అభిప్రాయం: బెంగాల్ గెజిట్ - భారతదేశపు మొట్టమొదటి వార్తాపత్రిక.. ఫేస్‌బుక్, ట్విటర్‌లు కూడా ఆదర్శంగా తీసుకోదగ్గ పత్రిక

జేమ్స్ అటస్టస్ హికీ ప్రారంభించిన బెంగాల్ గెజిట్

ఫొటో సోర్స్, University of Heidelberg

ఫొటో క్యాప్షన్, జేమ్స్ ఆగస్టస్ హికీ ప్రారంభించిన బెంగాల్ గెజిట్

1780లో ప్రారంభమైన భారతదేశపు మొట్టమొదటి వార్తాపత్రిక నాడు దేశంలోని బ్రిటిష్ పాలనను కళ్లకు కడుతుంది. ఆనాటి ప్రసార సాధనాలు బ్రిటిష్ పాలకుల నిరంకుశ విధానాలను ఎండగట్టడంలో ప్రముఖ పాత్ర వహించాయి. నేడు సోషల్ మీడియాను ప్రజలు విస్తృతంగా ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో.. ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సంస్థలు నాటి ప్రసార సాధనాలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ జర్నలిస్టు, చరిత్రకారుడు ఆండ్రూ ఓటిస్ చెబుతున్నారు.

1780లో ప్రారంభించిన బెంగాల్ గెజిట్ వ్యవస్థాపకుడు జేమ్స్ అగస్టస్ హికీ. ఆనాడు ఆ పత్రిక చాలా ధైర్యంగా దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులను ఎదిరించింది. బ్రిటిష్ అధికారుల అవినీతి గురించి, వాళ్లు ప్రజలను ఎలా పీడించిందీ వెల్లడించింది. నాటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ భారత సుప్రీం కోర్టు జడ్జికి లంచం ఇచ్చారని ఆరోపించింది.

హేస్టింగ్స్, ఆయన అధికారులు ప్రజలపై ఎలాంటి హేతుబద్ధత లేకుండా పన్నులు ఎలా విధించారో, భావప్రకటనా స్వేచ్ఛను ఎలా హరించారో వివరించింది.

బ్రిటిష్ ఈస్టిండియా తరపున పోరాడి, అసువులు బాసిన సైనికుల గురించి కూడా ఆ పత్రికలో రాసేవారు.

బ్రిటిష్ వలస పాలకులు భారతదేశంలోని అత్యధిక ప్రాంతాన్ని తన సైనిక బలంతో పాలించేవారు. కానీ 1857లో భారతీయ సైనికుల తిరుగుబాటుతో తమ సైన్యాన్ని అనేక ముక్కలుగా విభజించారు.

ఈ తిరుగుబాటు గురించి కథనంలో బెంగాల్ గెజిట్.. ఆ సైనికులు ఒక పిచ్చివాని భ్రమలను అమలు చేయడానికి అంకితమైన వాళ్లు అంటూ హేస్టింగ్స్‌ను ఒక పిచ్చివాడిగా పేర్కొంది.

వారెన్ హేస్టింగ్స్

ఫొటో సోర్స్, Yale Center for British Art

ఫొటో క్యాప్షన్, వారెన్ హేస్టింగ్స్

బ్రిటిష్ ప్రభుత్వం ఇంతటి తీవ్రమైన విమర్శలను తట్టుకోలేకపోయింది. ఆ పత్రికను అపఖ్యాతి పాలు చేసేందుకు పలు రకాలుగా ప్రయత్నించింది.

తమకు అనుకూలమైన కథనాలు రాసేందుకు వీలుగా ఈస్టిండియా కంపెనీ బెంగాల్ గెజిట్‌కు పోటీగా మరో వార్తాపత్రికకు నిధులు ఇవ్వడం ప్రారంభించింది.

అయినా బెంగాల్ గెజిట్ వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోనపుడు, ప్రజలు ప్రభుత్వాదేశాలను పాటించాల్సిన అవసరం లేదని ఆ పత్రికలో ఒక కథనం ప్రచురించారు.

ఇదంతా తట్టుకోలేని హేస్టింగ్స్ పలుమార్లు హికీపై పరువు నష్టం దావా కూడా వేశారు. హేస్టింగ్స్ న్యాయాధిపతులకు లంచం కూడా ఇవ్వడంతో విచారణలో హికీని దోషిగా తేల్చారు. అయినా హికీ జైలు నుంచే తొమ్మిది నెలల పాటు పత్రికను ప్రచురించారు. దీంతో ప్రింటింగ్ ప్రెస్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో భారతదేశపు మొట్టమొదటి వార్తాపత్రిక శాశ్వతంగా మూతపడింది.

తర్వాత హేస్టింగ్స్ అధికార దుర్వినియోగం వివరాలు బ్రిటన్ వరకు వెళ్లాయి. బెంగాల్ గెజిట్ నివేదికల సహాయంతో బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు హేస్టింగ్స్‌పై విచారణ చేపట్టారు.

తత్ఫలితంగా హేస్టింగ్స్, నాటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరినీ పదవుల నుంచి తొలగించారు.

1788లో వారెన్ హేస్టింగ్స్ అభిశంసన విచారణ

ఫొటో సోర్స్, Story of the Nations

ఫొటో క్యాప్షన్, 1788లో వారెన్ హేస్టింగ్స్ అభిశంసన విచారణ

నాటి మొట్టమొదటి భారతీయ వార్తాపత్రిక విషయంలో మాదిరే, నేటి నియంతృత్వ నేతలు కూడా వార్తాపత్రికల గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు.

రాజకీయవేత్తలు నియంతలు కావాలనుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు వాళ్లు ఇంత ప్రమాదకరంగా ఎందుకు తయారయ్యారు?

ఇప్పుడు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ల వద్ద కొత్త దారులున్నాయి. తాము చెప్పే విషయాలను వారు ప్రజల చేత నమ్మింపజేయగలుగుతున్నారు.

రాజకీయ నాయకులు ఇప్పుడు సరాసరి ప్రజలతో తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉన్నందువల్ల ప్రపంచం ఇప్పుడు అనేక వర్గాలుగా విడిపోయింది.

ప్రజలు తమకు నచ్చిన వాటిని, తాము విశ్వసించే వాటిని విరివిగా చదవడానికి, పంచుకోవడానికి ఇప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్ తదితర సోషల్ మీడియా వేదికలున్నాయి. అయితే వాటి ప్రభావం చాలా ప్రమాదకరంగా తయారైంది.

కొన్నాళ్ల క్రితం పిల్లలను ఎత్తుకుపోతున్నారన్న వాట్సాప్ వదంతులతో పలుచోట్ల మూకహత్యలు జరిగాయి.

ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కేంద్రంగా ఉండేది

ఫొటో సోర్స్, Norman R Bobbins and S P Lohia Rare Books

ఫొటో క్యాప్షన్, ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కేంద్రంగా ఉండేది

గత ఆగస్టులో దేశంలో కొంతమంది మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులను అరెస్ట్ చేసినపుడు, సోషల్ మీడియాలో చాలామంది వారిని జాతి వ్యతిరేకులు, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకులుగా పేర్కొన్నారు.

ఇలాంటి వాతావరణంలో గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సంస్థలు సమాజంపై వాటి ప్రభావానికి బాధ్యత తీసుకోవాలి. వార్తాపత్రికలు దశాబ్దాలుగా అనుసరిస్తున్న మార్గదర్శకాలను అవి కూడా పాటించాలి.

సోషల్ మీడియా మానవ సంబంధాలను బలోపేతం చేసి, చర్చలకు దారి తీయాలే తప్ప ప్రజలను విడదీసి, వారి మధ్య ద్వేషాన్ని పెంచకూడదు.

నేటి రాజకీయ నేతలు భారత సమాజాన్ని విడదీయడానికి బీజాలు నాటుతున్నారు.

నాటి బ్రిటిష్ పాలకులు ఆయుధాల ద్వారానే కాకుండా తమ గురించి ఇతరులు రాసే వార్తలను కూడా నియంత్రించడం ద్వారా తమ పాలనకు చట్టబద్ధత సాధించారు. నేడు పరిస్థితులు మారినా.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాను అదే విధంగా ఉపయోగించుకుంటూ, పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తూ, ప్రజలను ఒకరిపై ఒకర్ని ఉసిగొల్పుతున్నారు.

గతంలో హేస్టింగ్స్, హికీల మధ్య జరిగిన పోరాటం నేటికన్నా భిన్నమైనదేమీ కాదు. కాకపోతే పోరాటం చేసే ఆయుధాలు మాత్రమే మారాయి.

(ఆండ్రూ ఓటిస్ 'హికీస్ బెంగాల్ గెజిట్: ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ న్యూస్ పేపర్' రచయిత)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)