చింపాంజీల నుంచి నేతలు నేర్చుకోవాల్సిన 5 విషయాలు

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం ఉండదనే విషయం మనకు తెలుసు. సమయం, సందర్భానికి తగ్గట్టు నేతలు ఎత్తులు వేస్తుంటారు. అధికారం కోసం ఎలాంటి ఒప్పందాలకైనా సిద్ధం అవుతారు. వ్యక్తులను, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటారు.
కాస్త జాగ్రత్తగా గమనిస్తే అధికారం కోసం చింపాజీల గుంపుల్లో కూడా ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోంది.
చింపాజీల గుంపుల్లో ఉన్న ఆధిపత్య పోరు నుంచి రాజకీయాల వరకు వాటి నుంచి మనం ఏమేం నేర్చుకోవచ్చు అనేది తెలుసుకోవడానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ జేమ్స్ టిలీ ఒక ప్రయత్నం చేశారు.
అందులో ప్రధానంగా ఐదు విషయాలు తెలిశాయి.

ఫొటో సోర్స్, Getty Images
1. స్నేహితుడు దగ్గరుండాలి, కానీ శత్రువుకు దగ్గరవ్వాలి
చింపాంజీల మధ్య రాజకీయం విషయానికి వస్తే, ఈ జాతుల్లో విశ్వాసాలు అనేవి మాటిమాటికీ మారిపోతుంటాయి.
ఒక గుంపులో బాగా ప్రముఖం కావడానికి చింపాజీలు స్నేహితులకు వ్యతిరేకంగా వెళ్లడానికైనా, శత్రువులతో చేతులు కలపడానికైనా సిద్ధంగా ఉంటాయి.
వీటిలో చాలా సంబంధాల్లో స్నేహం కంటే ఎక్కువ ప్రయోజనం ఆశించే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
2. బలహీనుడితో బంధం
చింపాంజీలు సమ ఉజ్జీలతోనే జట్టు కడతాయి. అంటే రెండు బలహీనంగా ఉన్న చింపాజీలు ఒక బలమైన చింపాంజీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతాయి.
బలహీనంగా ఉన్న ఒక చింపాంజీ బలంగా ఉన్న మరో చింపాంజీతో కలవడం అనేది జరగదు.
బలహీనుడితో చేతులు కలిపినపుడు, అతడితో కలిసి సొంతం చేసుకున్న ఏదైనా వస్తువుపై మనకే ఎక్కువ హక్కు ఉండాలనిపిస్తుంది.
అదేవిధంగా రెండో వ్యక్తి బలవంతుడు అయితే, మనలో మనకు తక్కువగా అనిపించవచ్చు.
ఇలాంటి ఆలోచనతోనే చింపాంజీలు తమకు తగిన వాటితోనే కలుస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
3.ఇతర చింపాంజీలు భయపడాలి, కానీ
చింపాంజీల గుంపుల్లో నాయకుడు చాలా భయపెట్టేలా ఉంటుంది.
అవి తమ బలంతో అధికారం చెలాయించాలని అనుకుంటాయి. కానీ అలాంటి చింపాంజీ నాయకుడుగా ఎక్కువ రోజులు ఉండదు.
ఒక మంచి నాయకుడు కావడానికి ఇతర చింపాంజీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. వాటి మధ్య పట్టు పెంచుకోవాలి. దానికోసం నాయకుడు అందరితో మంచిగా మెలగాలి.

ఫొటో సోర్స్, Getty Images
4. సౌకర్యాలు అందించు, పాలించు
చరిత్రను ఒకసారి తిరగేస్తే వనరులను ప్రజలందరికీ పంచి, వారి మద్దతు కూడగట్టిన వారే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నట్టు తెలుస్తుంది.
బీబీసీ రేడియోలో వచ్చిన ఒక కార్యక్రమంలో గుడిసెల నుంచి మాంసం ఎత్తుకెళ్లి మిగతా వాటికి పంచుతూ వచ్చిన ఒక చింపాంజీ 12 ఏళ్లపాటు తన సమూహానికి నాయకుడుగా ఉందని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
5. బయటి ప్రమాదాలతో మద్దతు పెరుగుతుంది
చింపాంజీలపై జరిగిన అధ్యయనంలో మరో విషయం కూడా తెలిసింది. ఒక సమూహానికి బయటి నుంచి ఏదైనా ప్రమాదం వస్తే, ఆ చింపాంజీలు తమ మధ్య గొడవలన్నీ మరిచిపోయి ఒక్కటవుతాయి. ఆ ప్రమాదాన్ని ఎదుర్కుంటాయి.
మానవ ప్రపంచంలో ఇలాంటి ఘటనలు ఎలాంటి ప్రభావం చూపవు అనేది ఆసక్తికరమైన విషయం.
అయితే 9/11 తర్వాత ప్రపంచమంతా ఒక్కటవడం అనేది ఒక మినహాయింపు కావచ్చు.
ఇవికూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








