ఒకనాటి ఐ.ఎస్. లైంగిక బానిస... నేటి నోబెల్ శాంతి బహుమతి విజేత

ఫొటో సోర్స్, Getty Images
దాదాపు నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్ లైంగిక హింస నుంచి తప్పించుకొని, యుద్ధంలో లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాక్ మహిళ ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈమెతో పాటు ఇలాగే పోరాటం చేస్తున్న కాంగో వైద్యుడు డెనిస్ ముక్వేగే కూడా పురస్కారానికి ఎంపికయ్యారు.
యుద్ధంలో లైంగిక హింసను ఆయుధంగా వాడటాన్ని అడ్డుకొనేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ సారథి బెరిట్ రీసస్-ఆండర్సన్ శుక్రవారం నార్వే రాజధాని ఓస్లోలో ప్రకటించారు.
యుద్ధంలో అత్యాచారం లాంటి యుద్ధనేరాలపై అందరూ దృష్టి సారించేలా చేసేందుకు, ఈ నేరాలను ఎదుర్కొనేందుకు నదియా మురాద్, డెనిస్ ముక్వేగే విశేష సేవలు అందించారని ఆమె ప్రశంసించారు.
ఇరాక్‌లో యజీదీ వర్గానికి చెందిన నదియా మురాద్‌ను ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు నిర్బంధించి చిత్రహింసలు పెట్టి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను లైంగిక బానిసగా చేసుకొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామిక్ స్టేట్ చెర నుంచి 2014 నవంబరులో నదియా తప్పించుకున్నారు. తర్వాత యాజీదీ ప్రజల విముక్తి కోసం చేపట్టిన పోరాటానికి నదియానే నాయకురాలయ్యారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆమె ఉద్యమిస్తున్నారు.
ఇరాక్‌లోని మోసుల్‌లో ఇస్లామిక్ స్టేట్ నిర్బంధం నుంచి నదియా తప్పించుకొన్న తర్వాత మరుసటి రోజు ఆమెను బీబీసీ పర్షియన్ ప్రతినిధి నఫిసేహ్ కోహ్నావర్డ్ కలిశారు. అప్పుడు నదియా చాలా ధైర్యంగా వ్యవహరించారు. ''మీ వివరాలను గోప్యంగా ఉంచుతూ ఇంటర్వ్యూ చేయడానికి మేం సిద్ధమే'' అని బీబీసీ ప్రతినిధి చెప్పగా, ''వద్దు. వివరాలు తెలియనివ్వండి. మాకేం జరిగిందో ప్రపంచానికి తెలియనివ్వండి'' అని ఆమె అన్నారు.
గైనకాలజిస్టు అయిన డెనిస్ ముక్వేగే కాంగోలో తన సహచరులతో కలిసి దాదాపు 30 వేల మంది అత్యాచార బాధితులకు వైద్యసేవలు అందించారు. లైంగిక దాడుల వల్ల అయ్యే తీవ్రమైన గాయాలకు చికిత్స అందించడంలో ఆయనకు చాలా నైపుణ్యం ఉంది.
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారానికి ఈసారి దాదాపు 331 మంది వ్యక్తులు/సంస్థలు నామినేట్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కా రానికి మానవ శరీరంలోని సహజసిద్ధ రోగనిరోధక శక్తి సహాయంతో క్యాన్సర్‌ను జయించే విధానాన్ని కనుగొన్న అమెరికా శాస్త్రవేత్త జేమ్స్.పి.అలిసన్, జపాన్ శాస్త్రవేత్త టసూకు హోంజో ఎంపికయ్యారు.
రసాయనశాస్త్రంలో ఈ బహుమతి ఎంజైములపై కొత్త ఆవిష్కరణలు చేసిన అమెరికా శాస్త్రవేత్తలు ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్, జార్జ్ పి స్మిత్, బ్రిటన్ శాస్త్రవేత్త గ్రెగరీ వింటర్‌లకు లభించింది.
భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి శాస్త్రవేత్తలు డోనా స్ట్రిక్‌ల్యాండ్(కెనడా), ఆర్థర్ ఆష్కిన్(అమెరికా), గెరార్డ్ మోరో(ఫ్రాన్స్) ఎంపికయ్యారు.
55 సంవత్సరాల తర్వాత భౌతికశాస్త్రంలో నోబెల్‌కు ఎంపికైన తొలి మహిళ డోనానే. లేజర్ ఫిజిక్స్‌లో చేసిన పరిశోధనలకు ఆమె ఈ పురస్కారాన్ని గెల్చుకున్నారు. భౌతికశాస్త్రంలో నోబెల్‌ను గెల్చుకున్న మహిళల్లో డోనా మూడోవారు.
ఇవి కూడా చదవండి:
- యాపిల్, అమెజాన్, అమెరికా గూఢచార సంస్థల డేటాను తస్కరించిన చైనా హ్యాకర్లు: బ్లూమ్‌బర్గ్
- ‘ఒత్తిడికి గురైతే ఒళ్లు పెరుగుతుంది’ జాగ్రత్త!!
- భారత్‌లో షాడో బ్యాంకింగ్ సంక్షోభం.. రూ.88504 కోట్ల అప్పుల్లో ఐఎల్ఎఫ్ఎస్
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
- మైక్రోసాఫ్ట్: ‘రష్యా పొలిటికల్ హ్యాక్’ను విజయవంతంగా అడ్డుకున్నాం
- తన ఆధార్ డేటా హ్యాక్ చేయాలని ట్రాయ్ చీఫ్ సవాల్.. ‘చేసి చూపించిన’ గుజరాత్ యువకుడు
- ఫేస్‌బుక్: ‘భద్రతాలోపం.. హ్యాకింగ్ బారిన 5 కోట్ల మంది యూజర్ల ఖాతాలు’
- నోబెల్: రసాయన శాస్త్రంలో ఎంజైముల సృష్టికి పురస్కారం
- 55 ఏళ్ల తర్వాత భౌతిక శాస్త్రంలో మహిళకు నోబెల్ ప్రైజ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








