రష్యా సైబర్-కుట్రలు: అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఆరోపణలు

నెదర్లాండ్స్‌కి వచ్చిన నలుగురు అనుమానితులు

ఫొటో సోర్స్, DutchGovernment

ఫొటో క్యాప్షన్, నెదర్లాండ్స్‌కి వచ్చిన నలుగురు అనుమానితులు

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సైబర్-కుట్రలలో రష్యా గూఢచారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రష్యాకు చెందిన ఏడుగురు ఏజెంట్లపై ఆమెరికా ఆరోపణలు చేసింది.

రసాయన ఆయుధాలపై కన్నేసి ఉంచే ఒక సంస్థ, యాంటీ డోపింగ్ సంస్థలు, అమెరికా అణు సంస్థ సహా అంతర్జాతీయంగా పలు సంస్థలను వీరు లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా న్యాయ విభాగం వెల్లడించింది.

అయితే, రష్యా మాత్రం ఈ ఆరోపణలన్నీ 'గూడచర్యానికి సంబంధించి పాశ్చాత్య దేశాలకున్న పిచ్చి భయాందోళనలే'నని కొట్టిపారేసింది.

నలుగురు అనుమానితులు

ఇంతకీ రష్యాపై ఉన్న ఆరోపణలేంటి?

* బ్రిటన్‌లో రసాయన దాడికి గురైన రష్యా మాజీ గూఢచారి కేసును శోధిస్తున్న 'ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్'(ఓపీసీడబ్ల్యూ)ని హ్యాక్ చేసేందుకు నలుగురు రష్యన్లు పథకం పన్నారని నెదర్లాండ్స్ ఆరోపించింది.

* రష్యా, ఉక్రెయిన్‌లలోని పలు సంస్థలు, అమెరికాకు చెందిన డెమొక్రటిక్ పార్టీ, బ్రిటన్‌లోని ఒక టీవీ నెట్‌వర్క్‌పై జరిగిన సైబర్ దాడుల వెనుక రష్యాకు చెందిన మిలటరీ నిఘా విభాగం 'జీఆర్‌యూ' ఉందని బ్రిటన్ కూడా ఆరోపించింది.

* అమెరికా కూడా తమ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఫిపా, అణు ఇంధన సంస్థ వెస్టింగ్‌హౌస్‌లను రష్యా నిఘా విభాగం లక్ష్యంగా చేసుకుందని పేర్కొంది.

* మాంట్రియల్‌లోని ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థపై సైబర్ దాడికి రష్యా నిఘా వర్గాలే కారణమని కెనడా చెప్పింది.

నలుగురు రష్యన్ల నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్ బ్రెజిల్, స్విట్జర్లాండ్, మలేసియాల్లో వాడినట్లుగా తేలిందని నెదర్లాండ్స్ అధికారులు చెబుతున్నారు.

నెదర్లాండ్స్‌ నుంచి వస్తూ తూర్పు ఉక్రెయిన్‌ సమీపంలో కూలిపోయిన మలేసియా విమానం ఎంహెచ్-17 కేసు దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఈ ల్యాప్‌టాప్‌ను వినియోగించారని నెదర్లాండ్స్ అంటోంది. 2014లో నెదర్లాండ్స్ నుంచి మలేసియా వస్తున్న ఈ విమానాన్ని కూల్చివేశారన్న అనుమానాలున్నాయి. ఈ ఘటనలో 298 మంది ప్రాణాలు కోల్పోయారు.

పుతిన్

ఫొటో సోర్స్, Reuters

రష్యా ఏమంటోంది?

బ్రిటన్, నెదర్లాండ్స్‌ల ఆరోపణలను ఇప్పటికే కొట్టిపారేసిన రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి దేశాలు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంలో తాము బలిపశువులు అవుతున్నామని పేర్కొంది.

చివరకు రష్యా పౌరులు మొబైల్ ఫోన్ పట్టుకుని కనిపించినా వారిని గూఢచారి అనేలా ఉన్నారని ఆ ప్రకటనలో ఆక్షేపించారు.

తాజా పరిణామాలపై అమెరికా జాతీయ భద్రత విభాగ అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ డెమెర్స్ మాట్లాడుతూ.. రష్యా అథ్లెట్లు ఒక పద్ధతి ప్రకారం నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతున్నారని ఆధారాలు దొరకడంతో వారిపై నిషేధం విధించకుండా అడ్డుకునేందుకు ఈ దాడులు చేసినట్లుగా అభిప్రాయపడ్డారు.

ఈ దాడుల తరువాత అమెరికా ఏడుగురు రష్యన్లపై ఆరోపణలు చేసింది. వీరిలో నలుగురిని నెదర్లాండ్స్ తమ దేశం నుంచి బహిష్కరించింది. మరో ముగ్గురిపై ఇప్పటికే.. 2016 అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధికారులకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించారన్న అభియోగాలున్నాయి.

గుర్తింపు వివరాలు దొంగిలించడం, మనీ లాండరింగ్ వంటి అభియోగాలు వీరిపై ఉన్నాయి. ఈ ఏడుగురు కూడా రష్యాలోనే ఉన్నట్లు అమెరికా చెబుతోంది. కాగా.. రష్యా, అమెరికాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందాలు లేకపోవడంతో వారిని విచారించడం అమెరికాకు సాధ్యమయ్యే సూచనలు లేవు.

మరోవైపు సైబర్ దాడుల నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించే దిశగా బ్రిటన్ యోచిస్తోంది. ఈయూ కూడా ఈ దాడులను ఖండించింది.

హ్యాకింగ్

ఫొటో సోర్స్, Ministrie Van Defensie

అనుమానితులు నెదర్లాండ్స్‌లో ఏం చేశారు?

డచ్ అధికారులు అనుమానిస్తున్న నలుగురు రష్యన్లకు దౌత్య పాస్‌పోర్టులున్నాయి. ''వారిలో ఇద్దరు ఐటీ నిపుణులు, మరో ఇద్దరు వారికి సహాయపడేవారు. దౌత్యపరమైన రక్షణ నిబంధనలు ఉండడంతో వారిని అరెస్ట్ చేయడానికి వీల్లేకపోయింద''ని నెదర్లాండ్స్ అధికారులు వెల్లడించారు.

వీరు నలుగురూ ఒక కారును అద్దెకు తీసుకుని ఓపీసీడబ్ల్యూ కార్యాలయానికి సమీపంలో హేగ్‌లోని మారియట్ హోటల్ పార్కింగ్‌లో దాన్ని నిలిపారని... ఓపీసీడబ్ల్యూ వైఫై నెట్‌వర్క్‌ని హ్యాక్ చేయడానికే వారు అక్కడ చేరారని డచ్ నిఘా విభాగం ఎంఐవీడీ మేజర్ జనరల్ ఓనో ఎషెల్సీమ్ తెలిపారు.

దీనికోసం వారు సరంజామా అంతా కారులో తెచ్చారని.. కారు వెనుక షెల్ఫ్‌లో ఒక కోటు కింద యాంటెన్నాను దాచిపెట్టారని తెలిపారు. ఓపీసీడబ్ల్యూలో లాగిన్ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు.

వారిని అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పుడు వారు తమ వద్ద ఉన్న ఒక మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని.. వారిలో ఒకరి ఫోన్ మాస్కోలోని జీఆర్‌యూ భవనం సమీపంలోనే యాక్టివేట్ అయి ఉందని మేజర్ జనరల్ చెప్పారు.

ఇంకో అనుమానితుడి వద్ద జీఆర్‌యూ సమీపంలోని వీధి నుంచి విమానాశ్రయానికి కారులో వెళ్లిన రశీదు ఉందని.. వీరంతా స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకున్నారని.. ఓపీసీడబ్ల్యూ విశ్లేషించిన శాంపిళ్లు అక్కడే ఉంటాయని మేజర్ జనరల్ తెలిపారు.

అయితే, వారిని నెదర్లాండ్స్ నుంచి వెంటనే బయటకు పంపించడంతో వారా పనులేవీ చేయలేకపోయారన్నారు.

అనుమానితులు

ఫొటో సోర్స్, fbi

ఫొటో క్యాప్షన్, ఏడుగురు అనుమానితులు

అనుమానితులు వీరే..

అలెక్సీ మోరెనెజ్, యెవెగెనీ సెరెబ్రియకోవ్, ఓలెజ్ సోత్నికోవ్, అలెక్సీ మినిన్ అనే నలుగురిపై డచ్ నిఘా అధికారులు అనుమానాలు వ్యక్తంచేశారు.

వారంతా జీఆర్‌యూ యూనిట్ 26465కి చెందినవారిగా డచ్ అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్‌ను ఏపీటీ28గా కూడా వ్యవహరిస్తారు.

ఈ యూనిట్ ఇప్పటికే చాలామందిని ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పంపించి తమ లక్ష్యిత సంస్థల వైఫై నెట్‌వర్క్‌లలోకి చొరబడేందుకు పురమాయించిందని నెదర్లాండ్స్‌లోని బ్రిటన్ రాయబారి పీటర్ విల్సన్ చెప్పారు.

ఈ నలుగురి టీం స్విట్జర్లాండ్‌లోని బెర్న్ వెళ్లాలని అనుకుందని.. కొద్ది నెలల కిందట సాలిస్బరీలో జరిగిన రసాయన దాడిలో వాడింది నోవిచోక్ అని గుర్తించిన ఓపీసీడబ్ల్యూ సర్టిఫైడ్ లేబరేటరీ బెర్న్‌లోనే ఉండడంతో వారు అక్కడకు వెళ్లానుకున్నారు.

వీరి ఆపరేషన్‌ను అడ్డుకునేప్పటికి ఆ లేబరేటరీ సాలిస్బరీ కేసుతో పాటు సిరియాలో రష్యా మద్దతుతో అక్కడి ప్రభుత్వం చేపట్టిన దాడుల్లో రసాయన దాడులు వినియోగించారన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలపైనా పరిశోధన జరుపుతోంది.

''డోపింగ్ వివాదాల నుంచి బయటపడడానికి, నోవిచోక్ విష ప్రయోగ ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి రష్యా సైబర్ దాడులను ఆయుధంగా వాడుకుంటోంది'' అని విల్సన్ అన్నారు.

స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో ఏముంది?

అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ను బ్రెజిల్, స్విట్జర్లాండ్, మలేసియాల్లో వాడినట్లుగా డచ్ అధికారులు చెబుతున్నారు.

మలేసియాలో వారు.. ఎంహెచ్-17 విమానం కూల్చివేత కేసును దర్యాప్తు చేస్తున్న మలేసియా పోలీసు విభాగం, అటార్నీ జనరల్ కార్యాలయం లక్ష్యంగా ఈ సైబర్ ఆపరేషన్ జరిగిందని నెదర్లాండ్స్‌లో బ్రిటన్ రాయబారి విల్సన్ వెల్లడించారు.

స్విట్జర్లాండ్‌లోని లాసానె నగరంలోనూ దీన్ని వాడినట్లు గుర్తించారు. రష్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడినట్లుగా తేల్చిన ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కంప్యూటర్లకు ఇది అనుసంధానమైనట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)