భారత్-రష్యా: ఆయుధాలు, మసాలాలు కాకుండా ఇంకేం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
భారత్-రష్యా ద్వైపాక్షిక పెట్టుబడుల మూడు వేల కోట్ల డాలర్ల లక్ష్యం పూర్తయినట్టు భారత విదేశీ వ్యవహారాల శాఖ చెబుతోంది. ఇప్పుడు రెండు దేశాలు ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ద్వైపాక్షిక పెట్టుబడులను అయిదు వేల డాలర్లకు మించి పెట్టాలని భారత్, రష్యా భావిస్తున్నాయి.
గత 11 నెలల్లో మూడుసార్లు రష్యాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇరుదేశాల పెట్టుబడుల కొత్త లక్ష్యాన్ని 2025 నాటికి పూర్తిచేయాలని భారత్ భావిస్తున్నట్టు గత నెలలో తెలిపారు.
1990లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యాకు తటస్థంగా ఉండే కొన్ని మిత్ర దేశాల అవసరం వచ్చింది. అదే సమయంలో భారత్, రష్యా మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
రాజకీయ, ఆర్థిక సహకారాలు ఇచ్చిపుచ్చుకోడానికి రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. రక్షణ పరికరాలను, వాటి విడిభాగాలను సరఫరా చేస్తామని భారత్‌కు రష్యా మాట ఇచ్చింది.
భారత్ నుంచి రకరకాల వస్తువులను దిగుమతి చేసుకోవాలని కూడా రష్యా అప్పుడే నిర్ణయించింది.

ఫొటో సోర్స్, KREMLIN.RU
"భారత్‌కు రష్యా అత్యంత కీలకమైన దేశం. రష్యాతో అనుబంధాని పటిష్టం చేసుకోవాలని మేం అనుకుంటున్నాం" అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు.
"రక్షణ రంగంలో భారత్‌కు రష్యా చాలా సహకరించింది. ఇప్పుడు ద్వైపాక్షిక పెట్టుబడులకు మేం కొత్త రంగాలను కూడా అన్వేషిస్తున్నాం. అణు శక్తి, బ్యాంకింగ్, వాణిజ్యం, ఫార్మా, వ్యవసాయం, విద్య, రవాణా, పర్యాటకం, సైన్స్, అంతరిక్ష సంబంధిత కార్యక్రమాల్లో భారత్, రష్యా కలిసి పనిచేస్తాయి'' అని ఆమె తెలిపారు.
రష్యా 1960 దశకం నుంచే భారత్‌కు అతిపెద్ద రక్షణ సరఫరాదారుగా ఉంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం 2012 నుంచి 2016 మధ్య భారత్ మొత్తం రక్షణ దిగుమతుల్లో 68 శాతం రష్యా నుంచే జరిగాయి.
రక్షణ రంగంలోనే కాదు, భారత్, రష్యా మధ్య చాలా ఉత్పత్తుల వాణిజ్యం జరుగుతోంది. రెండు వైపులా పెట్టుబడులు పెడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా నుంచి భారతదేశానికి
వజ్రాలు-ఆభరణాలు
పెట్రోలియం ఉత్పత్తులు
ఎరువులు
ఇనుము, ఉక్కు
పేపర్ ఉత్పత్తులు
అణు విద్యుత్ కేంద్రం కోసం పరికరాలు
ఖనిజ ఇంధనం
భారత్ నుంచి రష్యాకు
ఫార్మా ఉత్పత్తులు
యంత్రాలు, భాగాలు
ఆహార ఉత్పత్తులు
మసాలాలు
విమాన పరికరాలు
ఆర్గానిక్ కెమికల్స్
పాలిష్ చేసిన వజ్రాలు
గత కొన్నేళ్లుగా భారత్-రష్యా మధ్య వజ్రాభరణాల వ్యాపారంలో వృద్ధి కనిపిస్తోంది. కానీ యూరప్‌లోని బెల్జియం లాంటి ఇతర దేశాలతో పోలిస్తే, ఇది చాలా తక్కువ.
భారత్‌లోని వజ్రాల తయారీదారులు చాలా మంది రష్యాలో వజ్రాల కటింగ్, పాలిష్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే కోరిక వ్యక్తం చేశారు. రష్యాలో తమ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే, అక్కడ ఉన్న అల్‌రోసా గనుల్లో తీసే వజ్రాలు తమకు అందుతాయని వీరంతా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తేయాకు
రష్యాలో ఏటా సుమారు 17 కోట్ల కేజీల తేయాకు వినియోగిస్తున్నారు. భారత్ వాణిజ్యశాఖ లెక్కల ప్రకారం ఇందులో దాదాపు 30 శాతం సరఫరా భారత్ నుంచే జరుగుతుంది.
2020 నాటికి రష్యాకు జరిగే ఎగుమతులను 6.5 కోట్ల కేజీలకు పెంచాలని భారత తేయాకు పరిశ్రమ భావిస్తోంది.
ఫార్మా రంగంలో సహకారం
భారత్-రష్యా మధ్య ఫార్మాస్యూటికల్ రంగంలోనూ సహకారం ఇచ్చిపుచ్చుకోవడానికి అంగీకారం కుదిరింది. దీని ప్రకారం 'రష్యా ఫార్మా 2020' ప్రోగ్రాం కింద భారత్ ఆ దేశంలో కొన్ని జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి. ఇటు భారత్ కూడా 2020 నాటికి దేశం నుంచి ఔషధ ఎగుమతులను 20 బిలియన్ డాలర్లు దాటించాలని భావిస్తోంది.
రహదారి ప్రాజెక్ట్
ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ సిద్ధం చేయడంలో రష్యాకు సహకరించాలని బలంగా కోరుకుంటున్నట్టు భారత ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
ఈ కారిడార్‌ను భారత్, ఇరాన్, రష్యాతోపాటూ మిగతా ఆసియా దేశాల మార్గాలతో అనుసంధానిస్తారు.
అణు ఇంధనం
తమిళనాడులోని కుడంకుళంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉన్న అణు విద్యుత్ కేంద్రం నిర్మించడానికి రష్యా సాయం చేసింది. ఇందులో ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి.
రష్యా కంపెనీ రొస్టాటోమ్ రాబోవు 20 ఏళ్లలో భారత్‌లో 12 అణు ఇంధన రియాక్టర్లు తయారు చేస్తుందని భారత ప్రభుత్వం 2014 చివర్లో చెప్పింది. వీటిలో ఆరు రియాక్టర్ల కోసం తమిళనాడు కుడంకుళంలో స్థలం కేటాయించారు. మిగతా ఆరు రియాక్టర్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి:
- BBC Impact: 'డోలీలో గర్భిణి' కథనానికి స్పందన.. కొండ కింద హెల్త్ సెంటర్ ఏర్పాటు
- భారత్‌కు ఎస్-400: ‘ఇంతకన్నా మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు’
- సైబర్-కుట్రలు: రష్యా మీద అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఆరోపణలు
- భారత్‌లో షాడో బ్యాంకింగ్ సంక్షోభం.. రూ.88504 కోట్ల అప్పుల్లో ఐఎల్ఎఫ్ఎస్
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
- తన ఆధార్ డేటా హ్యాక్ చేయాలని ట్రాయ్ చీఫ్ సవాల్.. ‘చేసి చూపించిన’ గుజరాత్ యువకుడు
- ‘ఒత్తిడికి గురైతే ఒళ్లు పెరుగుతుంది’ జాగ్రత్త!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










