సైక్లింగ్‌తో లైంగిక సామర్థ్యానికి ముప్పుందా?

ఫొటో సోర్స్, Getty Images
సైక్లింగ్ వల్ల నిజంగా పురుషల లైంగిక సామర్థ్యం దెబ్బ తింటుందా అన్న సందేహం చాలా కాలంగా సైక్లింగ్ చేసే వారిని పట్టి పీడిస్తోంది.
దీంతో సైక్లింగ్‌పై అనేక సిద్ధాంతాలు, ఊహాగానాలు వెలువడ్డాయి.
కొందరు అది పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని అంటారు.
సైక్లింగ్‌తో లైంగిక సామర్థ్యం కోల్పోతారని మరికొందరంటే.. లైంగిక సున్నితత్వం తగ్గిపోతుందని ఇంకొందరు అంటారు.
అయితే ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
నో ప్రాబ్లం
ఈ పరిశోధనలో సుమారు 2,500 మందికి పైగా సైక్లిస్టులను పరిశీలించారు. 500 మంది స్విమర్లు, 800 మందికి పైగా రన్నర్లతో పోల్చి చూశారు.
ఈ పరిశోధనలో పాలు పంచుకున్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బెంజమిన్ బ్రేయర్, ఈ ఫలితాలు సైక్లిస్టులకు చాలా ఊరటను ఇస్తాయంటున్నారు.
సైక్లింగ్ వల్ల వచ్చే లాభాలతో పోలిస్తే దాని వల్ల రిస్క్ చాలా తక్కువ అని ఆయన తేల్చి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తన పరిశోధనలో డాక్టర్ బెంజమిన్ సైక్లిస్టుల లైంగిక ఆరోగ్యం, మర్మాంగాల వద్ద తిమ్మిరి లేదా పుండ్లు వంటి వాటిపై ఒక ప్రశ్నావళిని రూపొందించారు.
వాటిపై అందిన జవాబులను పరిశీలించగా - స్విమ్మర్లు, రన్నర్లతో పోలిస్తే, సైక్లిస్టుల లైంగిక, మూత్ర సంబంధమైన సమస్యలు పెద్దవేమీ కావని తేలింది.
సైకిల్ తొక్కడం వల్లే అంగస్తంభన సమస్యలు ఏర్పడుతున్నట్లు చెప్పడానికి నిర్ధిష్టమైన కారణాలేమీ లేవని డాక్టర్ బెంజమిన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
8 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుంటే..
''సైకిల్ తొక్కడం కన్నా, ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా కంప్యూటర్ ముందు లేదా ఒకేచోట కూర్చోవడమే లైంగిక సామర్థ్యాన్ని ఎక్కువగా దెబ్బ తీస్తుంది'' అని ప్రొఫెసర్ బెంజమిన్ వెల్లడించారు.
అయితే ఈ పరిశోధన ద్వారా సైక్లిస్టులలో యురెత్రల్ కన్‌స్ట్రిక్షన్ - అంటే మూత్ర ప్రవాహంలో సమస్య తలెత్తే అవకాశం ఉందని గుర్తించారు.
అంతే కాకుండా మొత్తం సైక్లింగ్ చేసే సమయంలో 20 శాతం సమయం విరామం తీసుకుంటే దాని వల్ల అంగాల్లో తిమ్మిరి తగ్గే అవకాశం ఉందని గుర్తించారు.
దీని పరిష్కారం కోసం సరైన సాడిల్ డిజైన్‌ను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ పరిశోధన ఫలితాలు ఖచ్చితంగా సైక్లిస్టులకు ఆనందాన్ని ఇచ్చేవే.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








