రుతుస్రావంపై చిత్రం వైరల్: "పూజ చేసే హక్కును మహిళల నుంచి ఎందుకు లాగేసుకుంటున్నారు?"

శానిటరీ ప్యాడ్‌పై కమలం బొమ్మతో అనికేత్ మిత్రా ఇల్లస్ట్రేషన్

ఫొటో సోర్స్, ANIKET MITRA

ఫొటో క్యాప్షన్, శానిటరీ ప్యాడ్‌పై కమలం బొమ్మతో అనికేత్ మిత్రా ఇల్లస్ట్రేషన్
    • రచయిత, ప్రీత్ గరాలా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''రుతుస్రావం సమయంలో మహిళ ఇచ్చే నీళ్లు తాగినా, ఆమె వడ్డించే ఆహారం తిన్నా చచ్చిపోతారా? చచ్చిపోరు కదా! మరి ఎందుకు ఆ సమయంలో ఆమెను అన్నింటికీ దూరంగా ఉంచాలనుకుంటారు? పూజ చేసే హక్కును ఆమె నుంచి ఎందుకు లాగేసుకుంటారు?'' అని కాన్సెప్ట్ కళాకారుడు అనికేత్ మిత్రా ప్రశ్నిస్తున్నారు.

రుతుస్రావానికి సంబంధించిన వివిధ 'ఆచారాల' వల్ల మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను ఆయన తన కుటుంబంలో చూశారు. ఈ అంశంపై ఆయన రూపొందించిన ఒక ఇల్లస్ట్రేషన్‌ (చిత్రం) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ చిత్రంలో శానిటరీ ప్యాడ్‌పై రక్తపు మరకలాగా కమలం పువ్వు బొమ్మ వేశారు. బొమ్మ కింద 'మహిళా శక్తి' అనే అర్థం వచ్చేలా బెంగాలీ భాషలో ఒక మాట రాశారు.

''నా భార్య, నా సోదరీమణుల మాదిరి రుతుస్రావం సమయంలో కుటుంబంలో పండుగలు, వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొనలేకపోతున్న చాలా మంది మహిళల పరిస్థితే నాతో ఈ చిత్రం వేయించింది'' అని అనికేత్ చెప్పారు.

''పీరియడ్స్ వస్తే మహిళలను పూజగది దగ్గరకు, వంట గదిలోకి కూడా పోనివ్వడం లేదు. వారు ఇంట్లో ఏదో మూలకు పరిమితం కావాల్సి వస్తోంది. మహిళలకు కూడా కుటుంబ వేడుకల్లో పాల్గొనాలని ఉంటుంది. పూజ చేయాలని ఉంటుంది. కానీ రుతుస్రావం కారణంగా వారిని అనుమతించడం లేదు. వారిపై ఎందుకీ నిషేధం?'' అని ఆయన ప్రశ్నించారు.

గుడిలో పూజలు

ఫొటో సోర్స్, PUNDALIK PAI

అవగాహన పెరగాలి

''కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలో మహిళలందరికీ ప్రవేశం అంశంలో వారికి అనుకూలంగానే దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కానీ కుటుంబాల్లో మాత్రం రుతుస్రావం విషయంలో మహిళల పట్ల వ్యవహరించే తీరు మారడం లేదు. అపోహల కారణంగా జనం సమాజాన్ని తిరోగమనం బాట పట్టిస్తున్నారు'' అని అనికేత్ వ్యాఖ్యానించారు.

''అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో దేవత రుతుస్రావాన్ని పండుగగా జరుపుకొంటారు. పండగ సమయంలో మూడు నాలుగు రోజులపాటు ఆలయం తలుపులు మూసి ఉంటాయి'' అని ఆయన ప్రస్తావించారు.

''మనం దేవతలను శక్తి స్వరూపులుగా పూజిస్తాం. కానీ మన చుట్టూ ఉన్న మహిళల ఇబ్బందులను పట్టించుకోం. వీళ్లు మానవ రూపంలో ఉన్న దేవతలు. అయినా మనం వీళ్ల సమస్యలను పట్టించుకోం'' అని వ్యాఖ్యానించారు.

రుతుస్రావంపై అందరిలో అవగాహన పెరగాల్సి ఉందని ఆయన చెప్పారు.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

భయంతో చిత్రాన్ని తొలగించిన అనికేత్

సోషల్ మీడియాలో వేధింపులు, బెదిరింపుల నేపథ్యంలో, తన ఇల్లస్ట్రేషన్‌ను అనికేత్ తర్వాత తొలగించాల్సి వచ్చింది.

''నాకు భయంగా ఉంది. నేనేమీ హీరోను కాను. కానీ నా ప్రయత్నం ఫలితంగా ఒక్క మహిళైనా రుతుస్రావం సమయంలో ఆమెకు నచ్చిన పండుగ జరుపుకోగలిగినా, వేడుకలో పాల్గొనగలిగినా నేను సంతోషిస్తా. నా ప్రయత్నానికి ఫలితం దక్కిందనుకుంటా'' అని ఆయన వివరించారు.

మహిళలే కుటుంబానికి బలమని, వారికి గౌరవం ఇవ్వాలని, ప్రేమను, తోడ్పాటును అందించాలని తాను కోరుతున్నట్లు అనికేత్ తెలిపారు.

ప్రకాశ్ కొఠారి

ఫొటో సోర్స్, Prakash kothari

ఫొటో క్యాప్షన్, డాక్టర్ ప్రకాశ్ కొఠారి

కాలం మారింది: ప్రకాశ్ కొఠారి

ఈ అంశంపై ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ ప్రకాశ్ కొఠారి బీబీసీతో మాట్లాడుతూ- అనికేత్ చిత్రంలో మతపరమైన మనోభావాలను గాయపరిచేదేమీ లేదని అభిప్రాయపడ్డారు.

''పూర్వకాలంలో రుతుస్రావం గురించి చాలా అపోహలు ఉండేవి. దానికి సంబంధించిన ఆచారాలు అప్పటి సంస్కృతిలో భాగంగా ఉండేవి. ఆ కాలంలో మహిళలు బాగా కష్టమైన పనులు చేయాల్సి వచ్చేది. రుతుస్రావం సమయంలో వారికి నాలుగు రోజులు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో ఈ ఆచారాలను తీసుకొచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కాలం మారింది. పురుషులు, స్త్రీలు ఇద్దరూ దాదాపు సమానంగా పనిచేస్తున్నారు'' అని ప్రకాశ్ కొఠారి చెప్పారు.

దేశంలో ఇప్పటికీ సంపూర్ణ అక్షరాస్యత లేదని, అందువల్ల చాలా అంశాలపై అపోహలు కొనసాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ''బ్రహ్మచర్యం అంటే వీర్యం కోల్పోకపోవడం, పెళ్లి చేసుకోకపోవడమేనని చాలా మంది అనుకుంటారు. కానీ అలా అనుకోవడం తప్పు. 'బ్రహ్మచర్యం' అంటే సర్వోన్నతుడైన బ్రహ్మకు దగ్గరగా ఉండటమని అర్థం'' అని చెప్పారు.

రుతుస్రావం, ఇతర అంశాలపై నెమ్మదిగా అవగాహన పెరుగుతోందని, మార్పు వస్తోందని ప్రకాశ్ కొఠారి తెలిపారు. ''ప్రతిదీ ఒక్కరోజులో మారిపోవాలని ఆశించలేం. అది సాధ్యం కాదు కూడా'' అన్నారు.

ప్రొఫెసర్ విభూతి పటేల్

ఫొటో సోర్స్, Dr. Vibhuti patel

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ విభూతి పటేల్

ఇదే అంశంపై టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ముంబయి క్యాంపస్‌లో 'అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ వుమెన్స్ స్టడీస్' ప్రొఫెసర్ విభూతి పటేల్‌తో బీబీసీ మాట్లాడింది.

''నేను మొదటిసారి అనికేత్ ఇల్లస్ట్రేషన్ చూసినప్పుడు కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. మన సంస్కృతిలో కమలానికి ప్రత్యేక స్థానం ఉంది. శానిటరీ ప్యాడ్‌పై దీనిని చిత్రించడం ఎవరూ ఊహించనిది. కానీ ఈ చిత్రంతో రుతుస్రావంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది సబబే'' అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)