కేరళ వరదలు: ఈ ఆదివాసీ నాయకుడు అడవిని వదలనంటున్నాడు, ఎందుకు?

వేలుతా
    • రచయిత, రిపోర్టర్: ప్రమీలా కృష్ణన్
    • హోదా, షూట్-ఎడిట్: షరీఖ్ అహ్మద్

కేరళ వరదలు వేలాది మందిని నిర్వాసితులను చేశాయి. అక్కడి ఓ పురాతన తెగ కూడా తమ ఇళ్లను కోల్పోయి, అడవిని శాశ్వతంగా వదిలి వెళ్లడానికి సిద్ధపడింది. కానీ, ఆ తెగ నాయకుడు మాత్రం అడవినే నమ్ముకున్నాడు. పర్వతాలు కూలిపోయినా, వరదలు ముంచెత్తినా అక్కడి నుంచి కాలు బయటపెట్టే ప్రసక్తే లేదంటున్నాడు.

వరదల ధాటికి దాదాపు ఆ గిరిజనుల ఇళ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. దాంతో, ఇప్పటికే ఆ తెగ నుంచి చాలామంది అడవిని వదిలిపోయారు. ఇంకొందరు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అలా వెళ్తున్న వాళ్లలో తెగ నాయకుడు చేరియా వేలుతా కుమార్తె మినీ కూడా ఉన్నారు. కానీ, ఆయన మాత్రం వెళ్లడానికి ఒప్పుకోవట్లేదు.

వీడియో క్యాప్షన్, వీడియో: 'ఇక్కడే పుట్టా, ఇక్కడే చచ్చిపోతా... అడవిని మాత్రం వదలను’

తాను ఆ అడవిని వదిలి వెళ్తే 'ప్రకృతి దేవుడు' శిక్షిస్తాడని చేరియా వేలుతా నమ్ముతున్నారు.

‘మా ఇళ్ల పునర్నిర్మాణానికి సహాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, నాకు ఆసక్తి లేదు. నేను ఇక్కడే పుట్టా. ఇక్కడే చనిపోతా. కాబట్టి, నాకు ఎలాంటి ఆందోళనా లేదు. నాకు ఏ సమస్య వచ్చినా, ఈ అడవే చూసుకుంటుంది’ అంటారు చేరియా.

కానీ, ఆయన కుమార్తె మినీ మాత్రం తన పిల్లలతో కలిసి అడవిని వదిలి పెట్టడానికి సిద్ధమయ్యారు. ‘మా తల్లిదండ్రుల్లా కష్టపడుతూ బతకడం మా వల్ల కాదు. మాకు మంచి ఆహారం తినాలని ఉంది. నాకూ నా పిల్లలకు సరైన వైద్య సదుపాయాలు కావాలి’ అంటారామె.

ఆ అడవిలోనే ప్రభుత్వం అనువైన భూభాగాన్ని గుర్తించిందనీ, అక్కడే వాళ్లకు ఇళ్లు నిర్మిస్తుందనీ అధికారులు చెబుతున్నారు. కానీ, చేరియా మాత్రం వారి మాటలు వినట్లేదు.

‘వర్షాకాలంలో వరదలు వస్తుంటాయి. ఎండా కాలంలో మళ్లీ పరిస్థితి కుదుటపడుతుంది. వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అంటారాయన.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)