హే బల్‌వంత్ మూవీ రివ్యూ: సుహాస్, నరేష్ నవ్వించారా, ఇంతకీ వారి బిజినెస్ ఏంటి?

ఫొటో సోర్స్, Instagram/suhas
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
ఈ మధ్య ట్రైలర్‌తో "హే భగవాన్" సినిమాకి బజ్ వచ్చింది. తరువాత సెన్సార్ వాళ్లు టైటిల్ మార్చమన్నారు. దీంతో 'హే బల్‌వంత్'గా మార్చారు. దాంతో ఇంకొంచెం అటెన్షన్ ఏర్పడింది.
సుహాస్, నరేష్, శివానీ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంతకీ సినిమా ఎలా ఉంది?
కథ ఏమంటే కృష్ణ (సుహాస్)కి చిన్నప్పటి నుంచి తండ్రి బల్‌వంత్ (నరేష్) బిజినెస్ అంటే ఆసక్తి. తాను కూడా అంతటి బిజినెస్ మ్యాన్ కావాలని కోరిక. అయితే తండ్రి బిజినెస్ ఏంటో అతనికి తెలియదు. కొడుకుని దూరంగా చదువుల కోసం పంపుతాడు తండ్రి బల్‌వంత్.
ఎంబీఏ చదివి గుంటూరు వచ్చిన కృష్ణకి తండ్రి బిజినెస్ టేకోవర్ చేయాలని కోరిక. ఈలోగా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న మిత్ర (శివాని) పరిచయం అవుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది.
ఒకరోజు బల్‌వంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరుతాడు. తండ్రి బిజినెస్ టేకోవర్ చేయాలని వచ్చిన కృష్ణకి అసలు విషయం తెలుస్తుంది. బల్‌వంత్ చేసే బిజినెస్ ఒక లాడ్జ్‌లో వ్యభిచారం.
ఈ విషయం మిత్రకి తెలియకుండా మిత్ర తాతయ్య (బాబూమోహన్) ప్రయత్నిస్తుంటాడు. ఇంతకీ ఆయన ఆ లాడ్జ్‌కు ఎందుకు వచ్చాడు? తర్వాత ఏం జరిగింది? .
ఈ కథలోకి ఇద్దరు రాజకీయ నాయకులు హర్షవర్ధన్, అజయ్ ఘోష్ ఎందుకు, ఎలా వచ్చారు?
బల్‌వంత్ వ్యభిచార నిర్వహణ వెనుక ఉన్న మానవీయ కోణం ఏంటి? ఇదంతా తెరమీద చూడాలి.


ఫొటో సోర్స్, Youtube/Zmusicsouth
మానవీయ కోణంలో కామెడీ సినిమా
ఈ కథని కామెడీ కోసం రాసుకున్నారు కానీ, వ్యభిచార గృహం చుట్టూ కథ తిరుగుతుండటంతో, చివరికి బరువైన ఎమోషన్, దిక్కులేని ఆడవాళ్లకి న్యాయం చేయడం అనే సెంటిమెంట్‌ని మిక్స్ చేశారు.
అయితే, వేయాల్సిన డార్క్ జోక్స్ అన్నీ వేసిన తర్వాత సానుభూతి యాంగిల్ పని చేయదు. ఇది సీరియస్ కాదు జస్ట్ కామెడీ అనుకోమంటే క్లైమాక్స్ జస్టిఫికేషన్ కరెక్ట్ కాదు.
ఈ వృత్తిలో వున్నవాళ్ల మీద గతంలో కూడా సినిమాలు వచ్చాయి. కలియుగ సీత(1978) పేరుని తర్వాత సెన్సార్ అభ్యంతరంతో కలియుగ స్త్రీగా మార్చారు. పూజకి పనికిరాని పువ్వు (1986) కూడా ఇలాంటి కథే.
ఈ మధ్య హిందీలో బన్సాలీ తీసిన గంగూబాయ్ ఒక క్లాసిక్. ఇవన్నీ కూడా ఆ స్త్రీల ఆగ్రహం, ఆవేదన , కన్నీళ్లు కలగలిసిన సినిమాలు. అయితే హే భగవంత్ జానర్ అది కాదు. లాడ్జ్‌లో జరిగే బూతు జోకులే కామెడీ పంచ్‌లు.
మరి, సెకెండాఫ్‌లో ఇదంతా మరిచిపోయి మానవీయ కోణాన్ని జోడిస్తే ప్రేక్షకుడు తొందరగా షిప్ట్ అవుతాడా?

ఫొటో సోర్స్, Youtube/Zmusicsouth
ఎవరెలా నటించారు?
సుహాస్ మంచి నటుడు. అయితే అతని పాత్ర చాలా తికమకగా వుంటుంది. పాతికేళ్లు వచ్చే వరకూ తండ్రి ఏం బిజినెస్ చేస్తున్నాడో తెలియకుండా వుండటం ఈ కాలంలో సాధ్యమా?.
లాజిక్‌ని వదిలేస్తే ఆ లాడ్జ్‌ను వెంటనే అమ్మలేకపోతే మూసివేయడానికి ఉన్న ఇబ్బంది ఏంటో అర్థం కాదు.
నరేష్ చాలా సీనియర్ నటుడు. నాలుగు దశాబ్దాల కెరీర్ (బాల నటుడిగా లెక్కిస్తే ఐదు దశాబ్దాలు). ఈ మధ్య ఆయన నటన మరింత పదునెక్కింది.
హీరోయిన్ శివానీ ఓకే. నటించేంత స్కోప్ లేదు. హర్షవర్ధన్ , అజయ్ ఘోష్ తమ పాత్రలకి న్యాయం చేశారు. బాబూమోహన్‌కి డైలాగ్ లేని పాత్ర. సుదర్శన్ చాలా చోట్ల నవ్వించాడు.
పది మందికి అన్నం పెట్టడం కోసం పేకాట క్లబ్ నడిపినా అది చట్ట విరుద్ధమే. అలాగే వ్యభిచార గృహం కూడా.
ఏ పట్టింపులూ లేకుండా చూసేవాళ్లకి ఈ సినిమా నచ్చే అవకాశం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Youtube/Zmusicsouth
ప్లస్ పాయింట్స్
1. సుదర్శన్ కామెడీ
2. నిడివి (134 నిమిషాలు)
మైనస్ పాయింట్:
1.క్లైమాక్స్‌లోని ఎమోషన్
2. పాటలు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













