అమెరికా చర్యకు రష్యా ప్రతిచర్య.. 60 మంది దౌత్యాధికారులపై వేటు

ఫొటో సోర్స్, EPA
బ్రిటన్‌లో ఒక గూఢచారిపై విషప్రయోగం కేసు రష్యా - బ్రిటన్, రష్యా - అమెరికాల మద్య దౌత్య యుద్ధాన్ని తీవ్రం చేసింది.
ఇటీవల తమ దేశంలోని రష్యా దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించిన నేపథ్యంలో.. రష్యాలోని 60 మంది అమెరికా దౌత్యాధికారులపై రష్యా వేటు వేసింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని అమెరికా కాన్సులేట్‌ను కూడా మూసివేసింది.
రష్యా వారిని బహిష్కరించిన ఇతర దేశాలకు కూడా తగిన సమాధానం ఇస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ పేర్కొన్నారు.
తమ దౌత్యాధికారులను రష్యా బహిష్కరించటం అనూహ్యమైన విషయం కాదని అమెరికా అధ్యక్ష భవనం వ్యాఖ్యానించింది. ‘‘దీంతో అమెరికా - రష్యా సంబంధాలు మరింతగా క్షీణించాయి’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
మాజీ రష్యా గూఢచారి అయిన సెర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తె యూలియాలపై ఈ నెల ఆరంభంలో దక్షిణ ఇంగ్లండ్‌లో ‘నెర్వె ఏజెంట్’ విషప్రయోగం వివాదం నేపథ్యంలో ఈ పరిణామాలు సంభవించాయి. వీరిద్దరూ మార్చి 4వ తేదీన సాలిస్‌బరీ నగరంలోని ఒక బెంచ్ మీద అపస్మారక స్థితిలో కనిపించారు.

ఫొటో సోర్స్, EPA/ Yulia Skripal/Facebook
వీరిపై రష్యా విషప్రయోగానికి పాల్పడిందని బ్రిటన్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే అందులో తమ పాత్ర ఏమీ లేదని రష్యా తీవ్రంగా ఖండించింది.
సెర్గీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉండగా.. ఆయన కుమార్తె ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని వైద్యులు చెప్తున్నారు.
బ్రిటన్‌కు సంఘీభావంగా 20 పైగా దేశాలు రష్యా రాయబారులను తమ దేశం నుంచి బహిష్కరించాయి. వాటిలో అమెరికా కూడా ఉంది. ఈ వారం ఆరంభంలో 60 మంది రష్యా రాయబారులను బహిష్కరించిన అమెరికా సియాటిల్ లోని రష్యా కాన్సులేట్ జనరల్‌ను కూడా మూసివేసింది.
ఈ నేపథ్యంలో.. మాస్కోలో పనిచేస్తున్న 58 మంది అమెరికా దౌత్యాధికారులతో పాటు, యెకాతెరీన్‌బర్గ్‌లో పనిచేస్తున్న మరో ఇద్దరు దౌత్యాధికారులను రష్యా గురువారం నాడు బహిష్కరించింది.

ఫొటో సోర్స్, AFP
తమ ’’ప్రతి చర్యల’’ గురించి అమెరికా రాయబారి జాన్ హంట్స్‌మన్‌కు తెలియజేసినట్లు సెర్గీ లావరోవ్ చెప్పారు. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకునే అధికారం అమెరికాకు ఉందని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
‘‘ఇతర దేశాల విషయంలో కూడా.. (వారు బహిష్కరించిన మా దౌత్యాధికారుల) సంఖ్యాపరంగా అంతే మందిని వారి దౌత్య కార్యాలయ సిబ్బందిని రష్యా నుంచి పంపించటం జరుగుతుంది’’ అని లావరోవ్ తెలిపారు.
‘‘అన్ని దేశాలూ రష్యా వ్యతిరేక వైఖరి తీసుకునేలా బ్రిటన్ ఒత్తిడి చేస్తోంద’’ని కూడా ఆయన ఆరోపించారు. అమెరికా ఒత్తిడితోనే బ్రిటన్ స్క్రిపాల్ కేసు సాకుతో తమకు వ్యతిరేకంగా ఆమోదనీయం కాని చర్యలకు పాల్పడుతోందని.. ఆ చర్యలకు తాము ప్రతిస్పందిస్తున్నామని లావరోవ్ వ్యాఖ్యానించారు.
రష్యా పౌరుడైన యూలియా సక్క్రిపాల్‌ను తమ దౌత్యాధికారులు సంప్రదించేందుకు అనుమతించాలని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ వ్యవహారంలో ‘‘నిజాన్ని నిర్ధారించేందుకు’’ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ (ఓపీసీడబ్ల్యూ) నాయకుల సమావేశం ఏర్పాటు చేయాలని రష్యా కోరుతున్నట్లు చెప్పారు.
ఈ దౌత్య యుద్ధం ఎలా మొదలైంది?
సాలిస్‌బరీలో ఘటన నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే.. రష్యా మీద పలు చర్యలు ప్రకటించారు. వాటిలో భాగంగా.. రష్యా ఏజెంట్లు (గూఢచారులు) గా ఆరోపణలున్న 23 మంది రష్యా దౌత్యాధికారులను బ్రిటన్ నుంచి బహిష్కరించారు.
రష్యా దీనికి ప్రతి చర్యగా తమ దేశంలో పనిచేస్తున్న 23 మంది బ్రిటన్ దౌత్యాధికారులను బహిష్కరించింది. రష్యాలోని బ్రిటిష్ కౌన్సిల్‌ను కూడా మూసివేసింది.
దీంతో 20 పైగా దేశాలు తమ తమ దేశాల్లోని రష్యా దౌత్యాధికారులను బహిష్కరించాయి. రష్యా నిఘా అధికారులపై అనేక దేశాలు ఉమ్మడిగా చేపట్టిన ఈ చర్య చరిత్రలోనే అతి పెద్దదిగా అభివర్ణిస్తున్నారు.
రష్యా రహస్య గూఢచార వ్యవస్థలను నిర్మూలించటం లక్ష్యంగా పశ్చిమ దేశాలు ఈ బహిష్కరణలు చేపట్టాయని బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు మార్క్ సెడ్విల్ గురువారం వాషింగ్టన్‌లో చెప్పారు.
‘నెర్వ్ ఏజెంట్’ గురించి తెలిసిందేమిటి?
రష్యా మాజీ గూఢచారి, ఆయన కుమార్తెపై ప్రయోగించిన రసాయం.. సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసిన నోవిచోక్ అనే నెర్వ్ ఏజెంట్ల సముదాయానికి చెందినదని బ్రిటన్ చెప్తోంది.
ఓపీసీడబ్ల్యూ నిపుణులు మార్చి 19వ తేదీన బ్రిటన్ చేరుకుని పరీక్షల కోసం సాంపిల్స్ సేకరించారు. ఈ పరీక్షల ఫలితాలు రావటానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని ప్రభుత్వం చెప్తోంది.
స్క్రిపాల్, ఆయన కుమార్తెలపై వారి ఇంట్లో మొదట ఈ రసాయన ప్రయోగం జరిగిందని, వారి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ రసాయనం అధికంగా కనిపించిందని పోలీసులు చెప్తున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








