బిహారీ హంతకులకు ఏకే-47 గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నీరజ్ ప్రియదర్శి
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత ఆదివారం (సెప్టెంబర్ 23) బిహార్‌లోని ముజఫర్‌పూర్ నగరంలో మాజీ మేయర్ సమీర్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పోలీసుల విచారణలో దుండగులు సమీర్ కారును చుట్టుముట్టి, ఏకే-47తో గుళ్ల వర్షం కురిపించినట్లు తేలింది. ఈ ఘటనలో సమీర్ సింగ్‌తో పాటు ఆయన డ్రైవర్ కూడా అక్కడికక్కడే మరణించారు.
పోస్టుమార్టం రిపోర్టులో సమీర్ సింగ్ శరీరంలోకి 16 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు గుర్తించారు.
అయితే, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే హంతకులకు ఏకే-47లు ఎలా లభించాయి?
ఈ సంఘటనపై బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యశస్వి యాదవ్ ''ముజఫర్‌పూర్ మాజీ మేయర్‌ను కాల్చి చంపారు. నితీష్ జీ.. మీ నిష్క్రియాపరత్వం వల్ల బిహార్‌లో ఏకే-47లు మామూలు ఆయుధాలుగా మారిపోయాయి'' అంటూ ట్వీట్ చేశారు.
దాంతో పాటు యశస్వి యాదవ్.. బిహార్‌లో ఏకే-47లతో జరిగిన మరో మూడు హత్యలను కూడా ఉదహరించారు.

ఫొటో సోర్స్, Neeraj Priyadarshy/BBC
ఏకే-47లు ఎక్కడి నుంచి వచ్చాయి?
బిహార్‌లో హఠాత్తుగా ఏకే-47తో జరిగే హత్యలు ఎందుకు పెరిగాయో ముంగేర్ డివిజన్‌కు చెందిన డీఐజీ జితేంద్ర మిశ్రా వివరించారు.
''జబల్పూర్ నుంచి ముంగేర్‌కు ఏకే-47 రైఫిళ్ల స్మగ్లింగ్ జరిగింది. ఈ ఘటనలో ముంగేర్ పోలీసులు, జబల్‌పూర్ పోలీసులు కలిసి ఒక అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి వాళ్ల నాయకుడు పురుషోత్తం రజక్‌ను, అతని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. వాళ్ల నుంచి ఎనిమిది ఏకే-47లను స్వాధీనం చేసుకున్నాం'' అని తెలిపారు.
ఇదే కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన జబల్‌పూర్ ఎస్పీ అమిత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ''ఈ ముఠా జబల్పూర్‌కు చెందిన ఆర్డినెన్స్ డిపో నుంచి ఏకే-47లను కాజేసి ముంగేర్‌లో వాటిని విక్రయించేది. ముఠా నాయకుడు పురుషోత్తం విచారణలో అతను గతంలో సైన్యంలో పని చేసినట్లు తెలిసింది. ఆర్డినెన్స్ డిపోలో పని చేస్తున్న సురేష్ ఠాకూర్ అతనికి రైఫిళ్లు తెచ్చి ఇస్తే, వాటిని పురుషోత్తం బిహార్ లో విక్రయించేవాడు. 2012 నుంచి ఇప్పటివరకు అతను సుమారు 70 ఏకే-47 రైఫిళ్లు విక్రయించినట్లు మా విచారణలో తేలింది'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Neeraj Priyadarshy/BBC
ముంగేర్‌తో ఏకే-47లకు సంబంధం ఏమిటి?
ఈ ఏకే-47లకు సంబంధించిన మొదటి క్లూ ముంగేర్‌లో బయటపడింది. పోలీసులు ఆగస్టు 29న జమాల్‌పూర్‌కు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో జబల్పూర్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అతనికి మూడు ఏకే-47లు విక్రయించినట్లు తెలిసింది. ఆ మూడింటిని ఇమ్రాన్‌కు విక్రయించిన వ్యక్తి పురుషోత్తం రజక్.
జబల్పూర్ ఎస్పీ అమిత్ సింగ్, ''ఏకే-47లు పట్టుబడ్డాయని తెలిసిన వెంటనే పురుషోత్తం తన కుమారుడు శీలేంద్రకు ఫోన్ చేసి ఇంటిలోని డబ్బులు, ఇతర సాక్ష్యాలను మాయం చేయమని చెప్పాడు. దాంతో శీలేంద్ర కొన్ని ఏకే-47 భాగాలను ఓ నదిలో విసిరేశాడు. విచారణలో ఈవిషయాన్ని అతనే ఒప్పుకున్నాడు'' అని తెలిపారు.
ముంగేర్‌లో పట్టుబడిన ఆయుధాలు బట్టి చూస్తే ఈ ఆయుధాల స్మగ్లింగ్ బిహార్, మధ్యప్రదేశ్‌లతో పాటు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ వరకు పాకినట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సుమారు ఆరుమందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
గత ఆరేళ్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి సుమారు 70 ఏకే-47 రైఫిళ్లను దొంగలించారన్న విషయం భారత దేశ అంతర్గత భద్రతకే గొడ్డలిపెట్టులాంటిది.

ఫొటో సోర్స్, Neeraj Priyadarshy/BBC
ఒక్కో ఏకే-47 రైఫిల్ విలువ రూ. 5 లక్షలు
పోలీసుల విచారణలో ఇమ్రాన్.. ఒక్కో ఏకే-47ను కనీసం 5 లక్షల రూపాయలకు విక్రయించినట్లు అంగీకరించాడు. కొన్ని రైఫిళ్లను 7-8 లక్షలకు కూడా విక్రయించారు. కొనేవాళ్లను బట్టి రేటును నిర్ణయిస్తారు.
ఆయుధాల స్మగ్లింగ్ ముఠా నేత పురుషోత్తం రజక్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి సురేష్ ఠాకూర్ చెప్పిన విషయాలను బట్టి దీనికి కావాల్సిన అన్ని రుజువులూ దొరికాయి. ప్రస్తుతం ముంగేర్ పోలీసులు ఇమ్రాన్, అతని సహచరుడు షంషేర్ నుంచి ఎవరెవరికి ఆ ఆయుధాలను విక్రయించారన్న వివరాలను కనుగొనే పనిలో ఉన్నారు.
అవి నేరస్తుల చేతుల్లో పడ్డాయా, లేదా మావోయిస్టుల చేతుల్లో పడ్డాయా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
(జబల్పూర్ నుంచి సంజీవ్ చౌదరి అందించిన వివరాల మేరకు)
ఇవి కూడా చదవండి:
- నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్: ఓషోగా ఆమిర్ ఖాన్... ఆనంద్ షీలాగా ఆలియా భట్
- సుప్రీంకోర్టు తీర్పు: నేరస్తులు రాజకీయాల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంటుదే
- ఆయుష్మాన్ భారత్‌తో ప్రజలకు నిజంగా మేలు జరుగుతుందా?
- సిక్కిం: ఎత్తయిన పర్వతాల్లో అత్యంత అందమైన విమానాశ్రయం
- అగరుబత్తీ - సిగరెట్: ఏ పొగ ఎక్కువ ప్రమాదకరం?
- చంద్రునిపై సాయి ముఖం: ఎందుకు అలా కనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








