ఇండోనేషియాలో ఇస్లామిక్ స్టేట్ ఎలా బలపడుతోంది?

సురబాయలో మూడు చర్చిలపై జరిగిన పేలుళ్ల ఘటన 2005 తర్వాత అతి పెద్దది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సురబాయలో మూడు చర్చిలపై జరిగిన పేలుళ్ల ఘటన 2005 తర్వాత అతి పెద్దది.

ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఎక్కువగా ఉన్న దేశం ఇండోనేషియా. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు కలిగి ఉన్న కొన్ని గ్రూపులు కొన్నేళ్లుగా ఈ ఆగ్నేయాసియా దేశంలో దాడులకు పాల్పడి వందలాది మంది ప్రాణాలు బలిగొంటున్నాయి.

ఇండోనేషియా, మలేషియా, సింగపూర్‌లపై కొన్ని ఐఎస్ అనుబంధ గ్రూపులు దాడులు చేయవచ్చన్న హెచ్చరికలు 2015 నుంచే ఉన్నాయి.

2016 జనవరిలో ఇండోనేషియా రాజధాని జకార్తాలో వరుస పేలుళ్లు జరిగాయి. దాడి చేసిన నలుగురు వ్యక్తులతో పాటు మరో నలుగురు పౌరులు మృతి చెందారు. దేశంలో ఐఎస్ సంబంధిత మొదటి దాడి ఇదే.

జకార్తాలో దాడి చేసిన వారు తర్వాత తమను తాము ఇండోనేషియాలోని జెమా అన్షారుత్ దౌలా ( జేఏడీ) మిలీషియా గ్రూపుకు చెందిన వారుగా చెప్పుకున్నారు.

ఆగ్నేయాసియాలో జిహాదీలు కావాలనుకునేవారికి ఐఎస్ ఓ ఆకర్షణ కేంద్రంగా తయారైందని పరిణామాలు సూచిస్తున్నాయి.

ఈ ప్రాంతంపై ఐఎస్ పట్టు ఎంత?

జకార్తా దాడి తర్వాత ఆగ్నేయాసియాలో ఐఎస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రభుత్వాలపై, పోలీసులపై ఒత్తిడి పెంచేందుకు, తమ మద్దతుదారులతో మరిన్ని దాడులు జరిపించేందుకు ఈ గ్రూపు ఇండోనేషియా ప్రజలను వాడుకుంటోంది.

దేశంలోని దాదాపు ప్రతి ప్రావిన్స్‌కూ ఐఎస్ వ్యాపించిందని ఇండోనేషియా మిలిటరీ చీఫ్ జనరల్ గటోట్ నుర్మంట్యో 2017లో అన్నారు.

ఐఎస్‌లోని ప్రస్తుత తరంలో ఇంటర్నెట్, జిహాదీ వెబ్‌సైట్ల ద్వారా చేరిన కొత్త వాళ్లు గానీ లేదా పాత తిరుగుబాటుదారు సంస్థల సానుభూతిపరులు గానీ ఉన్నారు. వీరిలో కొందరికి పాత తరం వారితో సంబంధాలు ఉన్నాయి.

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం వీళ్లు తమ ముందు తరం వారిని చాలా పిరికివాళ్లుగా భావిస్తున్నారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు వీళ్లు చిన్న చిన్న కొత్త గ్రూపులుగా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు.

ఇండోనేషియాలోని 30కి పైగా బృందాలు ఐఎస్‌కు విధేయంగా ఉంటామని ప్రమాణం చేశాయి. అంతకు ముందు కొన్ని బృందాలు ఆగ్నేయాసియాలో ఐఎస్ అధికారిక ప్రావిన్స్ స్థాపించాలనే లక్ష్యాన్ని వ్యక్తం చేశాయి.

సిరియా, ఇరాక్‌లో ఐఎస్‌తో కలిసి పోరాటం చేసేందుకు వందలాది ఇండోనేషియన్లు తమ దేశాన్ని వదిలి వెళ్లారని భావిస్తున్నారు.

చాలా మంది పై స్థాయి మిలిటెంట్ నేతలు హత్యకు గురికావడమో, పట్టుబడడమో జరిగినా, దేశవిదేశాల్లోని నేతల నుంచి స్ఫూర్తి పొందుతున్న ఐఎస్ ప్రేరిత ఆత్మాహుతి దళాలు ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉన్నాయి.

దేశంలో గత పన్నెండేళ్లుగా నిర్బంధంలో ఉంచినప్పటికీ జేఏడీ నేత అమన్ అబ్దుర్ రహమాన్ ప్రభావం ఇండోనేషియాలో ఉన్న జిహాదీలపై గణనీయంగా ఉందని భావిస్తున్నారు.

తీవ్రవాద చర్యలకు పాల్పడేలా అనుచరులను రెచ్చగొట్టారనే కేసులో ఆయన ప్రస్తుతం విచారణ ఎదుర్కుంటున్నారు.

2002లో ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ఓ నైట్ క్లబ్‌లో పేలుడు జరిగినప్పటి దృశ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2002లో ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ఓ నైట్ క్లబ్‌లో పేలుడు జరిగినప్పటి దృశ్యం - ఆ పేలుడు 200 మంది ప్రాణాలు బలిగొంది.

ఇండోనేషియా ఎలా స్పందించింది?

2002లో ఇండోనేషియాలో అతి పెద్ద ఉగ్రవాద దాడి జరిగింది. బాలీలోని ఒక నైట్ క్లబ్, బార్ బయట అల్ ఖైదా అనుబంధ సంస్థ జరిపిన జంట బాంబు పేలుళ్లలో 202 మంది మృతి చెందారు. నాటి నుంచి దేశంలోని అతివాద గ్రూపులను ఏరివేసేందుకు అధికారులు సోదాలు ప్రారంభించారు.

ఆ సమయంలో అనేక మంది మిలిటెంట్లను అరెస్టు చేయడం, కాల్చి చంపడం జరిగాయి. ఇండోనేసియా వాసుల మనసు మార్చడంపై దృష్టిపెట్టిన అధికారులు, విడుదలైన కొందరు మిలిటెంట్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కూడా కల్పించారు.

బాలీ బాంబు పేలుళ్ల తర్వాత ఇండోనేషియా అధికారులు 800 మంది మిలిటెంట్లను జైల్లో పెట్టారు, దాదాపు వంద మందిని కాల్చి చంపారు. కానీ వారికి పునరావాసం కల్పించడంలో మాత్రం విజయం సాధించలేకపోయారు.

గతంలో మిలిటెంట్లుగా పని చేసిన కొంత మంది జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి జిహాదీలుగా మారే అవకాశం ఉంది.

ఇటు పోలీసులు తమకు తెలిసిన మిలిటెంట్లపై నిఘా పెట్టడం ద్వారా చాలా దాడులను అడ్డుకున్నామని చెబుతున్నారు.

ఇండోనేషియాలో జరిగిన దాడులు

  • తాజా దాడిలో, 11 మంది వరకూ మృతి చెందారు. ఇండోనేషియాలోని రెండో అతిపెద్ద నగరం సురబయాలో మూడు చర్చిల్లో పేలుళ్లు జరిగాయి. 2005 తర్వాత అతి పెద్ద దాడి ఇదే. బాలీలో ఆత్మాహుతి దాడులు జరిగినప్పుడు 20 మందికి పైగా మృతి చెందారు.
  • గత కొన్నేళ్లుగా ఇండోనేషియాలో ఇస్లామిక్ తీవ్రవాదం కారణంగా ఎన్నో రక్తసిక్త ఘటనలు జరిగాయి.
  • 2002 ( అక్టోబర్ ): బాలీ జిల్లాలో కుటా తీరంలో ఉన్న నైట్ క్లబ్‌లో ఒక బాంబు పేలుడుతో 202 మంది మృతి చెందారు, వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే.
  • 2003(ఆగస్ట్ ): జకార్తాలోని మారియట్ హోటల్ బయట కారు బాంబు పేలుడులో 14 మంది మృతి చెందారు
  • 2004( సెప్టంబర్): జకార్తాలోని ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం బయట కారు బాంబు పేలుడులో 9 మంది మృతి చెందారు, 180 మందికి పైగా గాయపడ్డారు
  • 2005( అక్టోబర్ ): బాలీలో మూడు ఆత్మాహుతి బాంబు పేలుళ్లలో ముగ్గురు బాంబర్స్ సహా 23 మంది మృతి చెందారు.
  • 2009( జులై ): జకార్తాలో మారియట్, రిట్జ్-కార్ల్‌టన్ హోటళ్లపై జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో 9 మంది మృతి చెందారు, చాలా మంది గాయపడ్డారు
  • 2016 ( జనవరి ): జకార్తాలో బాబు దాడి, తుపాదీ కాల్పులలో ఇద్దరు పౌరులు, ఐదుగురు మిలిటెంట్లు మృతి చెందారు. ఈ దాడిని తామే చేసినట్టు ఐఎస్ ప్రకటించింది.
  • 2017 ( మే ): జకార్తాలో ఒక ఆత్మాహుతి బాంబు పేలుడులో ముగ్గురు పోలీసులు మృతిచెందారు, 10 మంది పౌరులు గాయపడ్డారు.
  • 2018( ఫిబ్రవరి ): యోగ్యకర్త, స్లీమన్‌లోని చర్చిలో జరిగిన కత్తి దాడిలో చాలా మంది గాయపడ్డారు.
  • హై సెక్యూరిటీ జైలులో ఇస్లామిస్ట్ మిలిటెంట్ ఖైదీలతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు పోలీసులు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)