నోవిచోక్ విష ప్రయోగం : 'సాలిస్బరీ కేసులో అనుమానితుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి మెడల్ అందుకున్న గూఢచారి'

ఫొటో సోర్స్, BELLINGCAT / PA
రష్యా మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తె యూలియాలపై బ్రిటన్‌లో జరిగిన విష ప్రయోగం కేసులో అనుమానితుడైన రష్యన్ రుస్లాన్ బోషిరోవ్ సైనికాధికారి అని ఒక పరిశోధనా వెబ్‌సైట్ తెలిపింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో ప్రకటించినట్లు ఆయన సాధారణ పౌరుడేమీ కాదని, స్వయాన పుతిన్ నుంచే ఉన్నతస్థాయి మెడల్ అందుకున్న గూఢచర్య అధికారి అని వెబ్‌సైట్ చెప్పింది.
సాలిజ్‌బరీ నగరంలో మార్చి 4న జరిగిన నోవిచోక్ రసాయన విష ప్రయోగంతో స్క్రిపాల్, యూలియా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
ఇది రష్యా ప్రభుత్వం పనేనని, రుస్లాన్ బోషిరోవ్, అలెగ్జాండర్ పెట్రోవ్ అనే రష్యన్లు ఈ దాడికి పాల్పడ్డారని బ్రిటన్ పేర్కొంది. దీనిని రష్యా తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, XXX
కల్నల్ అనటోలియ్ చేపిగా
బోషిరోవ్ అసలు పేరు కల్నల్ అనటోలియ్ చేపిగా అని, ఆయన గూఢచర్య అధికారి అని పరిశోధన వెబ్‌సైట్ 'బెల్లింగ్‌క్యాట్' తాజాగా వెల్లడించింది. ఆయన చెచెన్యా, ఉక్రెయిన్‌లలో పనిచేశారని తెలిపింది. 2014లో అనటోలియ్ చేపిగాకు రష్యా ప్రభుత్వం 'హీరో ఆప్ ద రష్యన్ ఫెడరేషన్' మెడల్‌ను ఇచ్చిందని చెప్పింది.
తాజా సమాచారంతో బోషిరోవ్ అసలు పేరు, ఆయన నేపథ్యం స్పష్టమవుతోంది. అయితే దీనిపై బ్రిటన్ అధికారులు ఇంకా ఏమీ మాట్లాడలేదు.
బోషిరోవ్ నేపథ్యంపై ఈ ప్రచారానికి ఆధారం లేదని రష్యా విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా వ్యాఖ్యానించారు.
చేపిగాకు 39 ఏళ్లు. రష్యాలోని అత్యున్నత శిక్షణ సంస్థల్లో ఆయన శిక్షణ పొందారు. రష్యా సైనిక గూఢచార విభాగం జీఆర్‌యూ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాల యూనిట్‌లో పనిచేశారు. తన సేవలకుగాను 20కి పైగా సైనిక పురస్కారాలు అందుకున్నారు.
దాదాపు తొమ్మిదేళ్ల క్రితం చేపిగా మాస్కోకు బదిలీ అయ్యారు. అక్కడ ఆయనకు రుస్లాన్ బోషిరోవ్‌గా నకిలీ గుర్తింపును అందించారు. ఆయన తొమ్మిదేళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ పనిచేస్తున్నారు.
2014 డిసెంబరులో రహస్యంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో 'హీరో ఆఫ్ ద రష్యన్ ఫెడరేషన్' మెడల్‌ను ఆయనకు అధ్యక్షుడు పుతిన్ ప్రదానం చేశారు. ఏటా అతి కొద్ది మందికి మాత్రమే రష్యా ప్రభుత్వం ఈ మెడల్‌ను ఇస్తుంది. చేపిగా ఈ మెడల్ అందుకున్న సమయాన్ని బట్టి ఉక్రెయిన్‌లో కార్యకలాపాలకుగాను ఆయనకు దీనిని ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, METROPOLITAN POLICE
అదే రోజు తిరిగి రష్యాకు
అలెగ్జాండర్ పెట్రోవ్‌తో కలిసి దొంగ పాస్‌పోర్టుతో చేపిగా ఈ ఏడాది మార్చిలో బ్రిటన్ వెళ్లినట్లు భావిస్తున్నారు.
చేపిగా, పెట్రోవ్ మార్చి 2న రష్యా రాజధాని మాస్కో నుంచి బ్రిటన్ రాజధాని లండన్‌కు దాదాపు 48 కిలోమీటర్ల దూరంలోని గాట్విక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రెండు సార్లు సాలిజ్‌బరీ నగరానికి వెళ్లారు. సెర్గీ స్క్రిపాల్‌పై, ఆయన కుమార్తెపై మార్చి 4న విష ప్రయోగానికి పాల్పడ్డారు. అదే రోజు చేపిగా, పెట్రోవ్ మాస్కోకు తిరిగి వచ్చేశారు.
తర్వాత వీరిద్దరి కోసం యూరోపియన్ అరెస్టు వారెంట్లు, ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. 'నేరస్థుల అప్పగింత' కింద రష్యా తమ పౌరులను ఇతర దేశాలకు అప్పగించదు.
సెర్గీ స్క్రిపాల్‌కు 67 ఏళ్లు. ఆయన బ్రిటన్ గూఢచార సంస్థ ఎంఐ6కు రహస్యాలను అమ్మేశారు. ఆయనపై, ఆయన కుమార్తెపై జరిగిన విష ప్రయోగానికి రష్యా ప్రభుత్వ ఆమోదం ఉందని బ్రిటన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఘటన తర్వాత బ్రిటన్, రష్యా సంబంధాలు బాగా బలహీనపడ్డాయి.

ఫొటో సోర్స్, EPA/YULIASKRIPAL/FACEBOOK
చర్చి సందర్శనకే వెళ్లామన్న బోషిరోవ్
ఈ ఏడాది జూన్‌లో ఆమ్స్‌బరీలోనూ ఒక విషప్రయోగం జరిగింది. ఈ ఘటనకూ, సాలిజ్‌బరీ ఉదంతానికీ సంబంధం ఉందని బ్రిటన్ అధికారులు పేర్కొన్నారు. ఆమ్స్‌బరీ ఘటనలో డాన్ స్టర్‌గెస్, ఆమె జీవిత భాగస్వామి విష ప్రభావానికి లోనయ్యారు. తర్వాత స్టర్‌గెస్ చనిపోయారు.
సాలిజ్‌బరీ ఘటనతో బోషిరోవ్, అలెగ్జాండర్ పెట్రోవ్‌లకు సంబంధం లేదని, వారు సాధారణ పౌరులని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 12న చెప్పారు.
తాము సాలిజ్‌బరీని పర్యాటకులుగానే సందర్శించామని, అక్కడి ప్రసిద్ధ చర్చిని చూడటానికే వెళ్లామని చేపిగా, అలెగ్జాండర్ పెట్రోవ్ ఈ నెల 13న రష్యన్ టీవీలో పేర్కొన్నారు.
తామిద్దరం క్రీడాకారులకు అవసరమైన పోషకాహారానికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నామని వారు చెప్పారు. తామే విష ప్రయోగానికి పాల్పడ్డామన్న బ్రిటన్ ఆరోపణలతో తమ జీవితాలు తలకిందులయ్యాయని తెలిపారు. తమకు ప్రాణభీతి ఉందన్నారు.
ఈ వ్యాఖ్యలను బ్రిటన్ తోసిపుచ్చింది. వీరి వ్యాఖ్యలు విష ప్రయోగ బాధితుల మనసులను గాయపరుస్తున్నాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- నోవిచోక్ దాడి: 'ఆ దారుణాలకు బాధ్యుడు రష్యా అధ్యక్షుడు పుతిన్' -బ్రిటన్ మంత్రి బెన్
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అమెరికా 'స్పేస్ ఫోర్స్'
- లాల్ బహుదూర్ శాస్త్రి మరణం: గుండెపోటా? విషప్రయోగమా?
- ‘అడల్టరీ చట్టం’లో మార్పులతో వైవాహిక బంధాలు ప్రమాదంలో పడతాయా?
- మరి ‘రఫేల్’తో సైన్యం స్థైర్యం దెబ్బతినదా: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సిద్ధూ ప్రశ్న
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








