తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ కమిషన్ నిర్ణయం ఎలా తీసుకుంది? ఎందుకు తీసుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓమ్ ప్రకాశ్ రావత్ శనివారం షెడ్యూల్ ప్రకటించారు.
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాలకు షెడ్యూల్‌ను ప్రకటించారు.
అయితే, విలేకరుల సమావేశం ప్రారంభంలోనే తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై రావత్ వివరణ ఇచ్చారు.
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో)తో శుక్రవారం రాత్రి మాట్లాడామని రావత్ చెప్పారు. ఓటర్ల తుది జాబితా ప్రచురించటానికి తుది గడువును మరో రెండు రోజులు పెంచాలని ఆయన కోరారని చెప్పారు.
కాగా, తెలంగాణకు సంబంధించి మరొక అంశం కూడా ఉందని, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని రావత్ చెప్పారు. అక్టోబర్ 8వ తేదీ సోమవారం ఈ కేసు విచారణకు రానుందని, ఆ సందర్భంగా ఓటర్ల తుది జాబితాను కూడా హైకోర్టుకు చూపించాల్సి ఉందని చెప్పారు.
అనంతరం, రాజస్తాన్‌తో కలిపి తెలంగాణ అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెబుతూ షెడ్యూల్‌ను ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో ఓట్లను డిసెంబరు 11, 2018న లెక్కిస్తారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:
తెలంగాణ, రాజస్థాన్ (పోలింగ్ ఒకే దశలో)
నామినేషన్లు: నవంబరు 12 నుంచి 19 వరకు
ఉపసంహరణ గడువు: నవంబరు 22
పోలింగ్: డిసెంబర్ 7

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల కమిషన్ తెలంగాణను సందర్శించలేదు.. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది.. అయినా
షెడ్యూలు ప్రకటించిన తర్వాత విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు రావత్ సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా, తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కమిషన్ ఆ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ పర్యటించలేదని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఒక కేసు పెండింగ్‌లో ఉందని, అలాంటప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ను ఎలా ప్రకటించారని మీడియా అడగ్గా ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.
‘‘ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. హైకోర్టులో కేసు ఓటర్ల తుది జాబితాపైనే. ఓటర్ల జాబితాను ప్రచురించటానికి ముందు హైకోర్టు చూడాలనుకుంది. హైకోర్టు సంతృప్తి చెందిన తర్వాతే తుది జాబితాను ప్రకటిస్తాం. అందుకే ఓటర్ల తుది జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 8వ తేదీ నుంచి 12వ తేదీకి మార్చాం’’ అని రావత్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ పర్యటించకపోవడంపై రావత్ సమాధానం ఇస్తూ.. ‘‘కమిషన్ వెళ్లకపోయినప్పటికీ ఎన్నికల సంఘం అధికార బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించింది. సంబంధిత అధికారులతో సమావేశమై చర్చలు జరిపింది. ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడింది. ఇదే అంశంపై తెలంగాణ సీఈవోను శుక్రవారం దిల్లీ పిలిపించి చర్చించాం’’ అని తెలిపారు.
తెలంగాణ, మిజోరంల్లో ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో సంతృప్తిగా లేమని, ఆ రెండు రాష్ట్రాలనూ తాము సందర్శిస్తామని రావత్ వెల్లడించారు.
ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఎందుకు ఆలస్యమవుతోంది?
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఆలస్యం కావటానికి కారణాలేంటని అడగ్గా.. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతోందని రావత్ చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను ఒకటే సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేశామని, ఈ సాఫ్ట్‌వేర్‌లో ఆంగ్లంలో పేర్లను నమోదు చేస్తే అవి వాటంతట అవే స్థానిక భాషల్లోకి తర్జుమా అవుతాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తెలుగులోకి పేర్ల తర్జుమాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ ప్రక్రియపై తాము ఇంతకు ముందే శిక్షణ ఇచ్చామని, అయితే అలా శిక్షణ పొందిన వారు పూర్తిస్థాయిలో విషయాలను అవగాహన చేసుకోలేకపోయారని, దీంతో కొన్ని తప్పులు చేస్తున్నారని చెప్పారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు కొంతమంది సీనియర్ ఇంజనీర్లను పంపిస్తున్నామని చెప్పారు. ఈ వ్యవహారంపై అత్యున్నత స్థాయిలో.. ఈ కార్యక్రమానికి ఇన్‌ఛార్జి అయిన సీ-డాక్ సంస్థ డైరెక్టర్ జనరల్‌తో సమీక్ష జరిపామని తెలిపారు. తమకు కొంత సమయం పడుతుందని వారు చెప్పారని, కాబట్టే గడువును పొడిగించామన్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరు 7న
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ: అసెంబ్లీ రద్దయింది.. ఇకపై ఏం జరగనుంది?
- కొలువుల కోసం ‘కొట్లాట’ : ఉద్యోగం వస్తదా? రాదా?
- తెలంగాణ శాసనసభ రద్దు: తర్వాత ఏమిటి?
- బీడువారిన నేలను మాగాణంలా మార్చారు!
- తిట్టారంటే జైలుకే: తెలంగాణ ప్రభుత్వ చర్యతో లాభమెంత? నష్టమెంత?
- రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?
- మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు?
- #HisChoice: నేను సెక్స్ వర్కర్ల దగ్గరకు ఎందుకు వెళ్తానంటే....
- భారత్-రష్యా: ఆయుధాలు, మసాలాలు కాకుండా ఇంకేం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










