‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే.....

ఫొటో సోర్స్, Getty Images
ఆ రాత్రిని నేను ఎప్పటికీ మరచిపోలేను. 28 ఏళ్లలో తొలిసారి ఒక స్త్రీ శరీర స్పర్శ తగిలిన రోజది. ఆ మహిళ నా భార్య కాదు, ఒక సెక్స్ వర్కర్. అయినా నాకది ఏమాత్రం తప్పుగా అనిపించలేదు.
నా కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ అనుభవం ఓ వారంపాటు నాలో అలానే ఉండిపోయింది.
నేనేదో కొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్లు తోచింది. అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు.
నాకు ఇప్పటికీ పెళ్లి కాలేదు. గుజరాత్‌లో, మా ఊళ్లో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువ. అందుకే నాలాంటి చాలామందికి ఇంకా పెళ్లికాలేదు.
‘మీ అబ్బాయిది ప్రభుత్వోద్యోగం అయితే పరిస్థితి మరోలా ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగాలపైన ఎవరికీ నమ్మకం లేదు. మీ దగ్గర పెద్దగా భూమి కూడా లేదు కదా...’ అంటూ మా అమ్మానాన్నలతో అమ్మాయిల తల్లిదండ్రులు చెప్పేవాళ్లు.
అప్పుడు నాకు నెలకు రూ.8వేల జీతమొచ్చేది. ఇంట్లో నేనే పెద్దవాడిని. ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేయడానికి చాలా ప్రయత్నించేవారు. పెళ్లయితే సమాజంలో గౌరవం పెరుగుతుందని నాక్కూడా అనిపించేది.
నాకంటే చిన్నవాడైన నా స్నేహితుడు నీరజ్‌కు అప్పుడే పెళ్లయింది. దాంతో నాపైన ఒత్తిడి పెరిగింది.
మేం నలుగురు స్నేహితులం కలిసి దగ్గర్లోని మరో నగరానికి మద్యం తాగడానికి వెళ్లేవాళ్లం. ఓసారి అలా వెళ్లినప్పుడు నా స్నేహితులకు నేను పడుతున్న ఆందోళన అర్థమైంది.
గ్లాసులో బీరు పోస్తూ... ‘ఎందుకు ఇంత బాధ పడతావు? నిన్నో చోటుకు తీసుకెళ్తా. నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా నీకు అంత సుఖం దొరకదు. ప్రపంచంలో చాలా రంగులున్నాయి. వాటన్నింటిని ఆస్వాదించాలంటే నాతో రా’ అని ఓ స్నేహితుడు అన్నాడు.
నేను మొదట భయపడినా, స్నేహితుడు ఒత్తిడి చేయడంతో నలుగురం కలిసి ఓ హోటల్‌కు వెళ్లాం.
నేను గతంలో చాలా నీలి చిత్రాలు చూశాను. కానీ నిజజీవితంలో ఓ మహిళతో కలిసి గడపడం అదే తొలిసారి.
ఆ తరువాత దానిపైన ఇష్టం పెరిగింది. తరచూ హోటళ్లకు వెళ్లడం అలవాటైంది. ఐదేళ్ల వరకు ఇలానే సాగింది. నాకు కావల్సిన సుఖం పొందడానికి ఇదొక సులువైన దారిలా కనిపించింది.

కానీ, ఓ రోజు నేను చేస్తున్న పని గురించి ఇంట్లో తెలిసిపోయింది. మా నాన్నగారికి కోపం నషాళానికెక్కింది. ఆ వయసులో నాపైన చేయిజేసుకోలేదు కానీ, మాటల ద్వారానే తన కోపాన్ని బయటపెట్టారు.
‘నీకు సిగ్గుగా అనిపించలేదా? మీ అమ్మ, అక్క గుర్తు రాలేదా? వాళ్లిప్పుడు బయట ఏ మొహం పెట్టుకుని తిరుగుతారు?’ అని నాన్న తిట్టారు. అక్క వాళ్ల అత్తగారింట్లో కూడా ఈ విషయం తెలిసిపోయింది.
స్నేహితులే మద్యం తాగించి నన్ను హోటల్‌కు తీసుకెళ్లారని, ఆ మత్తులో ఏం చేస్తున్నానో అర్థం కాలేదని చెప్పా. ఇకపైన అలాంటి పనులు చేయనని మాటిచ్చా.
‘ఒక్కసారి మత్తులో చేయొచ్చు. కానీ ఒకే తప్పును ఇన్నేళ్ల నుంచి ఎలా చేస్తున్నావు?’, అని నాన్న నిలదీశారు. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు.
ఇంట్లో వాళ్లందరి తిట్లూ వింటుంటే, నేనేదో చేయరాని ఘోరం చేసినట్లు అనిపించింది.
మూడ్రోజుల వరకూ నాన్న నాతో మాట్లాడలేదు. మూడో రోజున పిలిచి, ‘నీకో సంబంధం చూశా. ఆమెకు గతంలోనే పెళ్లయింది. భర్త చనిపోయాడు. ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. కానీ, అమ్మాయి వాళ్ల కుటుంబం చాలా మంచిది’ అని చెప్పారు.
అమ్మాయి తండ్రికి నా గురించి తెలుసని, అయినా కూడా పెళ్లికి ఒప్పుకున్నారని అన్నాడు. ‘నీక్కూడా 33 ఏళ్లు వచ్చేశాయి. బానే సంపాదిస్తున్నావు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే మేం చాలా సంతోషిస్తాం’ అని నాన్న అన్నారు.

కానీ నేను అప్పటికే మరో మహిళను ఇష్టపడ్డా. నేను తరచూ వెళ్లే హోటళ్లో ఆమె హౌజ్ కీపింగ్ పనిచేసేది. ఆమెకు నా గురించి తెలుసు. అందుకే పెళ్లి ప్రస్తావన తెస్తే ఆమె ఒప్పుకోలేదు. తరువాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
ఒంటరితనం ఎలా ఉంటుందో, పెళ్లి చేసుకోకపోతే ఉండే లోటేంటో నాకు అప్పుడే తెలిసింది. నేను ఇష్టపడిన మహిళను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోకూడదనుకున్నా.
మరోపక్క నా పెళ్లి గురించి ఇంట్లోవాళ్లకు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యేవి. నా పెళ్లి గురించి చుట్టుపక్కలవాళ్లకు ఎందుకంత ఆసక్తో అర్థం కాదు. ఆ ఒత్తిడిని భరించలేక ఇల్లొదిలి వచ్చేశా.
కొత్త నగరానికి వచ్చాక కూడా పాత అలవాటును దూరం చేసుకోలేకపోయా. అక్కడ కూడా తరచూ మహిళల దగ్గరకు వెళ్లేవాడిని. ఒక్కోసారి నాతో పాటు మా బాస్ కూడా వచ్చేవాడు.
ఇప్పుడు నా వయసు 39 ఏళ్లు. కానీ పెళ్లి కాలేదని నేనెప్పుడూ బాధపడను. శారీరక సుఖం విషయంలో నాకు ఎలాంటి లోటూ లేదు. జీవితం ఇలా సాగిపోతోంది. ఇక పెళ్లి గురించి ఆలోచించడం కూడా మానేశా.
నేనిప్పుడు నెలకు రూ.40 వేలకు పైగానే సంపాదిస్తున్నా. నాకిప్పుడు ఏ లోటూ లేదు. కాబట్టి, దేని గురించీ దిగులు పడాల్సిన పనిలేదు.
ఒకవేళ నాకు పెళ్లయ్యుంటే ఇప్పుడెలా ఉండేవాడినో తెలీదు. సమాజం ఎలా కోరుకుంటుందో, నా జీవితం అలా లేదు. కానీ, ఏ ఆలోచనా లేకుండా ఇలా స్వేచ్ఛగా జీవించడమే నాకు సంతోషాన్నిస్తోంది.
(గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తితో మాట్లాడి, అతడి అంతరంగాన్ని అక్షర బద్ధం చేశాం. ఆ వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాం. ప్రొడ్యూసర్: సుశీలా సింగ్)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








