కిమ్‌తో వన్ టు వన్ భేటీకి ట్రంప్ రెడీ!

కిమ్ జోంగ్ ఉన్, డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AFP

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తొలగిపోవడానికి మార్గం సుగమమైంది. చర్చలకు రావాలన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు.

ఈ కీలక పరిణామాన్ని దక్షిణ కొరియా జాతీయ సలహాదారు చున్ యు యంగ్ వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. కిమ్ జోంగ్ లేఖను ఈయనే ట్రంప్‌కు అందించారు.

అణ్వాయుధ పరీక్షల నిలిపివేతకు కిమ్ అంగీకరించారని, ‘అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నా’నని కిమ్ స్పష్టం చేశారని కూడా ఆయన చెప్పారు.

కొన్ని నెలల పాటు సవాళ్లు, ప్రతిసవాళ్లు, హింస తర్వాత ఈ పరిణామం కీలక మలుపుగా కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, వీడియో: విలేకరులతో మాట్లాడుతున్న చున్

ఈ వారం దక్షిణ కొరియా ప్రతినిధి బృందం తొలిసారి ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌తో ప్యాంగ్యాంగ్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చలు జరిగాయి.

ఉత్తర కొరియాతో చర్చలు జరపటంలో అర్థం లేదని ఒకప్పుడు చెప్పిన ట్రంప్.. తాజా పరిణామాలు ‘గొప్ప ముందడుగు’ అని అభివర్ణించారు.

అయితే, నిర్ధిష్టమైన అంగీకారానికి వచ్చే వరకూ ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

line
పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

line

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అనంతరం దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చున్ వైట్‌హౌస్ బయట మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడి ‘తీవ్ర ఒత్తిడి విధానం’, అంతర్జాతీయ సంఘీభావం కారణంగానే ఈ దశకు చేరుకున్నామని చెప్పారు.

‘‘ఉత్తర కొరియా అణ్వాయుధ, క్షిపణి పరీక్షలు చేయదని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అణు నిరాయుధీకరణకు కూడా ఆయన కట్టుబడి ఉన్నారు. ఇదే విషయాన్ని నేను ట్రంప్‌కు చెప్పాను’’ అని చున్ తెలిపారు.

ఈ పరిణామాలను ట్రంప్ అభినందించారని, శాశ్వత అణునిరాయుధీకరణను సాధించేందుకు కిమ్‌ జోంగ్ ఉన్‌ను మే నెల నాటికల్లా కలుస్తానని చెప్పారని కూడా చున్ వెల్లడించారు.

ఇంత వరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ ఉత్తర కొరియా పాలకుడితో భేటీ కాలేదు. ఒకవేళ ఇప్పుడు అలాంటి భేటీ జరిగితే అది రాయబార చరిత్రలో గొప్ప పరిణామం అవుతుంది.

ట్రంప్-కిమ్ చర్చలు ఎక్కడ జరుగుతాయన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా, కొరియాల సరిహద్దుల్లో ఉన్న 'డీమిలిటరైజ్డ్ జోన్‌'లో కానీ బీజింగ్‌లో కానీ జరిగే అవకాశం ఉంది.

అమెరికా-దక్షిణ కొరియాల యుద్ధవిన్యాసాలపై ఉత్తర కొరియా కన్నెర్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా-దక్షిణ కొరియాల యుద్ధవిన్యాసాలపై ఉత్తర కొరియా కన్నెర్ర

ఇది ఎంత వరకు నిజం?

ఈ అంశంపై దక్షిణ కొరియా రాజధాని సోల్‌లోని బీబీసీ ప్రతినిధి లారా బికెర్ స్పందిస్తూ.. అణ్వాయుధాలను విడిచిపెడతామని ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పకపోవటాన్ని గమనించాలని తెలిపారు. అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నామని, అలా చేస్తామని మాత్రమే ఉత్తర కొరియా చెబుతోంది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన ప్రచార కార్యక్రమంలో విజయం సాధించారనే చెప్పాలని, ట్రంప్ కూడా తానే గెలుపొందానని భావిస్తున్నారని లారా తెలిపారు.

కిమ్‌ను తరచూ చులకన చేసి మాట్లాడిన ట్రంప్ గతేడాది.. ‘‘ప్రపంచం ఎన్నడూ చూడని ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది’’ అంటూ కిమ్‌ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు.

అయితే, ఈ చర్చల ద్వారా ఉత్తర కొరియా ఏం కోరుకుంటోందన్న అంశంపై స్పష్టత లేదని లారా వివరించారు.

ట్రంప్‌తో దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చున్ యు యంగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ట్రంప్‌తో దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చున్ యు యంగ్

ఎవరేమన్నారు?

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయి-ఇన్ చర్చలను ఒక 'అద్భుతం'గా అభివర్ణించారు.

''ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌లు సమావేశమైతే, కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధ నిరాధీకరణ గాడిలో పడుతుంది'' అని మూన్ అన్నారు.

చైనా కూడా ఈ పరిణామాలను ఆహ్వానించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ చర్చలను ఆహ్వానించారు. అన్ని పక్షాలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ - ఇది సరైన చర్య అని కొనియాడారు.

జపాన్ మాత్రం ఆచితూచి స్పందించింది. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ దిశగా నిర్ధిష్టమైన చర్యలు తీసుకునేంత వరకు ఇదే ఒత్తిడిని కొనసాగిస్తామని జపాన్ ప్రధాని షింజో అబె తెలిపారు. చర్చలకు ముందు ట్రంప్‌ను కలవడానికి ప్రయత్నిస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)