నోవిచోక్ కేసు: 'మేం పర్యటకులుగానే సాలిస్బరీకి వెళ్ళాం'

నిందితులు

రష్యా మాజీ గూఢచారి మీద విష ప్రయోగం చేసింది వీరేనంటూ బ్రిటన్ ప్రకటించిన ఇద్దరు అనుమానితులు, తాము పర్యటకులం మాత్రమేనని చెప్పారు. స్నేహితుల సూచన మేరకే తాము సాలిస్బరీకి వెళ్ళామని అలెగ్జాండర్ పెట్రోఫ్, రుస్లాన్ బుషిరోఫ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్.టి చానల్‌కు చెప్పారు.

అయితే, వీరిద్దరూ రష్యా మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులని, గత మార్చి నెలలో సాలిస్బరీలో రష్యా మాజీ గూఢచారి సెర్గెయ్ స్కృపాల్‌, ఆయన కుమార్తె యూలియాల మీద విష ప్రయోగం చేసింది వీరేనని బ్రిటన్ విశ్వసిస్తోంది.

ఇంటర్వ్యూలో చెప్పిందంతా అబద్ధమేనన్న బ్రిటన్

"రష్యా ప్రభుత్వానికి చెందిన చానల్‌లో ప్రసారం చేసిన ఇంటర్వ్యూ అంతా అబద్ధం. అందులో వాస్తవాలను వక్రీకరించారు. ఇది ప్రజల తెలివితేటలను అవమానించే ప్రహసనమే" అని ప్రధానమంత్రి థెరెసా మే అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

అంతకుముందు, బుధవారం నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ మాట్లాడుతూ, "వారికి నేరాలతో ఎలాంటి సంబంధం లేదు. వారు సామాన్య పౌరులు" అని అన్నారు.

సెర్గెయ్ స్కృపాల్, ఆయన కుమార్తె యూలియాల మీద నోవిచోక్ అనే రసాయనిక పదార్థంతో విష ప్రయోగం జరిగింది. అయితే, వారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, రష్యా సంఘటనలతో సంబంధం లేని డాన్ స్టర్గెస్ అనే మహిళ అదే విష ప్రయోగానికి గురై జూలై నెలలో మరణించారు.

సీసీటీవీ ఫుటేజ్

ఆ ఇద్దరు రష్యన్లు ఏమంటున్నారు?

ఒత్తిడికి లోనైనట్లు కొంత ఇబ్బందిగా కనిపించిన ఆ ఇద్దరు వ్యక్తులు బ్రిటన్ నేర పరిశోధకులు ప్రకటించినట్లుగా తమ పేర్లు, అలెగ్జాండర్ పెట్రోఫ్, రుస్లాన్ బోషిరోఫ్ అని ధ్రువీకరించారు. "అవి మా నిజమైన పేర్లే" అని వారన్నారు.

ఆర్.టి చానల్ రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. బ్రిటన్ ప్రభుత్వం అనుమానిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తులను చానల్ చీఫ్ ఎడిటర్ మార్గరీటా సిమన్యాన్ ఇంటర్వ్యూ చేశారు. "వీరి పాస్‌పోర్టులు బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన ఫోటోలు, వివరాలతో మ్యాచ్ అయ్యాయి" అని ఆమె చెప్పారు.

క్రీడాకారుల పోషక పదార్థాల వ్యాపారం చేస్తున్నామని చెప్పిన ఆ ఇద్దరు వ్యక్తులు విహారయాత్ర కోసమే బ్రిటన్‌కు వెళ్ళి, ఆ పర్యటనలో భాగంగా సాలిస్బరీని సందర్శించినట్లు చెప్పారు.

నోవిచోక్ అనుమానితులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నోవిచోక్ విష ప్రయోగానికి పాల్పడ్డింది వీరేనంటూ బ్రిటన్ అధికారులు విడుదల చేసిన ఫోటోలు

"ఈ అందమైన నగరాన్ని చూడాలని మా మిత్రులు చాలా కాలంగా చెబుతూ వచ్చారు" అని పెట్రోఫ్ చెప్పారు.

మార్చి 3న తాము సాలిస్బరీలో గంట సేపు మాత్రమే ఉన్నామని, విపరీతంగా మంచు కురుస్తుండడంతో మార్చి 4, ఆదివారం నాడు ఇతర ప్రాంతాలు చూడడానికి వెళ్ళామని వారు చెప్పారు.

అయితే, అనుకోకుండా తాము స్కృపాల్ ఇంటి మీదుగా వెళ్శి ఉండవచ్చని, "కానీ అది ఎక్కడ ఉందో మాకు తెలియదు" అని పెట్రోఫ్ బదులిచ్చారు.

నోవిచోక్ గురించి అడిగినప్పుడు, అలాంటిదేదీ తాము తీసుకువెళ్ళలేదని వారు గట్టిగా చెప్పారు. బ్రిటిష్ అధికారులు చెబుతున్నట్లుగా నీనా రిక్కీ పర్ఫ్యూమ్ బాటిలో దాన్ని తీసుకువెళ్ళామనడం పూర్తిగా అవాస్తవమని అన్నారు.

"మహిళల పర్ఫ్యూమ్‌ను తీసుకువెళ్ళడాన్ని తప్పు పట్టడం విచిత్రం కాదా" అని బోషిరోఫ్ ప్రశ్నించారు.

పర్ఫ్యూమీ సీసాలో విషం?

ఫొటో సోర్స్, AFP/MET POLICE

ఫొటో క్యాప్షన్, రోలీ ఇంట్లో దొరికిన ఈ పర్ఫ్యూమ్ సీసాలోనే విషపూరిత రసాయన పదార్థాన్ని తీసుకువెళ్ళారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఆరోపణలతో తమ జీవితాలు తలకిందులయ్యాయని వీరు ఆర్.టి చానల్‌తో అన్నారు. "మేం బయటకు వెళ్ళడానికే భయపడుతున్నాం. మాకు ప్రాణభయం పట్టుకుంది. మా జీవితాలు, మా సన్నిహితుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి" అని బోషిరోఫ్ అన్నారు.

అయితే, ఈ ఇంటర్వ్యూను చాలా జాగ్రత్తగా తయారు చేశారని మాస్కోలోని బిబిసి ప్రతినిధి సారా రెయిన్స్‌ఫోర్డ్ వివరించారు. అందులోని ధ్వని పూర్తిగా ఈ కేసు మీద రష్యా చేస్తున్న వాదనకు అనుగుణంగా ఉందని ఆమె విశ్లేషించారు.

బ్రిటన్ చేస్తున్న ఆరోపణలు ఏమిటి?

వీరిద్దరూ రష్యా మిలటరీ గూఢచర్య విభాగం జి.ఆర్.యుకు చెందిన అధికారులని బ్రిటన్ పోలీసులు విశ్వసిస్తున్నారు. వాళ్ళు తప్పుడు పాస్‌పోర్టుల మీద లండన్ నుంచి మాస్కోకు వెళ్ళి ఉంటారని వారు చెబుతున్నారు.

వాళ్ళు మార్చి 3న సాలిస్బరీకి రావడం నిఘా చర్యలలో భాగమేనని, మార్చి 4న వాళ్ళు మళ్ళీ వచ్చి స్కృపాల్ ఇంటి ప్రధాన ద్వారానికి నోవిచోక్ రసాయనాన్ని పూసారని వారంటున్నారు.

విమానాశ్రయంలో అనుమానితులు

ఫొటో సోర్స్, MET POLICE

ఫొటో క్యాప్షన్, లండన్ హీత్రో విమానాశ్రయం సిసిటివి ఫుటేజిలో ఇద్దరు అనుమానితులు కనిపించారు.

వారిద్దరినీ నేరస్థులుగా నిర్థరించడానకి తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సిపిఎస్) చెబుతోంది. అయితే, ఆ ఇద్దరు వ్యక్తుల అప్పగింత కోసం అది దరఖాస్తు ఏమీ చేయడం లేదు. ఎందుకంటే, రష్యా తన దేశస్థులిద్దరినీ మరో దేశానికి అప్పగించే పని చేయదు.

అయితే, వారి మీద యురోపియన్ అరెస్ట్ వారంట్ జారీ చేశారు. వాళ్ళు కనుక ఐరోపా దేశాల్లో ప్రయాణిస్తే ఈ వారంట్ కింద అరెస్ట్ చేస్తారు. వాళ్ళు కనుక రష్యా దాటి బయటకు అడుగు పెడితే పట్టుకుంటామని బ్రిటన్ హోం శాఖ మంత్రి సాజిద్ జావిద్ స్పష్టం చేశారు.

నిందితులు

ఆర్.టి. చానల్ చీఫ్ ఎడిటర్ ఏమన్నారు?

నోవిచోక్ అనుమానితులతో ఇంటర్వ్యూ చేసిన విధానం మీద అనుమానాలు వ్యక్తం కావడంతో, ఆర్.టి. చానల్ చీఫ్ ఎడిటర్ మార్గరిటా సిమన్యాన్‌తో మాట్లాడే ప్రయత్నం చేసింది బీబీసీ.

ఆర్.టి. చానల్ ఇంటర్వ్యూలో ఇద్దరు అనుమానితులు తాము సాలిస్బరీకి పర్యటకులుగానే వెళ్ళామన్నారు. అదంతా పథకం ప్రకారం అల్లిన ఇంటర్వ్యూ అని బ్రిటన్ అధికారులు ఆరోపించారు.

బీబీసీ న్యూస్‌నైట్ కార్యక్రమంలో ఆర్.టి. ఎడిటర్ సిమన్యాన్ మాట్లాడుతూ, "ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పిన విషయాలను నమ్మడానికి నావద్ద ఎలాంటి కారణాలు లేవు. అలాగే, బ్రిటన్ అధికారులు చెబుతున్నది నమ్మడానికి కూడా నా వద్ద అసలే కారణాలూ లేవు" అని అన్నారు.

రష్యా ప్రభుత్వానికి ఆర్.టి. చానల్ ఒక ప్రచార అస్త్రమా అని అడిగిన ప్రశ్నకు ఆమె, "మీ ప్రశ్న నాకు పశ్చిమ దేశాల ప్రచారం కార్యక్రమంలో భాగంగా కనిపిస్తోంది" అని అన్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)