గ్రౌండ్ రిపోర్ట్: పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల హింస మిగిల్చిన విషాదం
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలప్పుడు చెలరేగిన హింసలో ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. పంచాయతీ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి పూర్తయ్యే వరకు దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. పురిలియా జిల్లా నుంచి బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే అందిస్తున్న కథనం.
నిన్న మొన్నటి దాకా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని వికాస్ కుమార్ అనే వ్యక్తి చెప్పారు. వికాస్ ఆయన అసలు పేరు కాదు. మీడియాతో మాట్లాడేటప్పుడు ఎవరైనా చూస్తారేమోనని వికాస్ భయపడ్డారు.
‘‘ఓటర్లను పోలింగ్ బూత్‌ల నుంచి తరిమి కొట్టేవాళ్ళం. పాతిక ముప్ఫై మంది వస్తే ఓటర్లు సహజంగానే భయపడతారు. మేం సీపీఎం కార్యాలయాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశాం. ప్రతిపక్ష కార్యకర్తలకు తుపాకులు, కత్తులు చూపించి వారిని బెదిరించాం’’ అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
వికాస్ వంటి వారు చాలా మంది గతంలో అధికారంలో ఉన్న వామపక్ష పార్టీకి సానుభూతిపరులు. అధికారం మారడంతో వీరు కూడా మారిపోయారు.
కోల్‌కతా నుంచి బయటికి రాగానే వికాస్ ముఖంలో మరింత భయం కనిపించింది.
సుపోడి గ్రామంలోని చెట్టుకే త్రిలోచన్ మహతో మృతదేహం వేలాడుతూ లభించింది. ఆయన బీజేపీ కోసం పనిచేసేవారు. బీజేపీ కోసం పని చేసినందుకే చనిపోయారని ఆయన ధరించిన తెల్లటి టీషర్టపై రాసి ఉంది.
పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ఈ ఊరి ప్రజలను ఆ హత్య భయబ్రాంతులకు గురిచేసింది.

‘‘త్రిలోచన్ నా చిన్న కొడుకు. కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా పరీక్ష ఉంది. నా కొడుక్కి బదులుగా నన్ను చంపి ఉండాల్సింది’’ అని త్రిలోచన్ తండ్రి హరిరామ్ మహతో ఆవేదనతో అన్నారు.
దగ్గర్లోని దాభా గ్రామంలో బీజేపీకి చెందిన మరొక కార్యకర్త మృతదేహం ట్రాన్స్‌మిషన్ టవర్‌కు వేలాడుతూ కనిపించింది.
ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.
‘‘హిందూ యువకులు, బీజేపీలోని కీలక కార్యకర్తలను హతమార్చాలన్నదే దీదీ (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ) ప్రయత్నం. బెంగాల్‌లో బీజేపీ ఎదగకుండా చెయ్యాలనే ఇదంతా’’ అని ఆరోపించారు స్థానిక బీజేపీ నేత నిర్మల్ కేసరి.
‘‘నా జిల్లాలో 11 నియోజకవర్గాలున్నాయి. అక్కడ ఎప్పుడూ హింస చెలరేగలేదు. ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. కొన్ని చెదురు మదురు ఘటనలు జరిగినా.. అవి బీజేపీ చేసినవే. ఎందుకంటే, సీపీఎంలో ఉన్న దొంగలు, రౌడీలు బీజేపీలో చేరిపోయారు’’ అని తృణమూల్ నేత అనుబ్రత్ మండల్ చెప్పుకొచ్చారు. ఈయన మమతా బెనర్జీకి సన్నిహితుడనే పేరుంది.

అయినవాళ్ళను కోల్పోయిన బాధ అధికార పక్షానికీ ఉంది. బీజేపీ కార్యకర్తల దాడిలో తృణమూల్ పార్టీకి చెందిన దిల్ దార్ షేక్ హతమయ్యాడనే ఆరోపణలున్నాయి. దాంతో, ఆయన తల్లి మానసికంగా దెబ్బతిన్నారు.
‘‘నా కొడుకు ఇల్లు దాటి బయటి వెళ్ళాడు, ఆ తర్వాత అతడి శవాన్ని చూశాను’’ అని దిల్ దార్ షేక్ తల్లి అంగూర్ బీబీ బాధపడుతూ చెప్పుకొచ్చారు.
పశ్చిమ బెంగాల్‌లో చాలామంది ప్రజలు తమ గుర్తింపును రాజకీయ పక్షాల్లో చూసుకుంటారు. ప్రభుత్వ పథకాల ఫలాలు పొందాలంటే ఈ సాన్నిహిత్యం అవసరం.
‘‘ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ప్రజలు రాజకీయ పార్టీలపై ఆధారపడటం ఎక్కువైంది. అందుకే, ఎవరికి వారు ఒక్క సీటు కూడా చేజార్చుకోకూడదనే పట్టుదలతో ఉంటారు. అందుకే హింస చెలరేగుతోంది’’ అని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మైదుల్ ఇస్లాం వివరించారు.
పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింసతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఈ భయాలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- వైరల్: ఏనుగులను తగలబెట్టేశారు
- ’నా భర్త నా కిడ్నీ దొంగిలించాడు’
- కోల్‌కతా: రెడ్‌లైట్ ఏరియాలో ఈ రంగుల హరివిల్లులెందుకు?
- ముస్లిం కూలీ కావడమే ఆయన చేసుకున్న పాపం
- అస్సాం: ‘అడవుల్ని ఆక్రమిస్తున్న టీ తోటలు’.. మనుషుల్ని చంపుతున్న ఏనుగులు
- తెలంగాణ: పెళ్లి కూతుర్ని బలవంతంగా ఎత్తుకెళ్లిన కుటుంబ సభ్యులు.. పోలీసులేమంటున్నారు?
- మమతా బెనర్జీ మంతనాలు దేని కోసం?
- అమిత్ షా: ‘బీజేపీకి ఇది స్వర్ణయుగం కాదు. ఎందుకంటే..’
- కొండచిలువలు మనుషులను ఇలా మింగేస్తాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









