పగలు టైలర్... రాత్రి కిల్లర్ - ‘33 మందిని హత్య చేశాడు.. అంతా ట్రక్కు డ్రైవర్లు, క్లీనర్లే’

ఫొటో సోర్స్, SHURIAH NIAZI/BBC
- రచయిత, షురై నియాజీ
- హోదా, భోపాల్ నుంచి, బీబీసీ కోసం
తొమ్మిదేళ్లలో 33 మందిని హత్య చేశాడన్న ఆరోపణలపై భోపాల్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ట్రక్కు డ్రైవర్లు, క్లీనర్లను లక్ష్యంగా చేసుకొని ఆదేశ్ ఖామరా అనే వ్యక్తి ఈ హత్యలు చేశాడని పోలీసులు చెబుతున్నారు.
విచారణలో భాగంగా ఆదేశ్ రోజుకో కొత్త విషయం చెబుతున్నాడని, భవిష్యత్తులో మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో ఆదేశ్ ఈ హత్యలు చేశాడని, డ్రైవర్లను చంపాక, ట్రక్కులోని సామగ్రిని అతడు లూటీ చేసేవాడని పోలీసులు తెలిపారు.
‘ఇప్పటిదాకా 33 హత్యలు చేసినట్లు ఆదేశ్-అతడి గ్యాంగ్ సభ్యులు ఒప్పుకున్నారు. వీటిలో చాలా హత్యలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం మా దగ్గర ఉంది. ఇంకొన్ని కేసుల్లో విచారణ జరుగుతోంది. 5-6 రాష్ట్రాల పరిధిలో ఈ హత్యలు జరిగినట్లు భావిస్తున్నాం’ అని భోపాల్ డిప్యుటీ డీజీపీ ధర్మేంద్ర చౌదరి చెప్పారు.
ఆదేశ్, అతడి గ్యాంగ్ సభ్యులు హైవే పైన ట్రక్కు డ్రైవర్లను పరిచయం చేసుకొని, పానీయాల్లో మత్తుపదార్థాలు కలిపి వారికి ఇచ్చేవారని, తరువాత డ్రైవర్‌ను హత్య చేసి ట్రక్కు తీసుకొని పారిపోయేవారని పోలీసులు వివరించారు. ఆ ట్రక్కులోని సామాన్లను ఆదేశ్ అమ్మేసేవాడని తెలిపారు.
మధ్యప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ కొందరు ట్రక్కు డ్రైవర్లను హత్య చేసినట్లు వీళ్లు ఒప్పుకున్నారని ధర్మేంద్ర చెప్పారు.

ఫొటో సోర్స్, SHURIAH NIAZI/BBC
గత నెల 15న భోపాల్ పోలీసులకు 25ఏళ్ల మాఖన్ సింగ్ మృతదేహం లభించింది. ఆ కేసు విచారణలో భాగంగా... మాఖన్ భోపాల్‌లోని పారిశ్రామికవాడ నుంచి ఇనుము లోడ్‌తో ఉన్న ట్రక్ తీసుకొని బయల్దేరినట్లు తెలిసింది. కానీ అనుమానాస్పద స్థితిలో అతడు భోపాల్ శివార్లలో హత్యకు గురయ్యాడు. ఖాళీ ట్రక్కు కూడా పోలీసులకు దొరికింది.
ఈ కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని విచారిస్తే మరొకరి పేరు బయటికొచ్చింది. అలా విచారణ ముందుకు సాగే కొద్దీ ఒక్కో కొత్త పేరు బయటకు రాసాగింది. మొత్తంగా చివరికి తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
వాళ్లిచ్చిన సమాచారం మేరకు ఉత్తర్ ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ అడవుల్లో పోలీసులు ఆదేశ్‌ను పట్టుకున్నారు. ఆదేశ్ వృత్తి రీత్యా టైలర్. భోపాల్‌లోని మండీదీప్ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్లోనే అతడికో దుకాణం ఉంది.
ఆ ప్రాంతంలో టైలర్‌గా అతడికి మంచి పేరుంది. ఆదేశ్‌కు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు.
ఉదయం స్థానికుల మధ్య సాధారణ దర్జీగా తిరిగే ఆదేశ్, రాత్రి పూట నేరస్థుడి అవతారం ఎత్తుతాడని పోలీసులు చెబుతున్నారు. 2010 నుంచి అతడి హత్యాకాండ మొదలైందని అంటున్నారు.
కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్, అమరావతి ప్రాంతాల్లో ఇద్దరు ట్రక్ డ్రైవర్లు హత్యకు గురయ్యారు. ఆ తరువాత మధ్యప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే వెలుగు చూశాయి. ఆ పైన ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా నేరాలు జరిగాయి.

ఫొటో సోర్స్, SHURIAH NIAZI/BBC
మొదట్లో ఆదేశ్, ఇతర గ్యాంగ్ సభ్యులతో కలిసి ఈ నేరాల్లో పాల్గొనేవాడని, కానీ ఈ ఏడాది జనవరి నుంచి అతడే స్వయంగా హత్యలు చేయడం ప్రారంభించాడని పోలీసులు చెబుతున్నారు. ఆ నేరాల్లో అతడి సహాయంగా ఉన్న జయకరణ్ అనే వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు.
‘12-14 చక్రాలున్న ట్రక్కులను వీళ్లిద్దరూ లక్ష్యంగా చేసుకునేవారు. సామన్లను ఖాళీ చేశాక ఈ ట్రక్కులను మధ్యవర్తుల సాయంతో ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్టాల్లో అమ్మేసేవారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆదేశ్‌కు జయకరణ్ పరిచయమయ్యాడు. క్రమంగా ఆదేశ్ సొంత గ్యాంగ్ తయారు చేసుకున్నాడు. ప్రతి హత్య తరువాత జయకరణ్‌కు రూ.30వేల దాకా అందేవి’ అని పోలీసులు చెప్పారు.
ఆదేశ్ చాలా తెలివిగా, పక్కాగా నేరాలకు పాల్పడేవాడని, అందుకే ఇన్నేళ్లుగా ఆ హత్యలు చేసింది ఎవరనే దానిపై ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు అంటున్నారు.
‘ప్రతి హత్య తరువాత ఆదేశ్ తన ఫోన్, సిమ్ కార్డు మార్చేసేవాడు. అతడు ఇప్పటిదాకా దాదాపు 50 ఫోన్లు, 43 సిమ్ కార్డులను ఉపయోగించాడు. అతడు పూర్తి ఆరోగ్యవంతుడు. మానసికంగానూ ఎలాంటి సమస్యా లేదు’ అని ధర్మేంద్ర చౌదరి తెలిపారు.
‘ట్రక్కు డ్రైవర్లు చాలా దూరం ప్రయాణిస్తారని, వాళ్లలో కొందరు మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటారని ఆదేశ్ గ్రహించాడు. అందుకే వాళ్లతో స్నేహం చేసి, మద్యంలో మాదక ద్రవ్యాలు కలిపి, లేదా మాదక ద్రవ్యాలను ఎక్కువగా ఇచ్చి అపస్మారక స్థితిలోకి నెట్టి హత్య చేసేవాడు. ఆ తరువాత ట్రక్కును తీసుకొని పారిపోయేవాడు.’
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








