డబ్ల్యుహెచ్ఓ: ‘మొబైల్ గేమ్స్-వ్యసనం కాదు, వ్యాధి’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నాలుగున్నరేళ్ల శ్రుతి (పేరు మార్చాం) ఉదయం బ్రష్ చేసుకుంటున్నప్పటి నుంచి ప్లే స్కూల్‌కు వెళ్లేవరకూ ప్రతి పనినీ మొబైల్‌లో కార్టూన్ చూస్తూనే చేస్తుంది.
చేతిలో బ్రష్ లేదా వేరే ఏ వస్తువూ లేనప్పుడు, శ్రుతి మొబైల్‌లో యాంగ్రీ బర్డ్స్ గేమ్ ఆడుతుంటుంది
మొబైల్ స్క్రీన్ పైన గేమ్ షార్ట్ కట్స్ లేవు. కానీ, యూ ట్యూబ్‌లో వాయిస్ సెర్చ్ ద్వారా యాంగ్రీ బర్డ్స్ వెతకడానికి శ్రుతికి క్షణం కూడా పట్టదు.
ఆ పాప తన చేతుల కంటే పెద్దగా ఉన్న మొబైల్లో వేళ్లను ఎంత వేగంగా ఆడిస్తుంటుందంటే, పెద్ద పెద్ద వాళ్లు కూడా అంత వేగంగా గేమ్ ఆడలేరు. శ్రుతి తల్లిదండ్రులు కూడా ఆ స్పీడ్ చూసి మొదట్లో ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
శ్రుతి అమ్మనాన్న ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తుంటారు. ఇద్దరూ తరచూ ఇంట్లో ఆఫీసు పని చేసుకుంటూ ఉంటారు. తమ పనికి అడ్డు తగలకుండా ఉండడానికి శ్రుతి చేతికి మొబైల్ ఇచ్చేశారు.
కానీ తాము చేసిన ఆ పని తర్వాత శ్రుతికి పెద్ద సమస్యగా మారుతుందని వాళ్లు ఎప్పుడూ ఊహించలేదు.
ఇప్పుడు శ్రుతి చేతుల్లోంచి మొబైల్ లాక్కుంటే చాలు, నేలమీద పడి ఏడుస్తుంది. అమ్మానాన్న చెప్పే ఏ మాటా వినకుండా మొండికేస్తుంది. వాళ్ల దగ్గర్నుంచి మళ్లీ మొబైల్ తీసుకుని తన పంతం నెగ్గించుకుంటుంది.
శ్రుతి మొబైల్‌పై ఎంతగా ఆధారపడిపోయిందంటే - స్కూల్లో ఎవరినీ తన ఫ్రెండ్స్ అనుకోదు, ఎప్పుడూ పార్కులో ఆడుకోడానికి కూడా వెళ్లదు. రోజంతా గదిలో కూర్చుని మొబైల్‌లో ఆడుకుంటూ ఉంటుంది.
ప్రస్తుతం శ్రుతికి ప్లే థెరపీ చికిత్స జరుగుతోంది. గత రెండు నెలల నుంచీ పాప పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, EPIC IMAGES
గేమింగ్ వ్యసనం ఒక 'వ్యాధి'
దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌లో వీడియో గేమ్స్‌కు అలవాటు పడుతూ, వాటిపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతుండడం చూసి, ప్రపంచ ఆరోగ్య సంస్థ గేమింగ్ వ్యసనాన్ని ఒక రకమైన మానసిక వ్యాధిగా పేర్కొంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్(ఐసీడీ-11) తమ మాన్యువల్‌ను 27 ఏళ్ల తర్వాత ఈ ఏడాది అప్‌డేట్ చేసింది.
అలా అని ఈ వ్యసనం కేవలం పిల్లల్లో మాత్రమే ఉందని అనుకోలేం.
శ్రుతికి చికిత్స చేస్తున్న డాక్టర్ జయంతి దత్తా "పెద్దవారిలో కూడా ఈ వ్యాధి కనిపిస్తోంది" అని తెలిపారు.
"యాంగ్రీ బర్డ్, టెంపుల్ రన్, క్యాండీ క్రష్, కాంట్రాలాంటి మొబైల్ గేమ్ పిచ్చి ఉన్న వాళ్లు చాలా ఆఫీసుల్లో కూడా కనిపిస్తారు" అని ఆమె అన్నారు.
"జనం కాలక్షేపం కోసం వీటిని ఆడడం మొదలు పెడతారు. కానీ తర్వాత అవి ఎప్పుడు వ్యసనంగా మారుతాయో, తమ జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారిపోతాయో వారు ఊహించలేరు" అని డాక్టర్ జయంతి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గేమింగ్ డిజార్డర్ అంటే ఏంటి?
డబ్ల్యుహెచ్ఓ చెప్పిన గేమింగ్ వ్యసనం రోగుల్లో గేమ్స్ ఆడే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. అది డిజిటల్ గేమ్ కావచ్చు, లేదా వీడియో గేమ్ కావచ్చు.
ఇలాంటి మానసిక వ్యాధి బారిన పడిన వారు వ్యక్తిగత జీవితం కంటే గేమ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దానివల్ల వారి రోజువారీ కార్యక్రమాలపై కూడా ప్రభావం పడుతుంది.
కానీ ఈ వ్యసనం ఉన్నంత మాత్రాన వాళ్లను రోగిగా నిర్ధారించలేం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఒక వ్యక్తి గేమింగ్ ఆడే విధానాన్ని ఒక ఏడాది పాటూ పరిశీలించాల్సి ఉంటుంది. గేమింగ్ వల్ల అతడి వ్యక్తిగత జీవనం, కుటుంబ జీవితం, సామాజిక జీవితం, చదువు, ఉద్యోగంపై ఎక్కువ ప్రభావం పడుతుంటే, అప్పుడు అది వ్యాధిగా మారిందని భావిస్తారు.
దిల్లీలోని ఎయిమ్స్ ఉన్న బిహేవియర్ అడిక్షన్ సెంటర్‌లోని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ యతన్ పాల్ సింగ్ బలహరా దీని గురించి మాట్లాడుతూ.. "గత రెండేళ్లలో దేశంలో గేమింగ్ అడిక్షన్ రోగుల సంఖ్య చాలా పెరిగింది" అని తెలిపారు.
గేమింగ్ వ్యసనానికి బానిస అయినవారిలో ఐదు విషయాలు చూడవలసి ఉంటుందని ఆయన చెప్పారు.
- ఇతర పనులకన్నా మొబైల్ లేదా వీడియో గేమ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత
- మొబైల్ లేదా వీడియో గేమ్ చేతిలో ఉంటే గేమ్స్ ఆడాలనే కోరికను ఆపుకోలేకపోవడం
- గేమ్ ఆడుతున్న ప్రతిసారీ ఆనందాన్ని పొందుతుండడం
- గేమ్ ఆడడం మొదలెట్టాక, దాన్ని ఎప్పుడు ఆపాలో అది వ్యసనంగా మారిన వారు తెలుసుకోలేరు
- గేమ్ ఆడడం వల్ల చదువు, ఉద్యోగం లేదా ఇతర పనులపై చెడు ప్రభావం
ఎవరైనా 12 నెలల కంటే ఎక్కువ కాలం ఇలా ఉన్నప్పుడు డాక్టర్ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
గేమ్ ఆడడం వ్యాధి అనుకోవాలా?
డబ్ల్యుహెచ్ఓ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం మొబైల్ లేదా వీడియో గేమ్ ఆడేవాళ్లలో చాలా తక్కువ మందికి ఇది వ్యసనంగా మారుతోంది. కానీ మనం రోజులో ఎన్ని గంటలు గేమ్స్ ఆడుతున్నాం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఒకవేళ మన మిగతా పనులన్నీ చేసుకుంటూనే మొబైల్లో గేమ్ ఆడడానికి కాస్త సమయం పెడుతున్నామంటే అది వ్యాధి కాదు.
మరి ఎన్ని గంటలు గేమ్ ఆడితే దానిని వ్యాధిగా భావించొచ్చు?
ఈ ప్రశ్నకు "అలాంటి ఫార్ములా ఏదీ లేదు, రోజుకు నాలుగు గంటలు గేమ్ ఆడేవాళ్లు ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చు. రోజుకు 12 గంటలు గేమ్ ఆడేవారు కూడా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు" అని డాక్టర్ బలహారా జవాబిచ్చారు.
"24 గంటల్లో 4 గంటలు గేమ్ ఆడడం ఎక్కువ సమయమేం కాదు. కానీ ఒక పిల్లాడు ఏడు గంటలు స్కూల్లో ఉండేవాడు, తర్వాత ట్యూషన్ వెళ్లేవాడు. తిరిగి వచ్చిన తర్వాత అమ్మనాన్నలతో మాట్లాడడు. దానికి బదులు తిండి, నిద్ర మానేసి గేమ్స్ ఆడుకుంటూ ఉండే మాత్రం సమస్యే" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
గేమింగ్ వ్యసనానికి చికిత్స
ఇలాంటి చికిత్స కోసం మానసికవేత్తలు, మానసిక వైద్య నిపుణుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరూ ఒకే సమయంలో చికిత్స చేయడం వల్ల రోగిలో త్వరగా మార్పు కనిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
కానీ మానసికవేత్త డాక్టర్ జయంతి దీనికి అంగీకరించరు. చాలా కేసుల్లో సైకోథెరపీ ప్రభావం చూపితే, కొన్ని కేసుల్లో కాగ్నెటివ్ థెరపీ ఉపయోగిస్తుంటారని ఆమె చెప్పారు. పిల్లల్లో ప్లే థెరపీతో చికిత్స చేయవచ్చని అంటారు. ఇవన్నీ ఆ వ్యసనం ఏ స్థాయిలో ఉంది అనేదానిపై ఆధారపడుతుంది.
ప్రస్తుతం మూడు రకాల వ్యసనాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ బలహారా తెలిపారు. అవి గేమింగ్, ఇంటర్నెట్, గాంబ్లింగ్.
ఎయిమ్స్‌లోని బిహేవియర్ క్లినిక్‌లో ఈ మూడు రకాల వ్యసనాలకు చికిత్స ఇస్తున్నారు. నెలకు దాదాపు 30 మంది రోగులు ఇక్కడ చికిత్స కోసం వస్తుంటారు. రోగుల్లో ఎక్కువగా మగపిల్లలు, పురుషులే ఉంటారు. అంతమాత్రాన అమ్మాయిలకు ఈ వ్యసనం లేదని కాదు. ప్రస్తుతం అమ్మాయిలు, మహిళల్లో కూడా ఈ గేమింగ్ వ్యసనం పెరుగుతూ వస్తోంది.
"అప్పుడప్పుడూ థెరపీతో ఫలితం కనిపిస్తుంది. కొన్నిసార్లు మందులతో. కొన్నిసార్లు రెండు రకాల చికిత్సలూ చేయాల్సి వస్తుంది" అని డాక్టర్ బలహారా చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఈ గేమింగ్ వ్యసనానికి బానిసలైన పది మందిలో ఒకరికి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది.
సాధారణంగా 6-8 వారాల్లో ఈ గేమింగ్ వ్యసనం వదిలిపోతుంది.
దీన్నుంచి బయటపడే కారణాలను వివరిస్తూ, అసలు గేమ్స్ ఆడడం అలవాటు చేయకపోవడమే మంచిదని బలహారా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పాపకు జన్మనిచ్చిన న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్
- జశోదాబెన్: ‘మోదీతో నాకు పెళ్లైంది, అబద్ధాలు ప్రచారం చేయకండి’
- కడప జిల్లా: వీరికి గబ్బిలాలు ‘దేవతలు’
- భారత్-రష్యా మధ్య దూరం పెరుగుతోందా?
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- ఫేస్‌బుక్‌కు కటీఫ్ చెప్పేస్తున్న అమెరికా కుర్రకారు
- ఏ సెల్‌ఫోన్‌తో ఎంత ప్రమాదం?
- మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- #FIFA2018: అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీకి అసలేమైంది
- ఫుట్‌బాల్: మెస్సీని కలుసుకొనేందుకు రష్యాకు కేరళ యువకుడి సైకిల్ యాత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








