గ్రౌండ్‌రిపోర్ట్: ముస్లిం కూలీ కావడమే అఫ్రాజుల్ చేసుకున్న పాపం

- రచయిత, దిల్ నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
పెద్ద కట్టెల పొయ్యి మీద వండిన వంటలన్నీ అక్కడ చల్లగా పడి ఉన్నాయి. వాటి వెనకాల కంకర రాళ్ల మధ్య గడ్డ పారను వదిలేసి వెళ్లిపోయారు.
వరండాలేని ఆ ఇంటి లోపల ఓ బంకర్ ఉంది. అక్కడ కొన్ని ఖాతా పుస్తకాలు వదిలేసి వెళ్లారు. తినడానికి సిద్ధంగా ఉన్న రెండు రొట్టె ముక్కలు కూడా ఓ పళ్లెంలో కనిపించాయి.
ఓ పాత బల్ల మీద బంద్ చేసిన టీవీ కనిపించింది. అదే గదిలో పెద్ద కడాయిలో దాచి ఉంచిన బంగాళదుంపలు కనిపించాయి. చాలా మందికి ఒకేసారి వంట చేసే ప్రాంతంగా అది కనిపించింది.
ఆ గది బయట పదుల సంఖ్యలో చెప్పుల జతలు కూడా కనిపించాయి. ఆ హడావుడిలో వాళ్లు చెప్పులను అక్కడే వదిలేసి వెళ్లారు.

అఫ్రాజుల్ (50) ఉపాధి వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్‌లోని మల్దా జిల్లాలోని సైయిద్‌పూర్ కలియాచక్ గ్రామం నుంచి రాజస్థాన్‌లోని రాజ్ సమంద్‌కు వలస వచ్చారు. ఇప్పుడతని గది ఖాళీగా ఉంది.
అఫ్రాజుల్ తన మేనల్లుడు ఇనాముల్, అల్లుడు ముషారఫ్ షేక్‌తో పాటు చాలా మంది బెంగాలీ కూలీలతో ఇక్కడ కలిసి ఉంటున్నారు.
అఫ్రాజుల్‌ను చంపుతున్నప్పుడు అతను వేడుకుంటున్న దృశ్యాలను కూడా మనం వీడియలో చూసుంటాం.
ఆ రోజు అఫ్రాజుల్‌ను చంపుతున్నప్పుడు అక్కడే ఉన్న బెంగాలీ కూలీలు ఇప్పుడు స్వరాష్ట్రానికి పారిపోయారు. అలా వెళ్లిలేని వారు పట్టణంలోనే మరోచోట తలదాచుకుంటున్నారు.
అఫ్రాజుల్ చాలా మంచోడని, అతనికి ఇలా జరగడం దురదృష్టకరమని ఆ ఇంటి యజమాని పండిట్ ఖేమ్ రాజ్ పలివాల్ అన్నారు.

'అఫ్రాజుల్ చాలా మంచి వ్యక్తి'
పని ప్రదేశానికి అఫ్రాజుల్‌తో పాటు ఇతర కూలీలను అటో డ్రైవర్ రామ్‌లాల్ తీసుకెళ్తుంటారు. దాదాపు 9, 10 ఏళ్ల నుంచి ఆయన ఇదే పనిచేస్తున్నారు.
అఫ్రాజుల్ చాలా మంచి వ్యక్తి అని రామ్‌లాల్ అన్నారు. చాలా సార్లు తాము కలిసి చాయ్ తాగేవాళ్లమని చెప్పారు.
అఫ్రాజుల్‌ను చంపుతున్న వీడియోను చూసే సాహసం రామ్‌లాల్ చేయలేకపోయారు.
13 ఏళ్ల కిందటే అఫ్రాజుల్ కూలీ పని కోసం బెంగాల్ నుంచి రాజ్ సమంద్‌కు వచ్చారు.
ఈ 13 ఏళ్లలో అతను కూలీ నుంచి మేస్త్రీ వరకు ఎదిగారు. రోడ్లు వేసే పనికి కూలీలను తీసుకొచ్చే పని కూడా తీసుకున్నారు. నిజానికి, ఇక్కడ మేస్త్రీలు చాలా తక్కువ వేతనంతో కూలీలను పనిలోకి తీసుకొస్తుంటారు.

అఫ్రాజుల్ ఓ మోటర్‌సైకిల్ కొన్నారు. బండి నంబర్లో 7, 8, 6 అంకెలు (786) వరుసగా ఉన్నాయి.
ఆయన ఇటీవలే రూ.20 వేల విలువైన స్మార్ట్ ఫోన్ కూడా కొన్నారు.
అఫ్రాజుల్‌ను దహనం చేసినప్పుడు ఆ మంటల్లో ఆయనతోపాటు ఈ సెల్ ఫోన్ కూడా కాలిపోయింది.
ఆయన కొన్ని రోజుల కిందటే బ్యాంకు ఖాతా తెరిచారు. ఏటీఎం కార్డు ఇంకా కవరులోనే ఉంది.
అఫ్రాజుల్‌కు ముగ్గురు కుమార్తెలు కాగా, ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. పెద్దల్లుడు ముషారఫ్ షేక్, అఫ్రాజుల్‌తో ఉంటారు.
అఫ్రాజుల్ చివరి రోజు ఎలా గడిచిందో ముషారఫ్ గుర్తుచేసుకున్నారు.
''మంగళవారం వర్షం పడటంతో పని మధ్యలోనే ఆపేశాం. సగం రోజే పని జరిగింది. చిన్నపాటి వాన పడటంతో బుధవారం కూడా పని మొదలుపెట్టలేదు. ఇద్దరు కూలీలు కలిసి వంట చేస్తే, అందరం తిన్నాం.''
''బుధవారం ఉదయం టీ తాగి వస్తానని చెప్పి అఫ్రాజుల్ బయటకు వెళ్లారు. దాదాపు 10 గంటలప్పుడు ఫోన్ చేసి, కాసేపట్లో వస్తానన్నారు. ఇంచుమించు 11:30 గంటలప్పుడు అఫ్రాజుల్ మళ్లీ ఫోన్ చేశారు. పది నిమిషాల్లో వస్తానని చెప్పారు. ఇక తిరిగి రాలేదు'' అంటూ ముషారఫ్ గద్గద స్వరంతో చెప్పుకొచ్చారు.

మధ్యాహ్నం ముషారఫ్‌కు తెలిసినవారు ఒకరు ఫోన్ చేశారు. అఫ్రాజుల్‌కు ప్రమాదం జరిగిందని చెప్పారు. ఆయన మోటర్‌సైకిల్‌కు ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని ముషారఫ్ అనుకున్నారు.
ముషారఫ్ ఘటనా స్థలికి చేరుకుని, అక్కడి దృశ్యాలను చూసి దిగ్భ్రాంతి చెందారు. ''నాకు దుఃఖం పొంగుకొచ్చింది. కాసేపు ఏమీ అర్థం కాలేదు'' అని చెప్పారు.
అఫ్రాజుల్ మృతి వీడియో చూసినప్పటి నుంచి ముషారఫ్ ఏమీ తినలేకపోయారు. అఫ్రాజుల్ హత్య తర్వాత, ఆయనతో కలిసి పనిచేసిన కూలీలు భయాందోళనతో వణికిపోతున్నారు.
ఇంటి యజమాని భరోసా ఇచ్చినా వారిని భయం వెంటాడుతోంది. వారు గదులకు తాళాలు వేసి, వేరే చోట నివసించే ఇతర కూలీల వద్ద ఉంటున్నారు.
పొట్ట చేతబట్టుకొని వలస వచ్చాం..
ఇనాముల్ మాట్లాడుతూ- ''మేము పొట్టకూటి కోసం వలస వచ్చిన కూలీలం. నెలకు అతి కష్టమ్మీద రూ.8-10 వేలు సంపాదించుకోగలం. భారతీయులు భారత్‌లో ఎక్కడైనా పనిచేయొచ్చు. ఇలాంటి దారుణాలను ప్రభుత్వం అడ్డుకోలేకపోతే, మేం ఎలా పనిచేయగలం'' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
''మిగతా కూలీల కన్నా బాగా పనిచేస్తాం, వేగంగా పనిచేస్తాం, తక్కువ వేతనానికి పనిచేస్తాం. అలా చేస్తేనే మాకు పని దొరుకుతుంది. మా ప్రాణాలకు భద్రత లేకపోతే ఎలా పనిచేయగలం'' అని ఇనాముల్ ప్రశ్నించారు. .

''హంతకులకు అసలు మనసే లేదు. ఆ వీడియో చూసి మాకు నిద్ర పట్టలేదు. ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారో? అని అఫ్రాజుల్‌తో కలిసి పని చేసిన ఫరాకత్ అలీ ప్రశ్నించారు.
అఫ్రాజుల్ ఎందుకు హత్యకు గురయ్యాడు? ఫరాకత్ అలీ, ఇనాముల్, ముషారఫ్ చెబుతున్న ప్రకారం.. ‘లవ్ జీహాద్ అనేది వారికి కొత్త పదం.
‘‘వేయి కిలోమీటర్లకుపైగా వలస వచ్చి పని చేసుకునే మాకు ఆకలి తప్ప ఇతర విషయాల గురించి ఆలోచించడం అసాధ్యం.’’ అని ఫరకత్ అలీ తెలిపారు.
అఫ్రాజుల్‌కి ఎవరైనా అమ్మాయితో సంబంధం ఉందా అని ప్రశ్నించినపుడు ఇలా ఆలోచించడమే నేరమని అన్నారు.

'ఆయనో పేద కూలీ, నిస్సహాయుడు, ముస్లిం'
అఫ్రాజుల్ ఒకవేళ తప్పే చేసుంటే, శంభూలాల్ పోలీసులకు ఫిర్యాదు చేసుండాల్సిందని, అఫ్రాజుల్‌ను చంపే హక్కు అతడికి ఎవరిచ్చారని ఒక యువకుడు ప్రశ్నించాడు.
''ఎవరైనా తప్పు చేస్తే, తగిన చర్యలు తీసుకొనేందుకు పోలీసులున్నారు, చట్టం ఉంది. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏమిటి'' అని ఖేమ్‌రాజ్ పలివాల్ కుమార్తె అన్నారు. ఆమె డిగ్రీ చదువుతున్నారు.
అసలు అఫ్రాజుల్ చేసిన తప్పేంటి? దీనికి ఆయన మేనల్లుడు ఇనాముల్ సమాధానమేంటంటే- ''ఆయనో పేద కూలీ, నిస్సహాయుడు, ముస్లిం.''
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








