శంఖు పూలు: పెరట్లో పూచే ఈ పూలు ఇప్పుడు సాగు స్థాయికి చేరడానికి కారణమేంటి, ఈ పూలతో ఏం చేస్తారు?

శంఖు పూలు

ఫొటో సోర్స్, Impex

    • రచయిత, ప్రీతి గుప్తా
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్

'కొన్నేళ్ల క్రితం వరకు, మా ఊళ్లో ఈ శంఖుపూల (బటర్‌ఫ్లై పీ ఫ్లవర్) మొక్కను మామూలు తీగ మొక్కలానే చూసేవాళ్లం' అని చెప్పారు అస్సాంలోని అంతాయ్‌గ్వాలో నివసిస్తున్న నీలం బ్రహ్మ.

శంఖుపూలను భారత్‌లో కొన్నిచోట్ల అపరాజిత పూలుగా పిలుస్తారు. ఈ మొక్క తీగలాగా పాకుతూ ఆకర్షణీయంగా ఉండే నీలం రంగు పూలు పూస్తుంది.

స్థానిక మహిళలు ఈ పూలను అమ్మడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నట్లుగా రెండేళ్ల క్రితం నీలం తెలుసుకున్నారు. వారితో కలిసి పని చేయాలని నీలం నిర్ణయించుకున్నారు.

ఈ మొక్క పూలను టీ తయారీలో, నీలం రంగు డై కోసం ఉపయోగిస్తారు.

'ఈ పూలను ఆరబెట్టి అమ్మాను. మొదటిసారి అమ్మినప్పుడు రూ. 4,500 వచ్చాయి. అది చూసి ఆశ్చర్యపోయాను. ఈ పూల వల్ల ఇక నా కాళ్ల మీద నేను నిలబడగలననే నమ్మకం వచ్చింది' అని నీలం గుర్తు చేసుకున్నారు.

తర్వాత, ఆమె ఒక చిన్న వ్యాపారం ప్రారంభించారు.

'కొద్దిగా లోన్ తీసుకొని సోలార్ డ్రయ్యర్లపై పెట్టుబడి పెట్టాను. ఈ మెషీన్ల వల్ల పూలలోని తేమ త్వరగా ఎండిపోతుంది. పూల రంగు కూడా పాడవ్వకుండా సురక్షితంగా ఉంటుంది. కొనుగోలుదారులు ఆశించినట్లుగా నాణ్యమైన పూలకూ అమ్మగలుగుతున్నా' అని నీలం చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బటర్ ఫ్లై పీ, శంఖు పూలు

ఫొటో సోర్స్, Pushpal Biswas

ఈ పూల సాగు వినియోగంలో థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ పూలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ భారత్‌లోని వ్యాపారులను ఆకర్షిస్తోంది.

సహజ రంగులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని టీహెచ్‌ఎస్ ఇంపెక్స్ వ్యవస్థాపకురాలు వర్షికా రెడ్డి వివరించారు. టీహెచ్‌ఎస్ ఇంపెక్స్ సంస్థ సహజ రంగులను, అడిటీవ్స్‌ను ఎగుమతి చేస్తుంది.

వినియోగదారులు సహజ పదార్థాలను కోరుకోవడం, సింథటిక్ ఫుడ్ డై (కృత్రిమ ఆహార రంగుల) పట్ల అమెరికా, యూరప్ దేశాల్లో నిబంధనలు కఠినతరం కావడమే సహజ రంగులకు డిమాండ్ పెరగడానికి కారణాలు.

యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సంస్థ 2021లో శంఖు పూలను ఆహారంలో జోడించడాని అనుమతించింది.

అయితే, 2022లో యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్‌ఎస్‌ఏ) వీటి వాడకంపై కొన్ని ఆందోళనలను లేవనెత్తింది.

ఈయూ, యూకే ఈ శంఖుపూల ఆహారాలను 'నావెల్ ఫుడ్' కేటగిరీలో చేర్చాయి. అంటే వీటిని మామూలు ఆహారంగా తీసుకోవడానికి ఇంకా కొన్ని అనుమతులు అవసరం.

అయినప్పటికీ భారత వ్యాపారులు దీనిపై నమ్మకంతో ఉన్నారు. శంఖుపూల మార్కెట్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు.

'ఈ పంటను ఇప్పటికీ వాణిజ్య పంటగా కాకుండా పెరటి మొక్కగా, ఔషధ మొక్కగా చూస్తున్నారు. దీనికి సంబంధించి నిర్మాణాత్మక మార్కెట్ వ్యవస్థ లేదు. ధరల విధానం లేదు. దీంతో రాబడిపై రైతులు అయోమయంలో ఉన్నారు' అని వర్షికా రెడ్డి అన్నారు.

ఆమె ప్రస్తుతం రైతుల సాగు ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తున్నారు.

'మేం ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక రైతుల బృందంతో కలిసి పనిచేస్తున్నాం. అందులో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు ఉన్నారు. రైతులతో అధికారిక ఒప్పందాలు చేసుకున్నాం. వారికి నీటిపారుదల, ఉత్తమ పంట సాగు విధానాలపై మద్దతు అందిస్తాం' అని ఆమె చెప్పారు.

నీలమ్ బ్రహ్మా

ఫొటో సోర్స్, Phungjwa Brahma

ఫొటో క్యాప్షన్, నీలమ్ బ్రహ్మా

భారత్‌లోని మరికొందరు కూడా ఈ వ్యాపార అవకాశాన్ని గుర్తించారు.

'ఈ పువ్వును వేడి నీళ్లలో వేస్తే నీలం రంగులోకి మారుతుంది. అందులో నిమ్మరసం వేస్తే ఊదా రంగులోకి మారుతుంది. అది చూడటానికి ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది' అని దిల్లీకి చెందిన నితీశ్ సింగ్ చెప్పారు.

శంఖు పూలతో భారతీయ బ్రాండ్‌ను వృద్ధి చేయాలనే కోరికతో ఆయన 2018లో బ్లూ టీ పేరుతో సంస్థను ప్రారంభించారు. మొదట్లో ఇది కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది.

'మొదట్లో, భారత్‌లో నాణ్యమైన పూలు దొరక్కపోవడంతో దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడి పువ్వులకు రేకులు తక్కువగా ఉండేవి. ఎండలో ఆరబెడితే ఏమీ మిగలేది కాదు. ఎండిన తర్వాత కూడా రంగును నిలుపుకోవడానికి మాకు ఎక్కువ రంగు ఎక్కువ రేకులు ఉన్న పూలు అవసరం' అని ఆయన అన్నారు.

నితీశ్ సింగ్ ఏడేళ్లుగా పూల దిగుబడి, నాణ్యతను పెంచేందుకు రైతులతో కలిసి పనిచేస్తున్నారు.

మొదట ఐదుగురు రైతులతో ప్రారంభించిన ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా 600 మందితో కలిసి పనిచేస్తున్నారు.

ఈ ప్రక్రియలో పూలను కోయడం చాలా కీలకం. ప్రధానంగా మహిళలే ఈ పని చేస్తుంటారు.

'వాళ్ల చేతులు మృదువుగా ఉంటాయి. మొక్కకు నష్టం కలగకుండా పూలు ఎలా కోయాలో వారికి తెలుసు. అందుకే కోయడానికి సిద్ధంగా ఉన్న పూలను ఎలా గుర్తించాలో వారికి శిక్షణ ఇస్తాం' అని నితీశ్ సింగ్ చెప్పారు.

కోసిన తర్వాత పూలను చాలా జాగ్రత్తగా ఆరబెట్టాలి. 'ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతను నియంత్రించడం చాలా ముఖ్యం. ఒక్క చిన్న తప్పు చేసినా పూలు నాణ్యత కోల్పోతాయి' అన్నారు.

కొద్దిగా ఆరబెట్టిన పూలను రైతులు మా దగ్గరకు తీసుకొస్తుంటారు. పూలలోని తేమను పరిశీలించి వాటిని మరింత ఆరబెడతాం. చాలా తక్కువ ఉష్ణోగ్రతలను ఎక్కువసేపు ఉపయోగిస్తాం. వేడి ఎక్కువగా ఉంటే పూలు మాడిపోతాయి. అందులోని ఔషధ గుణాలు, రంగు కోల్పోతాయి' అని ఆయన వివరించారు.

బ్లూ టీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ అపరాజిత పూల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయనే ఆధారాలు ఉన్నాయి. కానీ, ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

'ఈ పూలకు ఔషధ గుణాలు ఉన్నప్పటికీ, వీటిపై చాలా తక్కువ పరిశోధనలు జరిగినట్లు మా అధ్యయనంలో తెలిసింది. కేవలం ఎలుకల మీదే ఎక్కువగా పరిశోధనలు జరిగాయి' అని చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి. సుప్రియ చెప్పారు.

ప్రి-డయాబెటిక్ (మధుమేహం వచ్చే అవకాశం ఉన్న) దశలో ఉన్న కొంతమంది వ్యక్తులపై ఆమె ఒక చిన్న అధ్యయనం చేశారు.

ఈ పువ్వులతో చేసిన టీ తాగిన వారిలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉన్నట్లు ఆమె గుర్తించారు.

'ఇన్నాళ్లు శంఖు పూలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మనుషులపై చేసిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వస్తుండటంతో భవిష్యత్‌లో ఈ పువ్వుకు మంచి ఆదరణ లభిస్తుంది' అని సుప్రియ వివరించారు.

బ్లూ టీ

ఫొటో సోర్స్, Blue Tea

ఫొటో క్యాప్షన్, బ్లూ టీ

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పుష్పల్ బిస్వాస్ అనే రైతు తన అనుభవాన్ని పంచుకున్నారు.

'నేను మొదట్లో వరి, కూరగాయలు పండించేవాడిని. కానీ, చాలా సార్లు నా పంటను అమ్ముకోలేక నష్టపోయేవాడిని.

కానీ గత ఏడేళ్లలో ఈ కొత్త పంట వల్ల అంతా మారిపోయింది. ఈ పంటను పండించడం చాలా సులభం' అని ఆయన అన్నారు.

'శాస్త్రీయ పద్ధతుల్లో ఈ పంట సాగు చేయడం వల్ల నా దిగుబడి 50 కిలోల నుంచి 80 కిలోలకు పెరిగింది. మరికొంత భూమిని కౌలుకు తీసుకున్నాను. అలా నా సాగు విస్తీర్ణం పెరిగింది. ఉత్పత్తి పెరిగింది. నెమ్మదిగా నా ఆదాయం కూడా పెరిగింది' అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)