కొండచిలువలు మనుషులను ఇలా మింగేస్తాయి

ఫొటో సోర్స్, Getty Images
ఇండొనేసియాలో ఒక భారీ కొండచిలువ.. ఒక మహిళను చంపి అమాంతం మింగేసిందని స్థానిక అధికారులు తెలిపారు. ఆ పాము పొడవు ఏడు మీటర్లు. అంటే 23 అడుగులు. దాదాపు నలుగురు మనుషుల నిట్టనిలువు పొడవు.
కొండచిలువలు మనుషులను మింగే ఘటనలు చాలా చాలా అరుదు. కానీ.. ఏడాది వ్యవధిలో ఇండొనేసియాలో ఇలాంటి ఘటన నమోదవటం ఇది రెండోసారి.
ఆ మహిళ ఎలా చిక్కుకున్నారు?
వా తిబా (54) అనే మహిళ గత గురువారం సులావెసి ప్రావిన్స్‌లోని మునా దీవిలో గల తన కూరగాయల తోటకు వెళ్లారు. అప్పటి నుంచీ ఆమె కనిపించకుండా పోయారు. ఆమె కోసం స్థానికులు గాలింపు చేపట్టారు.
ఒక రోజు తర్వాత ఆమె చెప్పులు, కత్తి కనిపించాయి. అక్కడికి 30 మీటర్ల దూరంలో ఒక భారీ కొండచిలువ కనిపించింది. దాని పొట్ట ఉబ్బిపోయినట్టు ఉంది. అది కదలలేకపోతోంది.
‘‘ఆ పాము ఆ మహిళను మింగి ఉంటుందని స్థానికులు అనుమానించారు. దీంతో వారు ఆ పామును చంపి తోట బయటకు తీసుకెళ్లారు. కొండచిలువ పొట్టను కోశారు. లోపల ఆ మహిళ నిర్జీవంగా కనిపించింది’’ అని స్థానిక పోలీస్ చీఫ్ హంకా.. ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
ఆ పాము పొట్టలో నుంచి మహిళ శరీరాన్ని బయటకు తీస్తున్న విషాదకరమైన వీడియో దృశ్యం ఇండొనేసియాలో సోషల్ మీడియాకి చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
కొండచిలువలు ఎలా దాడి చేస్తాయి?
ఇండొనేసియాలోని ఈ కొండచిలువను ’రిటిక్యులేటెడ్ పైథాన్’ జాతికి చెందినదిగా భావిస్తున్నారు.
ఈ పాములు 10 మీటర్ల పొడవు (32 అడుగులు) వరకూ పెరగగలవు. చాలా బలమైనవి కూడా. అవి పొంచివుండి దాడిచేస్తాయి. తమ ఆహారాన్ని చుట్టేసి నలిపివేస్తాయి.
కొండ చిలువ బలంగా చుట్టేయటం ద్వారా ఊపిరి ఆడకపోవడం కానీ గుండె కొట్టుకోవటం ఆగిపోవటం కానీ జరుగుతుంది. ఇలా ఈ కొండ చిలువలు నిమిషాల్లోనే చంపేస్తాయి.
కొండచిలువలు తమ ఆహారాన్ని పూర్తిగా మింగేస్తాయి. పెద్ద జంతువులను మింగటానికి వీలుగా సాగేలా వాటి దవడల నిర్మాణం ఉంటుంది.
మనుషులను తినే విషయానికి వచ్చినపుడు.. ‘‘మనిషి భుజాలు అడ్డుపడతాయి. ఎందుకంటే అవి కుప్పకూలవు’’ అని.. రిటిక్యులేటెడ్ పైథాన్ నిపుణురాలు మేరీ రూత్ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో బీబీసీతో చెప్పారు. ఆమె వైల్డ్‌లైఫ్ రిసర్వ్స్ సింగపూర్‌లో కన్సర్వేషన్, రీసెర్చ్ అధికారి కూడా.
కొండచిలువలు వేరే పెద్ద జంతువులను కూడా తింటాయా?
‘‘కొండచిలువలు దాదాపు క్షీరదాలనే తింటాయి’’ అని మేరీ చెప్పారు. అయితే.. అవి అప్పుడప్పుడూ మొసళ్లు సహా సరీనృపాలను కూడా తింటాయి.
సాధారణంగా ఇవి ఎలుకలు, ఇతర చిన్న జంతువులను తింటాయి. ‘‘కానీ ఒకసారి ఒక పరిమాణానికి పెరిగిన తర్వాత.. ఎలుకలు వాటికి ఏ మూలకీ సరిపోవు’’ అని ఆమె వివరించారు.
‘‘అంటే.. వాటికి ఆహారం ఎంత పెద్దగా ఉంటే అంత ఇష్టమని’’ అని పేర్కొన్నారు. పందులు, చివరికి ఆవుల వంటి పెద్ద జంతువులు కూడా వాటిలో ఉండొచ్చు.
ఈ కొండచిలువలు కొన్నిసార్లు.. తమ ఆహారం పరిమాణం ఎంత అనేది సరిగా అంచనా వేయలేకపోవచ్చు. 2005లో అమెరికాలోని ఫ్లోరిడాలో బర్మీస్ పైథాన్ (మరో జాతి కొండచిలువ) ఒకటి ఒక మొసలిని మింగటానికి ప్రయత్నించింది. కానీ.. దాని పరిమాణం పెద్దగా ఉండటంతో కొండచిలువ చీలిపోయింది. మొసలితో పాటు కొండచిలువ కూడా చనిపోయింది. వాటి శరీరాలను అటవీ అధికారులు గుర్తించారు.
కానీ.. అవకాశం చూసుకుని వేటాడే ఈ కొండచిలువలు కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా తమకు కావలసిన వాటిని ఎంచుకుని మరీ దాడిచేస్తాయి. తగినంత పెద్దవైన ఆహారం కనిపించేవరకూ చాలా కాలం పాటు అతి తక్కువ ఆహారంతో నెట్టుకురాగలవు.

ఫొటో సోర్స్, WEST SULAWESI POLICE
మనిషిని కొండ చిలువ తినటం ఇదే మొదటిసారా?
కాదు. 2002లో దక్షిణాఫ్రికాలో ఒక రాక్ పైథాన్ (కొండచిలువ) ఓ పదేళ్ల బాలుడిని మింగేసినట్లు నమోదయింది.
ఇదే ఇండొనేసియాలోని సులావెసి ప్రావిన్స్‌లో గత ఏడాది మార్చిలో ఒక రైతుని ఏడు మీటర్ల పొడవున్న ఓ కొండచిలువ మింగేసింది.
వెస్ట్ సులావెసికి చెందిన ఆ పాతికేళ్ల యువకుడు తన గ్రామం సమీపంలోని పామాయిల్ తోటలో ఉండగా కొండచిలువ దాడి చేసింది. అప్పుడు కూడా కొండచిలువ శరీరం నుంచి అతడి మృతదేహాన్ని వెలికితీసిన వీడియో దృశ్యాలు బయటకు వచ్చాయి.
పోయిన సంవత్సరంలోనే.. ఇండొనేసియాలోని సుమత్రా ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి.. పామాయిల్ తోటలో తనపై దాడిచేసిన 7.8 మీటర్ల కొండచిలువతో పోరాడి తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డాడు.
అంతకుముందు జరిగినట్లు చెప్తున్న ఘటనలు.. నిర్ధారించటం కష్టం. మారుమూల ప్రాంతాల్లో జరిగాయని చెప్తున్న ఆ సంఘటనలకు సరైన ఆధారాలు లేవు.
ఫిలిప్పైన్స్‌లో వేట, ఆహార సేకరణ కొనసాగిస్తున్న అగ్తా బృందంతో కలిసి కొన్ని దశాబ్దాలు గడపిన మానవశాస్త్రజ్ఞుడు థామస్ హెడ్‌లాండ్.. ఆ తెగ ప్రజల్లో నాలుగో వంతు మంది మీద రిటిక్యులేటెడ్ పైథాన్లు ఏదో ఒక సమయంలో దాడి చేశాయని చెప్పారు.
ఆ దాడుల్లో దాదాపు అందరూ ఆ కొండచిలువలను వేట కత్తులతో తరిమివేయగలిగేవారని.. అయినప్పటికీ.. శరీరాకృతిలో చిన్నగా ఉండే అగ్తా తెగలో పెద్దవాళ్లను కొండచిలువలు తరచుగా తినేసేవని ఆయన పరిశోధన చెప్తోంది.
కొండచిలువలు.. ప్రకంపనాలు, ధ్వని, దీపాల వేడిని గుర్తించగలవని.. కాబట్టి అవి మానవ ఆవాసాలకు దూరంగా ఉంటాయని ఇండొనేసియాలోని బ్రావిజయ యూనివర్సిటీకి చెందిన సర్ప నిపుణులు నియా కుర్నియావాన్ బీబీసీతో పేర్కొన్నారు.
కొండచిలువ బారిన పడిన తాజా బాధితురాలు.. రాళ్లు, గుహలతో నిండివున్న ఓ కొండ మొన దగ్గర గల తన తోటలో ఆ పాముకు బలయ్యారు. స్థానిక పోలీస్ అధికారి చెప్తున్నదాని ప్రకారం.. ఆ ప్రాంతం పాములకు ఆలవాలం.

ఫొటో సోర్స్, Getty Images
రిటిక్యులేటెడ్ పైథాన్ (పైథాన్ రిటిక్యులస్)
- ప్రపంచంలో అతి పొడవైన పాము. 10 మీటర్లకు (32 అడుగులు) పైగా పొడవు పెరగగలదు.
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. మనుషులు బంధించిన ఈ జాతి పాముల్లో పొడవైన దానిని అమెరికాలోని కన్సస్ సిటీలో 2011లో పట్టుకున్నారు. దాని పొడవు 7.6 మీటర్లు (25 అడుగులు).
- ఇది ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. మామూలుగా మనుషులంటే భయం.. చాలా అరుదుగా కనిపిస్తుంది.
- ఇండొనేసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పామును పట్టుకున్నపుడు.. దీనిని పవిత్రమైనదిగా పరిగణించి వ్యవహరిస్తారు.
- సహారా ఆవలి ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా, నేపాల్, ఇండియా, శ్రీలంక, బర్మా, చైనాలతో పాటు ఆగ్నేయాసియా అంతటా చాలా రకాల కొండచిలువ జాతులు కనిపిస్తాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








