మదర్స్ డే: అమ్మ కోసం వెదుకులాటలో అనుకోని మలుపులు

ఫొటో సోర్స్, Kiran Gustafsson
- రచయిత, శైలి భట్
- హోదా, బీబీసీ గుజరాతీ
కంటికి రెప్పలా చూసుకుంటూ.. ఏది అడిగినా కాదనని అమ్మానాన్నలు.. స్వీడన్‌కు చెందిన కిరణ్ గస్టాఫ్సన్ జీవితానికి ఏ లోటూ లేదు. కానీ, ఆమె మాత్రం ఎప్పుడూ ఏదో కోల్పోతున్నాననే భావనతోనే ఉండేది.
ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు ఆమెను కన్నవారు కాదు. గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న అనాథాశ్రమం నుంచి కిరణ్‌ను వారు దత్తత తీసుకున్నారు.
ఈ విషయం కిరణ్ గస్టాఫ్సన్‌కు బాల్యంలోనే తెలుసు. అందుకే తన పెంపుడు తల్లిదండ్రులను చూసిన ప్రతిసారీ ఏదో బంధాన్ని కోల్పోతున్నానని ఆమె భావిస్తుండేది. అందుకే ఎలాగైనా సరే తనకు జన్మనిచ్చిన తల్లిని కలుసుకోవాలని నిశ్చయించుకుంది.
స్వీడన్ నుంచి సూరత్‌కు వచ్చి వెతుకుతూనే ఉంది. కానీ, ఇప్పటికీ ఆమెకు అమ్మ దొరకలేదు. అనుకోని అడ్డంకులు, ఊహించని మలుపులు మాత్రం ఆమె అన్వేషణలో ఎదురవుతూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Kiran Gustafsson
అమ్మ కోసం తరచుగా సూరత్ వస్తున్న కిరణ్ గస్టాఫ్సన్‌ను బీబీసీ ఫోన్‌లో సంప్రదించగా, తన భారత్ పర్యటన, కన్నతల్లి అన్వేషణలో ఎదురైన అనుభవాలను ఆమె మాతో పంచుకున్నారు.
"స్వీడన్‌కు వచ్చేటప్పటికీ నాకు మూడేళ్లు. భారత్‌లో గడిచిన క్షణాలు ఏవీ గుర్తుకు లేవు. 14 మార్చి 1988న నేను స్వీడన్‌లో అడుగుపెట్టానట. దత్తతకు సంబంధించి కోర్టులో ప్రక్రియ పూర్తి చేసిన లాయరు, ఆయన భార్య నన్ను స్వీడన్ ఏయిర్‌పోర్టుకు తీసుకొచ్చారట. స్వీడన్‌లో విదేశీయురాలిగా ఎప్పుడూ భావించలేదు" అని కిరణ్ అన్నారు.
ప్రసుత్తం ఆమె స్వీడన్‌లోని మల్మోలో ఉంటున్నారు. కిరణ్ పెంపుడు తల్లి మరియా వెర్నాంట్ రిటైర్డ్ టీచర్. తండ్రి చెల్ ఒక్యా బిజినెస్‌మెన్, ఫొటోగ్రాఫర్ కూడా.
"నన్ను వీళ్లు వేరుగా ఎప్పుడూ చూడలేదు. నా పట్ల గర్వపడుతున్నామని వాళ్లు తరచూ చెప్పేవారు. అయితే వాళ్లను చూసినప్పుడు ఏదో కోల్పోయానని అనిపించేది. రెండేళ్లుగా ఆ భావన మరింత పెరిగింది."

ఫొటో సోర్స్, Kiran Gustafsson
అమ్మకోసం అన్వేషణ..
తన కన్న తల్లి ఎవరు? ఆమె ఎక్కడుంది? పేరేంటి? ఇవన్నీ ఆమెకు సమాధానంలేని ప్రశ్నలే.
తన స్వీడిష్ కుటుంబ సభ్యులతో కలిసి 2000 సంవత్సరంలో తొలిసారి కిరణ్ గుజరాత్‌లోని సూరత్‌కు వచ్చారు.
ఘోడ్ దడ్ రోడ్డులోని ‘నారీ సంరక్షణ్ గృహ’లోనే ఆమెను స్వీడిష్ దంపతులు దత్తతకు తీసుకున్నారు.
తన మూలాలను తెలుసుకునేందుకు సూరత్‌కు వచ్చిన కిరణ్‌కు నిరాశే ఎదురైంది. కనీసం కన్నతల్లి పేరు కూడా ఆమె తెలుసుకోలేక పోయింది. దీంతో బాధతోనే మళ్లీ స్వీడన్ వెళ్లారు.
తన సోషియాలజీ, హూమన్ రైట్స్ కోర్సులో భాగంగా 2005 మళ్లీ ఆమె సూరత్ వచ్చారు. ఈసారి కూడా నిరాశే ఎదురైంది. తన మూలాలు కనుక్కునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలకు అనాథశ్రమం నుంచి స్పందన కరువైంది.
చదువు పూర్తిచేశాక స్వీడన్‌లోని ఒక కంపెనీలో కెరీర్ కౌన్సెలర్‌గా కిరణ్ ఉద్యోగంలో చేరారు.

ఫొటో సోర్స్, Kiran Gustafsson
తన ఉద్యోగంలో భాగంగా 2016లో కోపెన్‌హెగన్‌లో అరుణ్ ధోలే ఉపన్యాసానికి ఆమె హాజరయ్యారు.
పిల్లల అక్రమ రవాణాపై పోరాడుతున్న నెదర్లాండ్‌లోని ఒక స్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపకుడు అరుణ్ ధోలే.
భారత్‌లో పసికందుగా ఉన్నప్పుడే ఆయనను జర్మనీ కుటుంబం దత్తత తీసుకుంది. పిల్లల అక్రమ రవాణాపై ఆయన మాట్లాడుతూ, అనాథలైన వారు తమ మూలాలను ఎలా కనుక్కోవచ్చో తన ప్రసంగంలో వివరించారు.
ఆయన కూడా తనను కన్నవారి వివరాలను తెలుసుకునేందుకు సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు.
అరుణ్ ఉపన్యాసం కిరణ్‌కు ఉత్సాహాన్నిచ్చింది..
2017లో ధోలేను కలసిన కిరణ్.. కన్నతల్లి ఆచూకీ కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆయన సలహా మేరకు పుణె కేంద్రంగా బాలల సంరక్షణ పై పనిచేస్తున్న అంజలి పవార్‌ను సంప్రదించారు.

ఫొటో సోర్స్, Kiran Gustafsson
తల్లి పేరు తెలిసిందిలా..
"దోలే, కిరణ్‌లు ఇచ్చిన సమాచారంతో సూరత్‌లోని అనాథశ్రమాన్ని సంప్రదించాను. కానీ, నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మొదట్లో ఎలాంటి వివరాలు లభించలేదు" అని అంజలీ పవార్ బీబీసీకి తెలిపారు.
"దత్తత వివరాలను కచ్చితంగా ఇవ్వాల్సిందేనని, కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) మార్గదర్శకాలను ఆ అనాథశ్రమానికి వివరించా. దీంతో వారు కాస్త దిగొచ్చారు. వారిచ్చిన వివరాల ప్రకారం కిరణ్ తల్లి.. ఆమెను రెండేళ్లున్నప్పుడు అనాథాశ్రమంలో వదిలేసింది."
"కిరణ్‌ను చూసేందుకు ఆమె అప్పడప్పుడు అనాథాశ్రమానికి వచ్చేది. కిరణ్‌ను దత్తత తీసుకున్నారనే విషయం కూడా ఆమెకు తెలుసు. అందుకే అనాథశ్రమానికి తానుండే ఇంటి వివరాలు కూడా ఆమె ఇచ్చింది" అని అంజలీ పవార్ బీబీసీకి వివరించారు.
పవార్ అన్వేషణలో కిరణ్ తల్లి పేరు సింధు గోస్వామిగా తేలింది. ఆమె పనిచేస్తున్న చోటికి వెళ్లినప్పటికీ ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోయారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో కిరణ్ సూరత్‌కు వచ్చి తన తల్లితో కలిసి పనిచేసిన వ్యక్తులను కలిసింది.
సింధు గోస్వామికి సంబంధించి తమకు తెలిసిన కొన్ని వివరాలను వారు కిరణ్‌కు చెప్పారు. అయితే, కన్నతల్లిని కనిపెట్టేందుకు ఆమెకు ఆ వివరాలు సరిపోలేదు.
బర్త్ సర్టిఫికేట్‌లో ఊహించని షాక్
కిరణ్ తల్లి ఆచూకీ కోసం అనాథశ్రమానికి వచ్చిన అంజలీ.. అక్కడ కిరణ్ బర్త్ సర్టిఫికేట్‌ను పరిశీలించి షాక్ తిన్నారు. కిరణ్‌కు ఒక కవల సోదరుడు ఉన్నాడనే విషయం బయటపడింది.
"నిజంగా అది నమ్మశక్యంకాని విషయం. నన్ను దత్తతకు తీసుకున్నవాళ్లకు కూడా నాకు కవల సోదరుడు ఉన్నారనే విషయం తెలియదు" అని కిరణ్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Kiran Gustafsson
ఆత్మీయ కలయిక.. కన్నీటి వీడ్కోలు
కవల సోదరుడి విషయం తెలిశాక అతని జాడ కోసం అంజలితో కలిసి కిరణ్ మళ్లీ అన్వేషణ మొదలుపెట్టారు.
వారి ప్రయత్నాలు త్వరగానే ఫలించాయి. సూరత్‌లోని ఒక కుటుంబం అతడ్ని దత్తతకు తీసుకున్నట్లు తెలిసింది.
కానీ, కిరణ్ సోదరుడిని దత్తత తీసుకున్న కుటుంబం అతడికి తాము కన్నతల్లిదండ్రులం కాదు అనే విషయం అప్పటి వరకు అతనికి చెప్పలేదని తెలిసింది.
కానీ, కిరణ్, అంజలీల ఒత్తిడి మేరకు దత్తత విషయాన్ని అతనికి చెప్పడానికి వారు అంగీకరించారు.
32 ఏళ్ల తర్వాత కిరణ్ తన కవల సోదరుడిని కలిసింది. ఆ రోజు ఆమెకు బాగా గుర్తుంది.
'మేం తొలిసారి ఒకరినొకరు చూసుకున్నప్పుడు మా మాధ్య కొద్దిసేపు మౌనమే ఉంది. ఇంటికి వెళ్లగానే నా సోదరుడు ఐస్‌క్రీం ఇచ్చారు. తర్వాత ఒక వాచ్‌ను కానుగా ఇచ్చారు. తన కళ్లు అచ్చంగా నాలాగే ఉన్నాయి. అయితే, ఆ కళ్లలో ఏదో బాధ కనిపించింది.’ అని తన సోదరుడిని కలిసిన క్షణాన్ని ఆమె బీబీసీకి వివరించారు.
మరుసటి రోజు కిరణ్ హోటల్ గదిలో వాళ్లు కలుసుకున్నారు. అక్కడ ఆమె తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు.
'మేం ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం. అయితే, సమాధానం లేని చాలా ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. నా సోదరుడు చాలా మంచివాడు. తనను చూస్తే గర్వంగా ఉంద'ని కిరణ్ అన్నారు.
అప్పుడప్పుడు సోదరుడిని కిరణ్ కలుస్తూనే ఉన్నారు. అయితే కన్న తల్లి కోసం ఆమె అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
తన తల్లితో కలిసి పని చేసిన వ్యక్తి ఇంట్లో ఎట్టకేలకు అమ్మ ఫొటోను కిరణ్ సంపాదించగలిగారు.
అమ్మ ఫొటో చూసినప్పుడు ‘మేం అచ్చం ఒకేలా ఉన్నామనిపిస్తుంద’ని కిరణ్ బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








