థెరెసా మే: ‘బ్రిటన్‌లో రష్యా విష ప్రయోగం’

‘‘బ్రిటన్ గూఢచారి సిర్గీ స్క్రిపాల్, ఆయన కూతురు యులియా స్క్రిపాల్‌పై సాల్స్‌బరీలో విషప్రయోగం చేశారు. ఈ హత్యాయత్నంలో వాడిన విషపూరిత రసాయనం రష్యా గూఢచార సంస్థ వాడే 'నొవిఛోక్'గా నిర్ధరణ అయ్యింది. ఈ కుట్ర వెనుక రష్యా హస్తం ఉండొచ్చు’’ అని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆరోపించారు.
ఈ ఘటనకు రష్యా బాధ్యత వహించాలని థెరిసా మే అన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయం రష్యా రాయబార కార్యాలయాన్ని ఆదేశించింది. అంతర్జాతీయ రసాయన ఆయుధాల నియంత్రణ మండలికి నొవిఛోక్ గురించిన పూర్తి వివరాలను అందించాలని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్.. రష్యా విదేశాంగ కార్యాలయాన్ని అడిగినట్టు థెరెసా తెలిపారు.
బుధవారం లోపు స్పందించకపోతే.. రష్యా చట్టవిరుద్ధంగా ప్రవర్తించిందని భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
''ఇది బ్రిటన్‌పై జరిగిన ప్రత్యక్ష దాడి అయ్యుండొచ్చు.. లేకపోతే సమర్థవంతమైన గూఢచారి సంస్థ 'నెర్వ్ గ్రేడ్ ఏజెంట్'పై ఆ దేశ ప్రభుత్వం నియంత్రణ కోల్పోయి ఉండొచ్చు.. ఈ 'నెర్వ్ గ్రేడ్ ఏజెంట్'ను వాడటం.. కేవలం స్క్రిపాల్, ఆయన కూతురిపై జరిగిన దాడిగా మాత్రమే మేం భావించడం లేదు. ఈ హత్యాయత్నం మా నగర వీధుల్లో జరిగింది. ఇది బ్రిటన్ పౌరుల భద్రతకు విఘాతం కలిగించే ఘటన. ఇది మా దేశంపై జరిగిన దాడిగా మేం భావిస్తున్నాం..!'' అని థెరెసా మే అన్నారు.
ఈ విషపూరిత రసాయనాన్ని బ్రిటన్‌లోని 'పార్టన్ డౌన్' ప్రయోగశాలలో తయారు చేసినట్టు థెరెసా మే తెలిపారు. ఈ రసాయనాన్ని మొదట రష్యా తయారు చేసిందని, ఇప్పటికీ తయారు చేస్తూ ఉందని ఆమె అన్నారు.
ఈ ఘటనలో రష్యాపై అభియోగం మోపడానికి మరో కారణం కూడా ఉంది. 'గతంలో రష్యా కోసం పని చేసి, ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్న వారిపై రష్యా నిఘా ఉంచింది. అందులో కొందరు ఇతర దేశాలకు కోవర్టులుగా పని చేస్తున్నారన్న కారణాలతో.. వారిని లక్ష్యంగా చేసుకుని, అంతమొందించాలని రష్యా భావిస్తోంది' అని థెరెసా మే అన్నారు.

అసలేం జరిగింది?
సిర్గీ స్క్రిపాల్ గతంలో రష్యా సైనికాధికారిగా పని చేశారు. ఆయన వయసు 66. తన ముప్ఫైమూడేళ్ల కూతురు యూలియా స్క్రిపాల్‌తోపాటుగా మార్చి 4న సాల్స్‌బరీలోని వీధిలో ఓ బెంచ్‌పై అచేతనంగా పడివున్నారు. స్థానికుల సమాచారంతో వీరిని పరీక్షించిన వైద్యులు వీరిపై విషప్రయోగం జరిగిందని ప్రాథమికంగా తెలిపారు. వీరిద్దరూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
వీరిద్దరూ కలిసి భోజనం చేసిన జిజ్జీ రెస్టారెంట్‌లోని టేబుల్ మీద, టేబుల్ పరిసర ప్రాంతంలో నొవిఛోక్ అవశేషాలను నిపుణులు గుర్తించారు. జీజ్జీ రెస్టారెంట్‌కు సమీపంలో ఉండే మిల్ పబ్‌లో కూడా ఈ అవశేషాలను గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆరోజు జిజ్జీ రెస్టారెంట్‌కు, మిల్ పబ్‌కు వెళ్లినవారు ఆందోళన చెందారు. వీరిలో దాదాపు 500 మంది ముందు జాగ్రత్తగా తమ వస్తువులను శుభ్రం చేసుకున్నామని తెలిపారు.

ఫొటో సోర్స్, EPA/ Yulia Skripal/Facebook
ఎవరీ సిర్గీ స్క్రిపాల్?
రష్యా మాజీ మిలిటరీ ఇంటెలిజెన్స్ కల్నల్ సిర్గీ స్క్రిపాల్, యూరప్‌లో పని చేస్తోన్న రష్యా గూఢచారుల సమాచారాన్ని బ్రిటన్ గూఢచార సంస్థ ఎంఐ6కు చేరవేశారని 2004లో రష్యా అభియోగం మోపింది.
స్క్రిపాల్.. 1990 నుంచి ఎంఐ6 కోసం పని చేస్తున్నారని, అందుకుగాను ఎంఐ6 1,00,000 డాలర్లు స్క్రిపాల్‌కు ఇచ్చిందని గతంలో రష్యా ఆరోపించింది.
అయితే.. 2010లో రష్యా, అమెరికా మధ్య జరిగిన గూఢచారుల పరస్పర అప్పగింత కార్యక్రమంలో భాగంగా నలుగురు గూఢచారులను రష్యా విడుదల చేసింది. అందులో స్క్రిపాల్ ఒకరు. తర్వాత కాలంలో ఆయన ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు.
ఏమిటీ 'నొకోవిఛ్'? ఎలా పని చేస్తుంది?
నొకోవిఛ్ అంటే రష్యా భాషలో.. 'కొత్తగా వచ్చిన వాడు' అని అర్థం. ఈ విష రసాయనం.. రష్యా గూఢచార సంస్థకు చెందినది. ఈ రసాయనాన్ని 1970-80 మధ్య కాలంలో రష్యా తయారు చేసింది.
ఏ-230 అనే మరో విష రసాయనం వీఎక్స్ నెర్వ్ ఏజెంట్ కంటే ఐదు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రమాదకారి. ఇది మనుషులను కొన్ని నిమిషాల్లోనే హతమారుస్తుంది.
ఇందులో కొన్ని ద్రవ రూపంలో ఉంటే.. మరికొన్ని ఘన రూపంలో ఉంటాయి. మరికొన్ని.. తక్కువ సామర్థ్యం ఉన్న రెండు రకాల విష రసాయనాలు ఉంటాయి. కానీ ఈ రెంటినీ కలిపినపుడు అత్యంత ప్రమాదకరమైన విషం తయారవుతుంది.
వీటిలో ఒకరకమైన రసాయనాన్ని 'రసాయన ఆయుధం'గా ఉపయోగించడానికి రష్యా మిలిటరీ ఆమోదం తెలిపింది.

ఫొటో సోర్స్, PA
ఈ వివాదంపై ఎవరేమన్నారు?
ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాయి. ఈ హత్యాయత్నం వెనుక రష్యా హస్తం ఉందన్న థెరెసా మే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని అమెరికా స్టేట్ సెక్రెటరీ టిల్లర్‌సన్ అన్నారు.
''ఈ హత్యాయత్నానికి పాల్పడినవారు, ఆదేశాలు జారీ చేసిన వారు ఇద్దరూ ఈ ఘటనకు బాధ్యులే.. వారు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విషయంలో యూకేకు మా మద్దతు ఉంటుంది.'' అని టిల్లర్‌సన్ అన్నారు.
ఈ విషయం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌తో సోమవారం నాడు థెరెసా మే మాట్లాడారు. రష్యా దుందుడుకు చర్య గురించి ఆమె వివరించారని థెరెసా మే అధికార ప్రతినిధి తెలిపారు.
‘నాటో’ సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టాల్టెన్‌బెర్గ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ''ఇది ఓ భయంకరమైన చర్య. ఈ రసాయనాల ప్రయోగాన్ని ఎవ్వరూ ఆమోదించరు. అధికారులు యూకేతో సంప్రదింపులు జరుపుతున్నారు'' అని ఆయన అన్నారు.
అయితే.. ఈ విషయమై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా స్పందించారు. బ్రిటన్ పార్లమెంట్‌లో థెరెసా మే ఆరోపణలు సర్కస్‌ను తలపిస్తున్నాయన్నారు.
''ఒక విషయం మాత్రం స్పష్టం.. రాజకీయ ప్రచారం కోసమే థెరెసా మే.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు'' అని ఆమె అన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో థెరెసా మే.. బ్రిటన్‌లో నివసించే రష్యా సంపన్నులపై ఆంక్షలు విధించవచ్చు, బ్రిటన్‌లోని రష్యా రాయబారులను వెళ్లగొట్టుండవచ్చు, లేక వారిపై ఆంక్షలను మరింత కఠినం చేసుండవచ్చు. కానీ వీటికి బదులుగా.. ఈ ఘటనపై థెరెసా మే రష్యా వివరణ కోరారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసివుంటుందని హెచ్చరించారు.
గూఢచర్య ప్రపంచంలో పరస్పర దాడులు సర్వసాధారణమే. కానీ ఈ దాడిని సాధారణంగా థెరెసా మే పరిగణించడం లేదు. రష్యా హద్దులు దాటి ప్రవర్తిసోందని, రష్యా చర్యల వల్ల ఇతర దేశాలకూ ప్రమాదం పొంచివుందని థెరెసా మే వాదన.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








