మైక్రోసాఫ్ట్: ‘రష్యా పొలిటికల్ హ్యాక్‌’ను విజయవంతంగా అడ్డుకున్నాం

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, CROWDSTRIKE

అమెరికా ప్రభుత్వ సంస్థలపై సైబర్ దాడులు చేసేందుకు రష్యా చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. రష్యాకు చెందిన హ్యాకర్లు.. ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్‌స్టిట్యూట్ , హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ లాంటి ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం దొంగిలించేందుకు ప్రయత్నించారని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

సమాచారం దొంగిలించడానికి ఉపయోగించిన 6 నెట్ డొమైన్లను సదరు సంస్థల సెక్యూరిటీ సిబ్బంది అదుపు చేయడంతో హ్యాకర్ల ప్రయత్నాన్ని తిప్పికొట్టగలిగారు. ఈ సైబర్ దాడుల వెనుక 'ఫ్యాన్సీ బేర్' హ్యాకింగ్ గ్రూప్ హస్తమున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

డొమైన్ కంట్రోల్

'ఇలాంటి సైబర్ దాడుల వల్ల రాజకీయ పార్టీలకు చెందిన సంస్థల వ్యూహాలు, ఎత్తుగడల భద్రతకు ప్రమాదం పొంచి ఉందని మేం ఆందోళన చెందుతున్నాం'' అని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌లో పేర్కొంది.

డిజిటల్ సమాచారాన్ని తస్కరించే క్రమంలో ప్రస్తుతం విఫలమైన సైబర్ దాడి మొదటిది మాత్రమేనని మైక్రోసాఫ్ట్ తెలిపింది. నకిలీ డొమైన్లతో కొందరిని ఆకర్షించి, వాటిలో లాగిన్ అయ్యేలా చేసి, వారి లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌లను దొంగిలించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తారని మైక్రోసాఫ్ట్ వివరించింది.

హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న రెండు డొమైన్లలో ఒకటి.. సెనేట్ కార్యాలయాలు, సేవలకు చెందినది. ‘మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఆన్‌లైన్ సర్వీస్‌’ పేరుతో హ్యాకర్లు ఒక నకిలీ డొమైన్‌ను తయారు చేసి, దాని ద్వారా సమాచారం దొంగిలించడానికి ప్రయత్నించారు.

మైక్రోసాఫ్ట్

ఫొటో సోర్స్, Getty Images

హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న రెండు సంస్థలు గతంలో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా పని చేశాయి. కానీ ప్రస్తుతం ఈ రెండూ రష్యాపై ఆంక్షలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. రష్యాకు వైరి వర్గంగా మారినందుకే వీటిని రష్యా లక్ష్యం చేసుకుందని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది.

గత రెండేళ్లలో ఫ్యాన్సీ బేర్స్‌కు చెందిన 84 ప్రమాదకరమైన డొమైన్లను నిర్వీర్యం చేయడానికి 12 సార్లు ప్రయత్నించినట్లు మైక్రోసాఫ్ట్ బ్లాగ్‌లో సంస్థ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ పేర్కొన్నారు.

ప్రస్తుతం తెరపైకి వచ్చిన డొమైన్లను గతంలో ఏ సైబర్ దాడిలోనూ వాడిన దాఖలాలు లేవని మైక్రోసాఫ్ట్ బ్లాగ్ తెలిపింది. డొమైన్లతో సైబర్ దాడులు చేయడం.. 2016 అమెరికా ఎన్నికలను, 2017లో జరిగిన ఫ్రాన్స్ ఎన్నికల వివాదాలను ప్రతిబింబిస్తోందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

హిల్లరీ క్లింటన్, డెమొక్రటిక్ పార్టీ ఉపయోగించిన కంప్యూటర్లను హ్యాక్ చేశారంటూ 12 మంది రష్యా ఇంటెలిజెన్స్ అధికారులపై అమెరికా ఆరోపణలు చేసింది. ఆ వెంటనే మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సైబర్ దాడి ప్రయత్నాల సమాచారం వెలువరించింది.

అయితే.. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుందన్న ఆరోపణలతోపాటు, అమెరికా సంస్థలపై సైబర్ దాడి ఆరోపణలను కూడా రష్యా ఖండించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)