యేలను కొట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.

అమలులో ఉన్న నిషేధాజ్ఞలను పట్టించుకోలేదని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నారంటూ చంద్రబాబుపై ధర్మాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఓ వ్యక్తి పిటిషన్‌ వేయడంతో ఎనిమిదేళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

'ఇది మోదీ, జగన్, కేసీఆర్‌ల కుట్ర'

సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ప్రధాని మోదీ, వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ పన్నిన మహా కుట్రలో భాగమే ఈ అరెస్టు వారెంట్ అని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

తాజా పరిణామంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును బీబీసీ సంప్రదించగా... ఆయన మాట్లాడుతూ "తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ఇలా చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించే అవకాశం చంద్రబాబుకు వచ్చింది. ఇప్పుడు ఆయన్ను ఐక్యరాజ్య సమితిలో పాల్గొనకుండా చేసే కుట్రలో భాగమే ఈ వారెంట్. 23న ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంటే, 21న కోర్టుకు హాజరు కావాలని వారెంట్ జారీ చేశారు. ఆపరేషన్‌ గరుడలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. 2019 ఎన్నికలకు, మోదీ ప్రభుత్వానికి ఇదొక పరాకాష్ఠ. మోదీ, జగన్‌, కేసీఆర్‌ కలిసి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు. మోదీ కుట్రలను చంద్రబాబు చేధిస్తారు" అని ప్రత్తిపాటి అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

బాబుపై కుట్ర మాకేం అవసరం?: టీఆర్‌ఎస్

చంద్రబాబుపై కుట్రపన్నాల్సిన అవసరం తమకు లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ టీ. భాను ప్రసాద్ రావు అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ... "బీజేపీకీ, టీఆర్‌ఎస్‌కి మధ్య పొత్తు అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. అలాంటిది మోదీతో కలిసి చంద్రబాబుపై కుట్రపన్నడం ఏంటి? అసలు ఆయనపై కేసు నమోదు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కేసులో కోర్టు వారెంట్ జారీ చేసింది. అది కోర్టు పరిధిలోని విషయం. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి (ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు) ఇతరుల మీద అసత్య ఆరోపణలు చేయడం సరికాదు. ఇప్పుడు చంద్రబాబును తెలంగాణ ప్రజలు మరచిపోయారు. అలాంటి వ్యక్తి గురించి పట్టించుకోవాల్సిన అవసరం టీఆర్‌ఎస్‌కి కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి గానీ ఏమాత్రం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదో చిన్న కేసు మాత్రమే

ఉద్యమాలు, ఆందోళనలు చేసినందుకు ఇలాంటి కేసులు చాలా నమోదవుతుంటాయని, ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను మరీ సీరియస్‌గా చూడాల్సిన అవసరం లేదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయవాది వేణుగోపాల్ రెడ్డి అన్నారు.

"అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారని చంద్రబాబుపై అప్పుడు కేసు పెట్టారు. ఇన్నిరోజులు ఆయన తరఫున ఎవరో ఒకరు లాయర్ వెళ్లి ఆ కేసును మూసివేయించుకుంటే అయిపోయేది. కానీ ఆ పని చేయలేదు. దాంతో ఇన్నాళ్లూ వేచిచూసిన కోర్టు ఇప్పుడు కోర్టు నాన్‌ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. అయినా, ముఖ్యమంత్రి కావడం వల్ల ఇన్నిరోజులు రాలేకపోయారని ఓ పిటిషన్ వేస్తే, కోర్టు ఆ వారెంట్‌ను వెనక్కి తీసుకుంటుంది. ఈ వారెంట్ విషయాన్ని మీడియానే పెద్దది చేసి చూపిస్తోంది" అని వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)