#HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని

నేను మా అత్తగారి ఇంట్లో వున్నాను. మా మరదలి పెళ్లి జరుగుతోంది. మాతో పాటు మా పాప కూడా ఉంది. మా ఆవిడ పూర్తిగా పెళ్లి సందడిలో మునిగిపోవడంతో పాప నాతోనే ఉండిపోయింది.
మేమంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మా పాప మల విసర్జన చేసింది. వెంటనే నేను లేచి శుభ్రం చేయడానికి వెళ్ళాను. ఇంతలో మా అత్తగారు నన్ను అడ్డుకున్నారు. గదిలో ఒక మూలకి తీసుకెళ్లి... "మీరు ఈ ఇంటి అల్లుడు. ఇలాంటి పనులు మీరు చేయడం చూస్తే బంధువులు ఏమనుకుంటారు? సోనాలిని పిలవండి. తను వచ్చి పాపకు డైపర్ మారుస్తుంది" అని చెప్పారు.
నేను మరో మాట మాట్లాడే లోపలే, అత్తగారు మా ఆవిడను పిలిచి పాపకు డైపర్ మార్చమని చెప్పారు. నేనూ మా ఆవిడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నిలబడిపోయాం. మళ్ళీ మా అత్తగారు గట్టిగా "సోనాలి!" అని అనేసరికి మా ఆవిడ పాపని వాష్ రూమ్‌కు తీసుకెళ్ళింది.
ఆ సంఘటన నాకు కాస్త వింతగా, ఆశ్చర్యంగా అనిపించింది. పాప డైపర్ మార్చడం నాకేం కొత్త కాదు. మా అత్తగారింట్లో అందరికీ తెలుసు... నేను హౌస్ హజ్బెండ్‌ని అని.
ఆ పెళ్లిలో చాలామంది మొహాల్లో ఒక వెకిలి నవ్వు కనిపించింది. 'అతడు హౌజ్ హస్బెండ్' అనే మాట ఆ పెళ్లి గోలలో అప్పుడప్పుడూ నా చెవిన పడుతుండేది.
కానీ ఆ విషయం అందరికీ తెలియడం మా అత్త మామలకు ఇష్టం లేదు.
నేను సిగ్గుపడాలని జనాలే కావాలని నన్ను హేళన చేస్తారని నాకు తెలుసు. కానీ, ఎవరేమనుకున్నా నేను సిగ్గుపడను. నా సిద్ధాంతాన్ని మార్చుకోను. నేను ఇలానే హౌస్ హజ్బెండ్‌లా ఉంటా.
మా ఇద్దరిదీ ప్రేమ వివాహం. కెరీర్‌లో ఎవరికి మంచి అవకాశం వస్తే వాళ్లు ముందుకెళ్లాలని మొదటే నిర్ణయించుకున్నాం.
మొదట్నుంచీ నా కెరీర్ సరిగ్గా లేదు. కానీ సోనాలి మాత్రం తన కెరీర్‌లో వేగంగా దూసుకెళ్లింది. దాంతో, నేను ఉద్యోగం మానేసి ఇంటి పనులు చూసుకోవాలని, తాను ఉద్యోగం కొనసాగించాలని నిర్ణయించుకున్నాం.

మాకు పనిమనిషి లేదు. ఇల్లు ఊడవడం, తుడవడం, కూరలు తేవడం, వంట చేయడం లాంటి అన్ని పనులూ నేనే చూసుకుంటాను.
నేను ఇంటి పని చేయడం ఇతరులకు వింతగా అనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం అది చాలా మామూలు విషయం.
మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ముల్లో నేను ఆఖరి వాడిని. చిన్నప్పుడు అమ్మకి ఇంటి పనుల్లో సహాయం చేసేవాణ్ణి . అప్పుడు కూడా నా స్నేహితులు నన్ను "గృహిణి" అంటూ ఆట పట్టించే వాళ్ళు.
ఇప్పుడిప్పుడే దిల్లీలోని బాగా చదువుకున్న నా స్నేహితులు 'నా ఛాయిస్'ను మెల్లగా అర్ధం చేసుకుంటున్నారు. కానీ మా సొంతూరు భోపాల్ వెళ్ళినప్పుడు మాత్రం నా స్నేహితులు బాగా ఆట పట్టిస్తూ ఉంటారు. ఏదైనా రాజకీయానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు, నేను మాట్లాడితే, "ఇది నీకు సంబంధించింది కాదు, నీకు అర్థం కాదు'' అని నన్ను పక్కనబెడతారు.
ఓసారి ఇలాగే నా స్నేహితులంతా ఏదో చర్చిస్తుంటే, నేను కూడా మధ్యలో మాట్లాడాను. అప్పుడు వాళ్ళు ' ముందు నువ్వు వెళ్లి చాయ్ చేసుకొని తీసుకురా' అన్నారు. నేనూ కూడా నవ్వి 'ఒక్క చాయ్ ఏంటి... పకోడీలు కూడా చేసుకొస్తా' అన్నాను. నాకు ఇలాంటి విషయాలు స్పోర్టివ్‌గా తీసుకోవడం అలవాటైపోయింది.

బీబీసీ అందిస్తున్న #HisChoice సిరీస్‌లో 10మంది భారతీయ పురుషుల నిజ జీవిత గాథలు ఉంటాయి.
ఆధునిక భారతీయ పురుషుల ఆలోచనలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల కోరికలు, ప్రాధాన్యాలు, ఆశలను ఈ కథనాలు ప్రతిబింబిస్తాయి.

ఇప్పటికీ కొంత మంది నాకు ఫోన్ చేసి "ఈ రోజు వంట ఏం చేస్తున్నావు" అని హేళన చేస్తారు.
చాలామంది ఇంటి పనిని 'పని'గా గుర్తించరు. 'నువ్వు ఇంట్లో ఉంటూ హాయిగా జల్సా చేస్తున్నావు' అని కొందరంటారు.
కానీ వాళ్లకి ఉద్యోగం చేసే మగవాళ్లలానే నేను కూడా అలసిపోతాననే విషయం అర్థం కాదు. నేనే కాదు, ఇంటిపనులు చేసే వాళ్లెవరైనా అలసిపోతారు.
నన్ను హేళన చేసేవాళ్లంతా, తమ ఇంట్లో మహిళలను కూడా చాలా హీనంగా చూస్తారని, వాళ్ల పనిని గుర్తించరని అనిపించి బాధ కలుగుతుంది.
పెళ్లయిన నాలుగేళ్లకు మాకు పాప పుట్టింది. నా పైన బాధ్యత ఇంకా పెరిగింది.
ఇంటి పనితో పాటు పాపకి స్నానం చేయించడం, తినిపించడం, షికారుకు తీసుకెళ్లడం లాంటి అన్ని పనులూ నా బాధ్యతలే.
మొదట్లో నేను మా పాపను పార్క్‌కి తీసుకువెళ్ళినప్పుడు, ఇతర మహిళలు నన్ను చూసి పలకరింపుగా నవ్వేవారు, పాపని ముద్దు చేసేవారు. కానీ రాను రాను "ఈ రోజూ మీరే వచ్చారా? వాళ్ళ అమ్మ ఏది? వాళ్ళ అమ్మకి బాలేదా?’’ ఇలాంటి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు.
మా ఆవిడ ఆఫీస్‌కి వెళ్తుంది, నేనే మా పాపను చూసుకుంటాను అని చెప్పగానే ప్రశ్నల వర్షం కురిసేది.

ఇంత చిన్న పిల్లని ఎలా చూసుకుంటారు? మీ దగ్గర పాప ఏడవకుండా ఉంటుందా? ఎవరు తినిపిస్తారు? ఎవరు స్నానం చేయిస్తారు?... ఇలాంటి ప్రశ్నలు తరచూ ఎదరుయ్యేవి.
నేనేదో చేయరాని పని చేస్తునట్లు మాట్లాడతారు. నా వెనుక "ఫ్రీ హస్బెండ్" అని కూడా అంటూ వుంటారు. మా పెళ్లయ్యాక మా అమ్మా నాన్న మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు నేను చేసే పని నచ్చలేదు. మా అమ్మ నాతో నేరుగా ఏమీ అనేది కాదు కానీ ఆవిడ ప్రవర్తన ద్వారా నాకు విషయం అర్థమయ్యేది. నేను ఎందుకు ఉద్యోగం చేయట్లేదని, కోడలు ఉద్యోగంతో పాటు ఇంటి పని ఎందుకు చేసుకోకూడదు అనే భావం ఆవిడ కళ్ళలో కనిపించేది.
ఇప్పుడు మా పాప స్కూల్‌కి వెళ్తోంది. స్కూల్‌లో ఓసారి ఫ్యామిలీ ట్రీ వేయమన్నారు. నేను ఇంట్లో లేకపోవడంతో నా భార్య ఫ్యామిలీ ట్రీ వేయించింది. దాంట్లో నేను "హెడ్ అఫ్ ది ఫ్యామిలీ" అని రాసింది.
దానికి నేను అడ్డు చెప్పాను.
సోనాలి ఉద్యోగం చేసి డబ్బు తీసుకొస్తున్నప్పుడు తానే హెడ్ అఫ్ ది ఫ్యామిలీ కదా అని నా అభిప్రాయం. హెడ్ అంటే ఆడ మగ కాదు, సంపాదించేవారు అని. అయినా తను నా పేరు తొలగించలేదు.
నేను ఫ్రీలాన్స్ రైటర్‌ని. నావి రెండు పుస్తకాలు వెలువడ్డాయి. ఇంకొకటి ప్రచురణలో ఉంది. కానీ ఎవరికీ ఈ పని కనిపించదు.
మా ఆవిడ కూడా తన ఆఫీస్‌లో కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మా ఇద్దరి మధ్య ఉన్న గాఢమైన ప్రేమ వల్ల ఆ ప్రశ్నల ప్రభావం మా బంధంపైన ఎప్పుడూ పడలేదు. నా సోదరులు నేను ఇంట్లో ఉండటం గురించి ఏమీ అనరు. ఆలా అని నన్ను సమర్థించరు కూడా.
మనం సాధారణంగా ఏదైనా కొంచెం భిన్నంగా చేస్తే మొదట ఎక్కువమంది వేళాకోళం చేస్తారు. తరువాత మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మనల్ని స్వీకరిస్తారు.
నేను ఇంకా మొదటి దశలోనే ఉన్నాను.
(ఒక వ్యక్తితో మాట్లాడి, అతడి అంతరంగాన్ని బీబీసీ ప్రతినిధి నీలేష్ డోత్రే అక్షర బద్ధం చేశారు. ఆ వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాం. ప్రొడ్యూసర్: సుశీలా సింగ్)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








