ఈ చిత్రాలు... ఇండోనేసియా సునామీ బీభత్సానికి సాక్ష్యాలు

ఫొటో సోర్స్, Reuters
ఇండోనేసియాలోని పాలు నగరంలో భూకంపం, సునామీ సంభవించి ఆరు రోజులు గడిచిన తరువాత బయటకు వస్తున్న చిత్రాలు అక్కడ జరిగిన వినాశనానికి అద్దం పడుతున్నాయి.

భూకంపం, సునామీ ధాటికి ఇప్పటిదాకా దాదాపు 1350మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.
16లక్షల మందికి పైగా ప్రజలు ఈ విపత్తు వల్ల నష్టపోయారని రెడ్ క్రాస్ అంచనా వేస్తోంది. దాదాపు 2లక్షల మందికి తక్షణ సాయం అవసరమని ఐక్య రాజ్య సమితి చెబుతోంది.
పాలు నగరంలో చాలామంది బీచ్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో సునామీ విరుచుకుపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

సునామీ, భూకంపం అనంతరం నివాసిత ప్రాంతాలన్నీ మట్టి దిబ్బల్లా, చెత్త కప్పల్లా మారిపోయాయి. మృతదేహాలతో వీధులు నిండిపోయాయి.
వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. సునామీ అనంతరం నీటితో కలిసి కొట్టుకొచ్చిన ఇసుక ప్రవాహంలో భవనాలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయాయి.

ప్రజలకు ఆహారం, నీరు దొరకడం కష్టంగా మారింది. లూటీలు జరగకుండా పోలీసులు దుకాణాలకు కాపలాగా ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
సునామీ ధాటికి పాలు నగరంలో అన్ని సాధారణ సేవలు నిలిచిపోయాయి.
విద్యుత్, నీటి లభ్యత క్షీణించింది. మురుగు సమస్య పెరుగుతోంది. రవాణ వ్యవస్థ పూర్తిగా ఛిద్రమవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

పాలు నగరంలోని పశ్చిమ భాగంలో నివసించే 3.5లక్షలమంది ప్రజలను, నగరంలోని తూర్పు భాగంతో కలిపే 126మీటర్లు పొడవైన జెమాలమ్ వారధి ధ్వంసమైంది.


చెత్తలో తమకు పనికొచ్చే వస్తువులేమైనా దొరుకుతాయేమోనని ప్రజలు వెతుకుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కువమంది వంట చేసుకోవడానికి ఉపయోగపడే సామగ్రి కోసమే అన్వేషిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

చాలా మృతదేహాలను సామూహికంగా ఖననం చేశారు. శిథిలాల కింద మరిన్ని మృదేహాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

పాలు విమానాశ్రయాన్ని సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. తీవ్రంగా గాయపడిన వారిని తరిలించేందుకు విమాన సేవలను ఉపయోగిస్తున్నారు.
వైమానిక సేవలు పూర్తిస్థాయిలో మొదలైతే పాలు నుంచి బయటపడేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని చిత్రాలు కాపీరైట్లకు లోబడి ఉన్నాయి. Satellite images ©2018 DigitalGlobe, a Maxar company.
ఇవి కూడా చదవండి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








