ఆయుష్మాన్ భారత్‌తో ప్రజలకు నిజంగా మేలు జరుగుతుందా?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రధాని మోదీ ఆదివారం (సెప్టెంబర్ 23) ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని నిరుపేదలు, అణగారిన వర్గాల ఆరోగ్యానికి ఇది భరోసానిస్తుందని పథకాన్ని ప్రారంభించే సమయంలో ఆయన చెప్పారు.

ఈ పథకంలో భాగంగా ఏటా ప్రతి కుటుంబానికి రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు.

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 10కోట్ల కుటుంబాలకు, అంటే 50కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.

మందులు, ఆస్పత్రి గదుల లాంటి అన్ని ఖర్చులూ ఈ బీమా పరిధిలోకి వస్తాయని ప్రధాని చెబుతున్నారు. కేన్సర్, హృద్రోగాల లాంటి పెద్ద సమస్యలతో సహా 1300 ఆరోగ్య సమస్యలు ఈ బీమా పరిధిలోకి వస్తాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అసలు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా దేశం కోట్లాది మందికి బీమా సౌకర్యం కల్పించగలదా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితే అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పథకం ప్రైవేటు ఆస్పత్రులకు లాభసాటిగా మారగలదా? ఈ విషయాల గురించి భారత్‌లో తన సేవలందిస్తోన్న ప్రఖ్యాత ఆర్థికవేత్త జాన్ డ్రెజ్ బీబీసీ ప్రతినిధి మాన్సి దాష్‌తో మాట్లాడారు. డ్రెజ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలందర్నీ మభ్య పెడుతున్నారని నా అభిప్రాయం.

10కోట్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పిస్తామని మోదీ చెబుతున్నారు. కానీ దాని కోసం ఇప్పటివరకు ఒక్క నయా పైసా కూడా విడుదల చేయలేదు.

ఆయుష్మాన్ భారత్‌కు ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్ రూ.2వేల కోట్ల రూపాయలు. ఆ మొత్తంలో దాదాపు వెయ్యి కోట్లు రూపాయలు గతంలోనే జాతీయ ఆరోగ్యం బీమా పథకంలో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ డబ్బు ఆ పథకంలో భాగంగానే ఉంది.

మిగతా రూ.వెయ్యి కోట్లను ‘హెల్త్ అండ్ వెల్‌నెస్’ కేంద్రాల కోసం కేటాయించారు. అంటే ఒక్కో కేంద్రానికి రూ.80వేలు అందుతాయి.

రానున్న నాలుగేళ్లలో ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా లక్షన్నర ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే పాత పీఏసీలు, సీహెచ్‌సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పేర్లు మార్చి వాటిని ‘హెల్త్ అండ్ వెల్‌నెస్’ కేంద్రాలుగా తీర్చుదిద్దుతారని ఆ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ ప్రకటన

ఫొటో సోర్స్, @MOHFW_INDIA/TWITTER

ఇది ప్రజలను ఆకర్షించేందుకు చేస్తున్న పనే. ఇప్పటివరకూ ఈ పథకం కోసం ఒక్కపైసా కూడా విడుదల చేయలేదు. నా అంచనా ప్రకారం కనీసం లక్ష కోట్ల రూపాయలైనా కేటాయించకపోతే, 10కోట్ల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించడం అసాధ్యం.

ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా అని ప్రభుత్వం చెబుతోంది. ఉదాహరణకు... ఒక్కో కుటుంబం అందులో 1 శాతం వాడకున్నా, కుటుంబానికి రూ.5వేలు కేటాయించాలి. అంటే 10కోట్ల కుటుంబాలకు రూ.50వేల కోట్లు కావాలి.

ఆ డబ్బు చూపించాకే కదా, ఆరోగ్య పథకాల గురించి మాట్లాడాల్సింది.

ప్రభుత్వం చెబుతున్నట్లు అందరికీ ఆరోగ్య బీమా కల్పించాలంటే ‘సోషల్ ఇన్సూరెన్స్’ మోడల్‌ను అనుసరించాలి. కానీ దానికంటే ముందు గ్రామాల స్థాయిలోని ఆరోగ్య కేంద్రాలను మెరుగ్గా, పటిష్ఠంగా తయారు చేయాలి. లేకపోతే గ్రామీణ వైద్య కేంద్రాలను వదిలిపెట్టి, బీమా మీదే పూర్తి భారం వేస్తూ ప్రజలు ప్రతి సమస్యకూ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖర్చుల్లో ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. దాని వల్ల ఆరోగ్య బీమా పథకంలో భాగంగా ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించే డబ్బే ఎక్కువవుతుంది తప్ప ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి మెరుగుపడదు.

జాన్ డ్రెజ్
ఫొటో క్యాప్షన్, జాన్ డ్రెజ్

అందుకే మొదట ప్రాథమిక స్థాయిలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దీన్ని గేట్ కీపింగ్ అంటారు. అంటే, మొదట ప్రజలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి తమ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాలి. అక్కడి వైద్యుడి సూచన ద్వారా ప్రభుత్వ పెద్దాస్పత్రులకు గానీ, ప్రైవేటు ఆస్పత్రులకు గానీ వెళ్లి తమ బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి.

గేట్ కీపింగ్ వ్యవస్థ బలోపేతమవుతే... అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగు పడితేనే ఇది సాధ్యమవుతుంది.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఆరోగ్య కేంద్రాల పరిస్థితి గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త మెరుగుపడింది. కానీ వీటిలోనూ అనేక సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దానికితోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఇప్పటిదాకా వాటి సామర్థ్యం మేరకు ఉపయోగించుకోలేదు.

108 అంబులెన్సుల సేవలకు చాలా ప్రాచుర్యం దక్కింది. గ్రామాల్లో ఔషదాల పంపిణీ కూడా మంచి ప్రయత్నమే. స్థానిక వైద్య కేంద్రాల్లో వైద్యుల గైర్హాజరీ ఇప్పటికీ పెద్ద సవాలుగానే మిగిలింది. కాస్త నిఘా పెంచితే దీన్ని అధిగమించడం పెద్ద కష్టమేం కాదు.

తల్లితో బిడ్డ

ఫొటో సోర్స్, Getty Images

మొదట ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తిస్థాయిలో మెరుగుపరిచాకే క్రమంగా సోషల్ ఇన్సూరెన్స్ వైపు అడుగేయాలన్నది నా అభిప్రాయం.

డిజిటిల్ ఇండియా పేరుతో ఆచరణలోకి వచ్చిన కొన్ని టెక్నిక్‌లు కొన్నిసార్లు మేలు చేసినా, కొన్ని సందర్భాల్లో కీడు కూడా చేస్తాయి.

ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీన్ని పబ్లిక్ డేటా ఫ్లాట్‌ఫార్మ్ అని ఐటీ రంగ నిపుణులు పిలుస్తారు.

అంటే... రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టి 50కోట్ల మంది డేటాను ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ రోజుల్లో డేటా సాయంతో ఎంత సంపాదించొచ్చనే విషయం అందరికీ తెలుసు. అందుకే ఇది ఆరోగ్య పథకం కంటే భారీ స్థాయిలో జరుగుతున్న డేటా సేకరణలానే కనిపిస్తోంది.

చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఆయుష్మాన్ భారత్‌ పథకంలో భాగంగా మొట్టమొదట ‘నేషనల్ హెల్త్ స్టాక్’ పత్రాలను నీటీ ఆయోగ్ విడుదల చేసింది. ఈ పత్రాలను గమనిస్తే... వీటిలో ఆరోగ్య సేవల గురించి తక్కువగా, డేట్ ప్లాట్‌ఫామ్‌గా మారేందుకు చేపడుతున్న పనులు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ పథకంలో ప్రైవేటు ఆస్పత్రులు కూడా భాగమవుతాయి. కానీ, ఆయుష్మాన్‌ భారత్ పథకం కింద కొన్ని చికిత్సలకు ప్రభుత్వం అందిస్తున్న డబ్బు చాలా తక్కువనీ, ఆ ధరకు చికిత్స అందించడం కష్టమనీ ప్రైవేటు ఆస్పత్రులు భావిస్తున్నాయి. అంటే... ఈ పథకం వల్ల తమ ఆదాయం తగ్గిపోతుందని అవి భయపడుతున్నాయి.

దానివల్ల కొన్ని ఆస్పత్రులు ఈ పథకంలో భాగం కాకపోవచ్చు. కేవలం తక్కువ లాభంతోటే చికిత్స అందించడానికి సిద్ధపడే ఆస్పత్రులే ఇందులో భాగమయ్యే అవకాశం ఉంది.

మరోపక్క ప్రభుత్వం అందించే ధరల కంటే మరింత తక్కువ ఖర్చులోనే చికిత్స అందించడానికి ప్రైవేటు ఆస్పత్రులు ప్రయత్నించే అవకాశం ఉంది. దీని ప్రభావం నేరుగా వైద్య నాణ్యతపైన పడుతుంది.

పటిష్ఠమైన నిఘా పెట్టడం ద్వారా ఆ సమస్యను తగ్గించొచ్చు. కానీ అంత భారీ స్థాయిలో నిఘా పెట్టడం కూడా సాధ్యం కాకపోవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు కార్టూన్

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)