సుప్రీంకోర్టు తీర్పు: నేరస్థులు రాజకీయాల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంటుదే... క్రిమినల్ కేసులున్నంత మాత్రాన అనర్హులుగా ప్రకటించలేం

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

కేవలం క్రిమినల్ కేసులు నమోదైనంత మాత్రాన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఈ అంశంపై పార్లమెంటే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

నేరస్థులు రాజకీయాల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు ధర్మాసనంలో సభ్యులు.

నేర అభియోగాలు నమోదైన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ ధర్మాసనం మంగళవారం (సెప్టెంబర్ 25న) ఇచ్చిన తీర్పులో వెలువరించింది.

నేర చరిత్రను ప్రజలకు తెలపాలి

ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసే తమ అభ్యర్థుల నేర చరిత్రను ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా పార్టీలు తమ తమ వెబ్‌సైట్ల ద్వారా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా స్థానిక పత్రికలు, ఛానెళ్ల ద్వారా కూడా ప్రచారం చేయాలని తెలిపింది.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమపై నమోదైన నేర సంబంధ కేసుల వివరాలను, నేర చరిత్రను, పెండింగ్ కేసులను ఆయా రాజకీయ పార్టీలకు సమర్పించాలి.

ఇలా ప్రజలందరికీ నేర చరిత్ర గల అభ్యర్థుల వివరాలను పారదర్శకంగా అందించటం వల్ల ఓటర్లు తగిన అవగాహనతో అభ్యర్థులను ఎంచుకోగలుగుతారని ధర్మాసనం అభిప్రాయపడింది.

రాజకీయాల్లో పెరుగుతున్న నేరస్తులు

నేర చరిత్రగల రాజకీయ నాయకులు దేశానికి ఇబ్బంది అని సుప్రీంకోర్టు తెలిపింది. అధికారంలో ఇలాంటి వాళ్లు ఉండటం ప్రజాస్వామ్య మూలాలకే ప్రమాదమని, రాజకీయాలు, అవినీతిని నేరమయం చేయటం జాతీయ, ఆర్థిక ఆందోళనగా మారిందని వివరించింది. ఇది స్వీయ వినాశక వ్యాధి అని, యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగట్లేదని కోర్టు అభిప్రాయపడింది.

రాజకీయాల్లో నేర ప్రవృత్తి స్థాయిలు క్రమంగా, స్థిరంగా పెరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తగిన చర్యలు తీసుకుని రాజకీయాల్లో నేరపూరిత ధోరణులకు అడ్డుకట్ట వేయాలని తెలిపింది.

దేశం ఎదురుచూస్తోంది..

కాగా, నేర అభియోగాలు నమోదైన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పని చేయాల్సింది పార్లమెంటేనని తెలిపింది.

నేరస్తులపై అనర్హత వేసే చట్టం కోసం దేశం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పార్లమెంటు తరపున సుప్రీంకోర్టు చట్టం చేయలేదని.. (నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే చట్టం చేసేలా) పార్లమెంటు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం తెలిపింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1)(ఈ) ప్రకారం చట్టం చేయాల్సిన బాధ్యత పార్లమెంటుకు ఉందని వెల్లడించింది.

‘‘రాజ్యాంగాన్ని కాపాడే వారిగా, మేం (సుప్రీంకోర్టు) ఈ పని చేయాలని మిమ్మల్ని (పార్లమెంటును) అడగొచ్చు’’ అని తన తీర్పులో ధర్మాసనం పేర్కొంది.

ప్రస్తుతం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరాలు రుజువై, శిక్ష పడిన నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. అయితే, నేర అభియోగాలు ఎదుర్కొంటున్న, క్రిమినల్ కేసులు నమోదైన వారిని కూడా అనర్హుల్ని చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ తీర్పు నిరాశాజనకం.. ప్రజాస్వామ్యానికి మేలు చేయదు - ఏడీఆర్

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరాశాజనకంగా ఉందని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రతినిధి జగ్దీప్ చొకర్ అన్నారు. చట్టంలో పేర్కొన్న నిబంధనలను మాత్రమే సుప్రీంకోర్టు పాటించిందని, చట్టం స్ఫూర్తిని మరచిందని చెప్పారు. ఈ తీర్పు ఇవ్వటంలో సుప్రీంకోర్టు ప్రగతిశీలకంగా వ్యవహరించలేదని అన్నారు. దేశంలో రాజకీయాల్లో నేర ప్రవృత్తి గురించి అందరికీ తెలుసునని, కాబట్టే ఈ పిటిషన్ దాఖలైందని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం చట్టాల్లో లోటు ఉంటే, ప్రజా ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, చట్టం తయారయ్యే వరకు మార్పులు, చేర్పులు చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి మేలు చేయదని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)