కోహినూర్ గురించి వినే ఉంటారు. కానీ, ఆ వజ్రం దొరికిన చోటు ఎక్కడో తెలుసా?
కోహినూర్ భారతీయ వజ్రం అని తెలుసు. ఇది కృష్ణా నదీ తీరంలో పుట్టిందనీ తెలుసు.
ఇంకా చెప్పాలంటే, కోల్లూరు గనుల్లో ఇది దొరికిందని చరిత్రకారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
మరి కోల్లూరు గనుల చరిత్ర ఏమిటి? ఇక్కడి గనుల్లో కోహినూర్ ఎక్కడ దొరికింది?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు పరిశోధకుడిని వెంటబెట్టుకొని బీబీసీ తెలుగు ఆ గనుల వద్దకు వెళ్లింది. చరిత్రకారులు, పురాతత్త్వ పరిశోధకులు, భూగర్భ శాస్త్రవేత్తలతో మాట్లాడింది.
తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం పరిశోధనలు చేసిన ఆచార్య ఈమని శివనాగి రెడ్డితో కలిసి బీబీసీ తెలుగు ప్రతినిధి సతీశ్, కోల్లూరు గనుల వద్ద పర్యటించారు.
కృష్ణానదిని ఆనుకుని ఉండే ఈ గ్రామం పులించింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో ఇప్పుడా ఊరు ఖాళీ అయిపోయింది. నదికి అవతలివైపు తెలంగాణ రాష్ట్రం.
కోల్లూరుకు వెళ్లాలంటే.. సత్తెనపల్లి నుంచి ఇరుకైన, కుదుపుల దారిలో ప్రయాణించాలి. ఈ ఊరు దాటిన తరువాత కృష్ణా నది ఒడ్డున పంతులుగారి చెరువు అనే ప్రాంతముంది. సరిగ్గా ఇదే కోహినూర్ వజ్రం దొరికిన ప్రాంతం అనేది చరిత్రకారులు, పురాతత్త్వవేత్తల మాట.
కృష్ణా తీరంలో కోల్లూరు ప్రాంతం భౌగోళికంగా ప్రత్యేకమైనది. ఇక్కడ మట్టికంకర రాళ్ల గుంతలు 2 - 14 అడుగుల వరకూ ఉంటాయి. వజ్రాలు ఉండే పొర దాదాపు అడుగుమందం ఉంటుంది.
నల్లమలకొండల అంచుల్లో ఈ ప్రాంతం ఉంది. వజ్రాలు ఇక్కడ పుట్టడం కాకుండా కొట్టుకువచ్చాయి కాబట్టి ఇంత తక్కువ లోతులో దొరుకుతున్నాయంటారు శాస్త్రవేత్తలు.
మేలిమి వజ్రాలు ఎంతో తక్కువ లోతులో దొరుకుతుండడంతో కోల్లూరు ఆయా కాలాల్లో పాలకుల పాలిట వరం అయింది.
కాకతీయలు, కుతుబ్‌షాహీల కాలంలో ఈ వజ్రాలు ఆయా రాజ్యాలకు అదనపు ఆదాయాలు తెచ్చిపెట్టాయి. కుతుబ్ షాహీల కాలంలో ఈ వజ్రాల ఖ్యాతి యూరోప్ దేశాలకు పాకడంతో గోల్కొండ సామ్రాజ్యం వజ్రాలకు పర్యాయపదం అయిపోయింది.
అశేషమైన సంపద, సంతోషాలకు పర్యాయపదంగా గోల్కొండ అనే పదాన్ని వాడడం ఇంగ్లీషు భాషలో మొదలైంది. కోల్లూరు గనులు అప్పట్లో భారత ఉపఖండంలో అతి పెద్ద గనులు.
అప్పట్లో ఈ ప్రాంతం లక్ష జనాభాతో ఉండేదని యాత్రికుల రచనల ద్వారా తెలుస్తోంది. ఈ గనుల్లో ఎప్పుడూ 30 నుంచి 60 వేల మంది పనిచేస్తూ ఉండేవారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కుతుబ్ షాహీలకాలంలో నిర్మించిన వాచ్ టవర్ చూడవచ్చు.
కోల్లూరు గనుల్లో ఎన్నో మేలిమి, ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు దొరికాయి. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన వజ్రంగా పేరు పొందిన రీజెంట్ కూడా కోల్లూరులోనే దొరికింది.
ఈ జాబితా చాలా పెద్దది. దార్యా-ఏ-నూర్, ఆర్లాఫ్, నిజామ్ డైమండ్, రీజెంట్ డైమెండ్, గ్రేట్ మొఘల్, హోప్ డైమండ్ వంటివి ఈ గనుల్లోనే దొరికాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి.

కాకతీయలు, కుతుబ్‌షాహీల కాలంలో ఈ వజ్రాలు ఆయా రాజ్యాలకు అదనపు ఆదాయాలు తెచ్చిపెట్టాయి.
గార్డన్ మెకంజీ కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు 19వ శతాబ్దంలో నమోదు చేసిన "మాన్యువల్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్"లో కోహినూర్ వజ్రం కృష్ణా తీరంలోని కోల్లూరు గని వద్ద దొరికిందని రాశారు. ఆ ప్రాంతం గోల్కొండ పాలకుల కింద ఉందని ఆయన అన్నారు.
బాప్టిస్ట్ టావెర్నియర్ గోల్కొండ నుంచి తూర్పు దిశగా వారంరోజులు ప్రయాణించి కృష్ణా నదిని దాటి గని-కోలార్ (Gani-Coulour) అనే ప్రాంతాన్ని చేరుకున్నారనీ పులిచింతలకు దక్షిణంగా, బెల్లకొండకు పడమరగా ఉన్న కోల్లూరు ఇదేనని ఆయన రాశారు.
విత్తనాలు నాటుతున్న ఒక రైతు 25 క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం ద్వారాఈ గని బయటపడినట్టు టావెర్నియర్ రాశాడని మెకంజీ చెప్పారు.
మెకంజీ ఉద్దేశం ప్రకారం కోల్లూరులో దొరికిన 900 కేరట్ల వజ్రమే కోహినూర్ అని టావెర్నియర్ సహా ఎక్కువ మంది చరిత్రకారులు నమ్ముతున్నారు.

బ్రిటన్ రాణి కిరీటంలో కోహినూర్ వజ్రం పొదిగి ఉంది.
1980లో స్టీపెన్ హోవర్త్ రాసిన ‘ది కోహినూర్ డైమండ్ - ది హిస్టరీ అండ్ ది లెజెండ్’ పుస్తకంలో కోహినూర్ కోల్లూరులో దొరికిందని రాశారు.
శివనాగిరెడ్డి మాటల్లో చెప్పాలంటే.. కోల్లూరు నుంచే కోహినూర్ తవ్వారు. కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్‌లోని కోల్లూరు గనుల్లో దొరికిందని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో స్పష్టం చేశారు.
కోల్లూరు వజ్రపు గనుల ప్రాశస్త్యం గురించి 13వ శతాబ్దిలోనే మార్కో పోలో రికార్డు చేశారు. పలువురు పరిశోధకులు, చరిత్ర కారులు కోహినూర్ సహా అనేక ప్రపంచప్రఖ్యాత వజ్రాలు కోల్లూరు గనుల్లో కృష్ణానది ఒడ్డున దొరికాయని రాశారు.
1290 ప్రాంతంలో మొదటిసారిగా ఈ గనుల గురించి నమోదయింది. రుద్రమదేవి తెలుగు నేలను పాలిస్తున్న సమయంలో ప్రస్తుతం చీరాల దగ్గరున్న మోటపల్లి రేవు ద్వారా ఇటాలీ యాత్రికుడు మార్కో పోలో వచ్చారు. ఆయన వరంగల్ నుంచి తిరిగి వెళ్లిపోయాక కోల్లూరు దగ్గర వజ్రాల గనుల గురించి గ్రంథస్థం చేశారు.

శివ నాగిరెడ్డి
ఫ్రెంచి యాత్రికుడు బాప్టిస్ట్ ట్రావెర్నియర్ 1689-90 లో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించారు. ఆ సమయంలో సుల్తాన్ అనుమతితో ఈ గనిని సందర్శించారు.
దాదాపు ఆరేడు గనుల్లో వేలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నట్టు ఆయన తన పుస్తకంలో రాశారు.
కుతుబ్ షాహీల తరువాత మొఘలులు, నిజాంల పాలన వచ్చింది. అప్పుడు గని గురించి పెద్దగా తెలియరాలేదు. తర్వాత బ్రిటిష్ వారు దీన్ని వజ్రపు గనుల ప్రాంతంగా గుర్తించారు కానీ, ఎక్కడా కొత్త వజ్రాలను తవ్విన ఆధారాలు లేవు.
మొత్తానికి 13వ శతాబ్దానికే కోల్లూరు గనులు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. అప్పటి నుంచి కుతుబ్ షాహీల పాలన వరకూ అంటే, 17వ శతాబ్దం వరకూ ఇక్కడ గనుల్లో వజ్రాలు తవ్వారు. కానీ బ్రిటిష్ హయాంలో వజ్రాల వేట సాగినట్టు ఆనవాళ్లు లేవు.
భారత ప్రభుత్వం కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏటా ప్రచురించే నివేదికల్లో గనుల విషయాన్ని ప్రస్తావించారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోహినూర్, గ్రేట్ మొఘల్, హోప్, ఆర్లాఫ్ వంటి వజ్రాలను ఉత్పత్తి చేసింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వజ్రాలు తయారయ్యే కింబర్లైట్లు, లాంపొరైట్లు, కాంగ్లోమెరైట్స్ లు ఉన్నాయి’’ అని జిఎస్ఐ తన వార్షిక నివేదికల్లో పేర్కొంది.
కోహినూర్ కోల్లూరులోనే దొరికిందనే విషయాన్ని పరిశోధకులు అందరూ అంగీకరిస్తున్నారు. కాకపోతే ఏ కాలంలో దొరికిందనే విషయం మీద పరిశోధకుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. కాకతీయుల కాలంలోనే కోహినూర్ వజ్రం దొరికిందని ఒక వాదన కాగా, కుతుబ్ షాహీల కాలంలో దొరికిందనేది మరో వాదన.
అలాగే మొఘలులకు కోహినూర్ ఎలా చేరిందన్న కథనం కూడా ఒకటి ఉంది. ఇది ఎక్కడ దొరికింది అన్నదానిపైనే ఆ కథనం ఆధారపడి ఉంది.

దీనిపై చరిత్ర పరిశోధకులు, దక్కన్ హెరిటేజ్ సంస్థ నిర్వాహకులు సఫియుల్లా, “1630 ప్రాంతాల్లో కోల్లూరులో ఒక వితంతువుకి ఈ వజ్రం దొరికింది. ఆమె దీన్ని గ్రామ పెద్దకు ఇచ్చారు.
ఆయన దగ్గర నుంచి నాటి కుతుబ్ షాహీల మంత్రి, వజ్రాల వ్యాపారి అయిన మీర్ జుమ్లాకు ఈ వజ్రం చేరింది. కోహినూర్ 700 క్యారెట్ల పైనే ఉంటుందనీ, కానీ దాన్ని ఆ గ్రామ పెద్ద ముక్కలుగా చేశాడనే కథనం ఉంది. మీర్ జుమ్లా దగ్గర అతి పెద్ద ముక్క ఉంది. కొన్ని ముక్కలు మార్కెట్లోకి వచ్చిఉండొచ్చు.’’ అని వివరించారు.
ఈ అభిప్రాయం రావడానికి దారి తీసిన కారణాలపై మాట్లాడుతూ, ‘‘పిట్ డైమండ్లు అంటే రీజెంట్ (ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉంది), ఆర్లా ఫ్వజ్రాలకు చేసిన గ్రాఫైట్ పరీక్షలు కోహినూర్‌తో పోలి ఉన్నాయి. కాబట్టి, అవి ఒకే రాయికి చెందినవి కావచ్చనే అభిప్రాయం ఉంది. కానీ మరిన్ని పరీక్షలు చేయాలి. ఎందుకంటే ఏ ఒక్క రాయికీ ఇలా ఒకే రకమైన ఫలితాలు రావు.

కుతుబ్ షాహీల సమయంలో ఆ వజ్రం మీర్ జుమ్లా దగ్గరే ఉండిపోయిందా లేక రాజుల దగ్గరఉందా అనేది స్పష్టమైన సమాచారం లేదు.
కానీ 1645 - 1660 ప్రాంతంలో షాజహాన్ తరచూ గోల్కొండ సంస్థానంపై దాడులు చేస్తుండేవారు. దీంతో షాజహాన్‌ని ప్రసన్నం చేసుకోవడానికి ఆ వజ్రాన్ని బహూకరించారు.అలా మొఘలుల దగ్గరకు చేరిన ఆ వజ్రం, నెమలి సింహాసనంలో అద్భుత ఆభరణం అయింది.’’ అని చెప్పారు.

అయితే, వజ్రం మొదట కాకతీయుల కాలంలో దొరికిందనీ వారి నుంచి దిల్లీ చక్రవర్తులకు, అక్కడి నుంచి మాల్వా రాజులకు, అక్కడి నుంచి తిరిగి దిల్లీ రాజులకు, అక్కడి నుంచి గోల్కొండ వచ్చి, తిరిగి మొఘలుల దగ్గరుకు వెళ్లిందనే వాదన కూడా ఉంది.
మొఘలుల దగ్గర నుంచి కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజ కుటుంబానికి ఎలా చేరిందనేది చరిత్రలో స్పష్టంగా ఉంది. కుతుబ్ షాహీల నుంచి మొఘలులు, అక్కడి నుంచి నాదిర్ షా, అతని దగ్గర నుంచి అహ్మద్ షా అబ్దాలి, అతని దగ్గర నుంచి రంజిత్ సింగ్, అతని దగ్గర నుంచి దిలీప్ సింగ్, చివరగా దిలీప్ నుంచి బ్రిటిష్ రాజ కుటుంబానికి ఈ వజ్రం అందింది.
కోల్లూరు గ్రామంలో ఇంకా వజ్రాల వేట సాగుతోంది. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయన్న నమ్మకంతో రోజూ పదుల సంఖ్యలో, సెలవు రోజుల్లో వందల సంఖ్యలో జనం ఇక్కడ వాటి కోసం వెతుకుతుంటారు. భూమికి అడుగు నుంచి రెండు అడుగుల దూరంలో గోతులు తవ్వి, అనుమానం వచ్చిన ప్రతీ రాయినీ సేకరిస్తుంటారు. వాటిని దళారులకు అమ్ముతారు.
‘ఎవరికో వజ్రాలు దొరికాయి’ అనే వార్తలే వీరిని నడిపిస్తున్నాయి. వజ్రాలు దొరికాయా అన్న బీబీసీ ప్రశ్నకు ఎవరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘మాకు దొరకలేదు. వారెవరికో దొరికాయంట. ఇన్ని వేలు.. ఇన్ని లక్షలట..’ ఇలాంటి సమాధానాలు ఎక్కువగా వచ్చాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ వజ్రాల కోసం వెతుకుతున్నారు.

కోల్లూరులో ఇప్పటికీ వజ్రాల కోసం వెతుకుతున్నారు
“నిన్న వందో, రెండొందల మందో వచ్చారట. వాళ్లకు దొరికాయి. ఒకరికి 11 లక్షల ఖరీదు, ఒకరికి రెండున్నర లక్షల విలువైన వజ్రాలు దొరికాయి. ఇంకొంకరికి 50 వేలు విలువైన వజ్రం దొరికింది. మార్కెట్ సెలవని నేను కూడావెతుకుదామని వచ్చా. నాకింత వరకూ ఏమీ దొరకలేదు” అని చెప్పారు ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి వచ్చిన వెంకటేశ్ అనే యువకుడు.
అతను మార్కెట్లో పనిచేస్తాడు. సెలవు రోజు వజ్రాల వేటకు వచ్చాడు.
అందరూ స్వచ్ఛందంగా వజ్రాల వేటకు రాలేదనీ, కొందరు వ్యాపారులు కూలీలను తీసుకువచ్చి వజ్రాలు వెతికిస్తున్నారనీ అక్కడున్న కొందరు చెప్పారు. మంచి వజ్రాలు దొరికితే కొనుక్కోవడానికి సిద్ధంగా కొందరు దళారులు, వ్యాపారుల ప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో తిరుగుతుంటారని వారు చెప్తున్నారు.
కోహినూరు వజ్రం పుట్టిన ప్రదేశం కనుమరుగు కాబోతోంది. పులిచింతల ప్రాజెక్టులో నీరు పెరిగితే ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది. ఇప్పటికే ఈ గ్రామం ఖాళీ చేసేశారు. అందుకే పాడుబడ్డ, కూలిపోతున్న గోడలు, కూల్చేసిన దేవాలయాలు కనిపిస్తాయి.

ఇక్కడ ఇళ్లకు పై కప్పులు ఉండవు. అక్కడక్కడా వ్యవసాయ పనుల కోసం వెళ్లేవారు, వజ్రాల కోసం వస్తున్న వారు, మేకలు పెంచే వారు మాత్రం ఈ చుట్టుపక్కల కనిపిస్తారు. కోల్లూరు గనులతో పాటూ దగ్గరలోనే ఉన్న కొండవీటి రాజుల కోట కూడా నీట మునిగిపోతోంది.







