ఆస్ట్రేలియా కూడా అమెరికా, యూరప్‌ల బాటలోనే!

ఫొటో సోర్స్, AFP
బ్రిటన్‌కు చెందిన మాజీ గూఢచారిపై విష ప్రయోగం వివాదంలో రష్యా రాయబారులను బహిష్కరిస్తున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా చేరింది. తమ దేశంలో పనిచేస్తున్న రష్యా రాయబారులను బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ ప్రకటించారు.
"ఇది ఏ ఒక్కరిపైనో జరిగిన దాడి కాదు, మనందరిపైనా జరిగింది" అని ప్రధాని తన ప్రకటనలో పేర్కొన్నారు.
రష్యాకు చెందిన 60 మంది రాయబారులను దేశం నుంచి బహిష్కరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా నిర్ణయానికి మద్దతుగా నిలిచింది.
జర్మనీ విదేశాంగ శాఖ కూడా తాము రష్యా రాయబారులను బహిష్కరిస్తామని తెలిపింది.
బ్రిటన్ కూడా ఇలాంటి చర్యలే తీసుకుంది. 23 మంది రష్యా రాయబారులు వారంలోగా లండన్ విడిచి వెళ్లాలని బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఆదేశించారు.
అమెరికా సియాటెల్లోని రష్యా రాయబార కార్యాలయాన్ని మూసేయాలని నిర్ణయించింది.
అమెరికాలోని రష్యా దౌత్య కార్యాలయంలో 48 మంది రాయబారులుండగా మిగిలిన వారు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో ఉన్నారు.
గత కొంతకాలంగా రష్యా వరుసగా ఇలా రాయబారుల బహిష్కరణను ఎదుర్కొంటోంది.
రాయబారులను బహిష్కరించిన దేశాలు
బ్రిటన్ 23 మంది, అమెరికా 60, ఫ్రాన్స్ 4, జర్మనీ 4, పోలండ్ 4, చెక్ రిపబ్లిక్ 3, లిథుయేనియా 3, డెన్మార్క్ 2, నెదర్లాండ్స్ 2, ఇటలీ 2, ఈస్టోనియా 1, క్రొయేషియా 1, ఫిన్లాండ్ 1, లత్వియా 1, రొమానియా 1, స్వీడన్ 1, ఉక్రేన్ 12, కెనడా 4, ఆస్ట్రేలియా 2

ఫొటో సోర్స్, EPA/ Yulia Skripal/Facebook
అసలేం జరిగింది?
సిర్గీ స్క్రిపాల్ గతంలో రష్యా సైనికాధికారిగా పని చేశారు. ఆయన వయసు 66. తన ముప్ఫైమూడేళ్ల కూతురు యూలియా స్క్రిపాల్‌తోపాటుగా మార్చి 4న సాల్స్‌బరీలోని వీధిలో ఓ బెంచ్‌పై అచేతనంగా పడివున్నారు. స్థానికుల సమాచారంతో వీరిని పరీక్షించిన వైద్యులు వీరిపై విషప్రయోగం జరిగిందని ప్రాథమికంగా తెలిపారు. వీరిద్దరూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
వీరిద్దరూ కలిసి భోజనం చేసిన జిజ్జీ రెస్టారెంట్‌లోని టేబుల్ మీద, టేబుల్ పరిసర ప్రాంతంలో నొవిఛోక్ అవశేషాలను నిపుణులు గుర్తించారు. జీజ్జీ రెస్టారెంట్‌కు సమీపంలో ఉండే మిల్ పబ్‌లో కూడా ఈ అవశేషాలను గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆరోజు జిజ్జీ రెస్టారెంట్‌కు, మిల్ పబ్‌కు వెళ్లినవారు ఆందోళన చెందారు. వీరిలో దాదాపు 500 మంది ముందు జాగ్రత్తగా తమ వస్తువులను శుభ్రం చేసుకున్నామని తెలిపారు.
''సిర్గీ స్క్రిపాల్, ఆయన కూతురు యులియా స్క్రిపాల్‌పై సాల్స్‌బరీలో విషప్రయోగం చేశారు. ఈ హత్యాయత్నంలో వాడిన విషపూరిత రసాయనం రష్యా గూఢచార సంస్థ వాడే 'నొవిఛోక్'గా నిర్ధరణ అయ్యింది. ఈ కుట్ర వెనుక రష్యా హస్తం ఉండొచ్చు'' అని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆరోపించారు.
ఈ ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









