ఇండోనేసియా సునామీ: భారీ నష్టానికి కారణం ‘మట్టి ప్రవాహం’... అసలేంటిది?

ఫొటో సోర్స్, EPA
ఇండోనేసియాలోని పాలు నగరంలో గత వారం సంభవించిన భూకంపం కారణంగా 1350మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ భూకంపం ఫలితంగా ‘మట్టి ప్రవాహం’ (లిక్విఫ్యాక్షన్) రూపంలో మరో విధ్వంసం సంభవించింది.
మట్టిలో పటుత్వం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు అక్కడ మట్టి వదులుగా మారి ప్రవహిస్తుంది. దీన్నే లిక్విఫ్యాక్షన్ అంటారు. భవనాలు, వాహనాలు, రహదారులను సైతం కదిలించే శక్తి ఆ ప్రవాహానికి ఉంటుంది.
సముద్రం ఒడ్డున ఉన్న పాలు నగరంలో ఇదే జరిగింది. ఆ ప్రవాహం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
‘మట్టి ప్రవాహం కారణంగా మా ఇల్లు కొన్ని మీటర్ల దూరం వెళ్లి ఆగిపోయింది. మా చుట్టుపక్కల వాళ్ల ఇళ్లన్నీ ఒక దాని మీద ఒకటి కుప్పలా పడిపోయాయి’ అని పాలు నగరానికి చెందిన ముజైర్ అనే వ్యక్తి తెలిపారు. ఈ మట్టి ప్రవాహ తీవ్రత ఎలా ఉంటుందో ఆ మాటల్ని వింటే అర్థమవుతుంది.

ఫొటో సోర్స్, EPA/DIGITAL GLOBE
ఇతర దేశాల్లో పరిస్థితి
భూగర్భ జలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, సముద్రానికి దగ్గరగా ఉండే ప్రదేశాలు ఈ మట్టి ప్రవాహం కారణంగా గతంలో చాలా నష్టపోయాయని టోక్యో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ యోషిమిచి సుకమోటో చెప్పారు.
2010-11లో న్యూజిలాండ్‌లోని కాంటర్బరీ ప్రాంతంలో వచ్చిన భూకంపం ఫలితంగా మట్టి నీరులా పారింది. దానివల్ల వీధులు, తోటలు, భవనాలు, వాహనాలెన్నో కొట్టుకుపోయాయి.
తాజాగా 2016 నవంబర్‌లో అక్కడి వెల్లింగ్టన్ ఓడరేవు ప్రాంతంలో తలెత్తిన మట్టి ప్రవాహం కారణంగా తీవ్ర ఆస్తినష్టం సంభవించింది. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థలో ఆ ఓడరేవు కీలక పాత్ర పోషిస్తుంది.
2010లో చిలీలో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 800మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 950కి.మీ.ల పరిధిలో మట్టి ఏరులై ప్రవహించింది. ఆ ఉద్ధృతిలో వంతెనలు, పైవంతెనలు, నౌకాశ్రయాలు, డ్యాముల లాంటి ఎన్నో నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.

ఫొటో సోర్స్, Antara Foto/Irwansyah Putra/Reuters
భూకంప ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న జపాన్‌లో 1964, 1995లలో మట్టి ప్రవాహం వల్ల ఎన్నో భవనాలు కూలిపోయాయి. తాజాగా అక్కడి హొక్కైదో దీవిలో గత నెలలో సంభవించిన మట్టి ప్రవాహం కారణంగా 40మందికి పైగా చనిపోయారు.
మట్టి వదులుగా మారి ప్రవహించడం మొదలైతే అది చాలా ప్రమాదకరంగా మారుతుందని, ఎంత పటిష్ఠంగా భవనాలను నిర్మించినా ఈ ప్రవాహం ధాటికి అవి నిలబడలేవని యూకేలోని యాంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్.ఎస్తెర్ నోర్టన్ చెబుతున్నారు. మట్టి ప్రవాహంపై ఆమె చాలా ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు.
‘భూకంపం కారణంగా తలెత్తే మట్టి ప్రవాహం ఎక్కువగా నీటి వనరులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనే జరుగుతుంది. మట్టి సహజ పటుత్వాన్ని కోల్పోవడంతో వంతెనలు, డ్యాములు కూడా కూలిపోతుంటాయి. భవంతులు అచ్చంగా నీటిపై తేలుతున్నట్లే కొట్టుకుపోతాయి’ అని ఎస్తెర్ వివరించారు.
యూరప్‌లో గత పదేళ్లలో భూకంపాల అనంతరం జరిగిన సగానికి పైగా ఆస్తి నష్టానికి మట్టిప్రవాహమే కారణమని తేలింది.

ఫొటో సోర్స్, EPA
పాలు నగరంలో ఏం జరిగింది?
పాలు నగర సమీపంలోని బాలారోవా ప్రాంతంలో మట్టి ప్రవాహం వల్ల 1700కు పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. వందలాదిమంది ప్రజలు ఆ మట్టిలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.
మట్టి ప్రవాహం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారని, 1333 ఇళ్లున్న ఓ గృహ సముదాయం మొత్తం దెబ్బతిందని ఇండోనేసియా ప్రజాపనుల శాఖా మంత్రి బాసుకి హడిముల్‌జోనో తెలిపారు.
పాలు విమానాశ్రయానికి సమీపంలోని పెటోబో ప్రాంతంలోని చాలా భవనాలు మట్టి ప్రవాహంలో తుడిచిపెట్టుకుపోయినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది.
‘భూకంపం కారణంగా భూమి పైపొరలు వదులుగా మారిపోతాయి. అంత భారీ పరిమాణంలో మట్టి నీరులా ప్రవహిస్తే, ఎంత పెద్ద నిర్మాణాలైనా నిలబడలేవు. పెటోబోలో 744 ఇళ్లున్న ఓ సముదాయం కూడా ఈ ప్రవాహంలో ధ్వంసమైనట్టు తెలిసింది’, అని ఇండోనేసియా విపత్తు నిర్వహణ విభాగ అధికార ప్రతినిధి పుర్వో నుగ్రోహో తెలిపారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










