యుఫోరియా: సారా అర్జున్, భూమిక, గౌతమ్ మీనన్.. గుణశేఖర్ సినిమాను గట్టెక్కించారా?

యుఫోరియా మూవీ రివ్యూ, సారా అర్జున్, భూమిక, డైరెక్టర్ గుణశేఖర్

ఫొటో సోర్స్, Gunaa Teamworks/YT

    • రచయిత, జీఆర్ మ‌హర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 4 నిమిషాలు

దురంధ‌ర్‌తో ఆకట్టుకున్న సారా అర్జున్‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్ భూమిక , గౌత‌మ్ మీన‌న్ , నాజ‌ర్ లాంటి న‌టుల‌తో ప్ర‌యోగాత్మ‌కంగా యుఫోరియాతో ప్రేక్షకులముందుకు వ‌చ్చాడు ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌.

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌కి ద‌శాబ్దాలుగా హిట్ లేదు. ఒక్క‌డు, చూడాల‌ని వుంది లాంటి సినిమాలు త‌ప్ప‌, ఆయ‌న గురించి ప్ర‌స్తుతం చెప్ప‌డానికి ఏమీ లేదు. మరి ఈ సారైనా హిట్ ప‌డిందా?

క‌థ ఏమంటే సివిల్స్ పాస్ కావాల‌న్నది 17 ఏళ్ల చైత్ర (సారా అర్జున్‌) ఆశ‌యం. ఒక‌రోజు స్నేహితురాలు పిలిస్తే ప‌బ్‌కి వెళుతుంది. నాన్ ఆల్కాహాలిక్ పార్టీ అని చెబితే, అమ్మానాన్న‌ల అనుమ‌తితోనే వెళుతుంది. అక్క‌డ ఐదుగురు అబ్బాయిలు ప‌రిచ‌యం అవుతారు. లిఫ్ట్ ఇస్తామ‌ని న‌మ్మించి డ్ర‌గ్స్ మ‌త్తులో అత్యాచారం చేస్తారు.

ఈ విష‌యంపై ధైర్యంగా చైత్ర పోలీసుల‌కి ఫిర్యాదు చేస్తుంది. ఆమె త‌ల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారు. క‌మిష‌న‌ర్ జ‌య‌దేవ్ (గౌత‌మ్ మీన‌న్‌) కేసు ద‌ర్యాప్తు చేస్తాడు. కుర్రాళ్ల‌కి శిక్ష ప‌డిందా? లేదా?, ప్ర‌ధాన నిందితుడు వికాస్ (విఘ్నేశ్‌ గ‌విరెడ్డి) త‌ల్లి వింధ్య (భూమిక‌) మాన‌సిక సంఘ‌ర్ష‌ణ, కొడుకు విష‌యంలో ఏం నిర్ణ‌యం తీసుకుంది మిగ‌తా క‌థ‌.

పేరెంటింగ్‌ (పిల్ల‌ల పెంప‌కం) పైన తెలుగులో సినిమాలు చాలా త‌క్కువ‌.

1968లో సుడిగుండాలు మొద‌టి సినిమాగా చెప్పొచ్చు. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌కుడు. జ‌డ్జిగా నాగేశ్వ‌ర‌రావు న‌టించాడు.

పిల్ల‌లు నేర‌స్తులు కావ‌డానికి పెద్ద‌ల పెంప‌కం కూడా కార‌ణ‌మ‌నే బ‌ల‌మైన ఇతివృత్తం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1974లో పెద్ద‌లు మారాలి సినిమా వ‌చ్చింది. కృష్ణ హీరో. పెద్ద‌లు ప‌ట్టించుకోక‌పోతే పిల్ల‌లు స‌మాజానికి చెడుగా మారుతార‌నే ఇతివృత్తం.

యుఫోరియా కూడా ఇలాంటి క‌థే. డ్ర‌గ్స్ వ‌ల్ల యూత్ ఎలా నాశ‌న‌మై అత్యాచారాలు, రోడ్డు ప్ర‌మాదాలు చేసి ఇత‌రుల జీవితాల్ని నాశ‌నం చేసి , తాము కూడా జైళ్ల‌పాల‌వుతార‌నే బ‌ల‌మైన ఇతివృత్తంతో గుణ‌శేఖ‌ర్ తీశాడు.

మొద‌టి స‌న్నివేశంలోనే భూమిక తాను నేరం చేశాన‌ని పిటిష‌న్ వేసి త‌న‌ని విచారించాల‌న్న డిమాండ్‌తో కోర్టుకి వ‌స్తుంది.

ఫ‌స్టాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. దీనికి కార‌ణం సారా అర్జున్ న‌ట‌న‌. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్యాప్తు కొత్త‌గా ఉండ‌డంతో మంచి సినిమా చూస్తున్నామ‌నే ఫీల్ క‌లుగుతుంది.

ఎప్పుడైతే నిందితుల‌కి శిక్ష ప‌డి జైలుకి వెళ్తారో అక్క‌డితో సినిమా అయిపోయిన‌ట్టు అనిపిస్తుంది.

సెకెండాఫ్‌లో ద‌ర్శ‌కుడు కొత్త‌గా ఏం చెబుతాడా అని క్యూరియాసిటీ క‌లుగుతుంది. అయితే మ‌లి భాగం న‌త్త‌న‌డ‌క‌తో రొటీన్‌గా మారి స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది. దీనికి కార‌ణం జైలు స‌న్నివేశాలు చాలా సినిమాల్లో చూసిన‌వే. క్లైమాక్స్ వ‌ర‌కు సెకెండాఫ్‌లో సారా అర్జున్ క‌న‌ప‌డ‌దు.

త‌ల్లీకొడుకుల డ్రామా పండ‌లేదు. భూమిక బాగా న‌టించినా స‌న్నివేశాల్లో బ‌లం లేదు.

పాట‌లు క‌థ‌కి అడ్డం త‌గులుతాయి. గౌత‌మ్ మీన‌న్ డ్ర‌గ్స్ ఆప‌రేష‌న్ కూడా ప‌ర‌మ రొటీన్‌. ఫ‌స్టాఫ్‌లో స‌త్తా చాటుకున్న గుణ‌శేఖ‌ర్ సెకెండాఫ్‌లో చేతులెత్తేశాడు.

నిందితుల‌కి శిక్ష ప‌డే వ‌ర‌కు క‌థ‌ని బ‌లంగా న‌డిపి రెండు గంట‌ల్లో ముగించి వుంటే బాగుండేది.

మంచి సందేశం వుంటే చాల‌దు. ప్రేక్ష‌కుడికి నచ్చేలా ర‌క్తి క‌ట్టించాలి. సెకెండాఫ్‌లో రైటింగ్ మ‌రీ బ‌ల‌హీనంగా వుంది.

యుఫోరియా మూవీ రివ్యూ, సారా అర్జున్, భూమిక, డైరెక్టర్ గుణశేఖర్

ఫొటో సోర్స్, Gunaa Teamworks/YT

అయితే రెండు స‌న్నివేశాల్లో గుణ‌శేఖ‌ర్ మార్క్ క‌నిపిస్తుంది.

డ్ర‌గ్స్ మ‌త్తులో త‌ల్లిని కూడా కొడుకు కామంతో చూసిన‌పుడు ఆ సంఘ‌ర్ష‌ణ‌ని భూమిక క‌ళ్ల‌తోనే చూపించింది. క్లైమాక్స్ సీన్‌లో సారా, విఘ్నేష్ న‌ట‌న గుర్తుండిపోతుంది.

కోర్టు సీన్ అద్భుతంగా వుంటుంద‌ని ఆశిస్తే అది మ‌రీ పేల‌వంగా వుంది.

సినిమాలో అనేక మంది కొత్త న‌టులు న‌టించినా అంద‌రూ అనుభ‌వం ఉన్న న‌టులుగానే క‌నిపించ‌డం విశేషం.

ఇలాంటి క‌థ‌లు హృద‌యానికి తాకాలంటే క‌థ‌నం బిగువుగా వుండాలి. అదే లోపించింది. డాక్యుమెంట‌రీ ల‌క్ష‌ణాలు ఎక్కువ కావ‌డం కూడా ఒక మైన‌స్ పాయింట్‌. ఫొటోగ్ర‌ఫీ బాగుంది. అక్క‌డ‌క్క‌డ డైలాగ్‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్:

1.ఫ‌స్టాప్‌

2.సారా అర్జున్ , భూమిక , విఘ్నేశ్‌ న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్‌:

1.సెకెండాఫ్‌

2.అర‌గంట అద‌న‌పు నిడివి

3.పాట‌లు

ఫైన‌ల్‌గా గుణ‌శేఖ‌ర్‌కి ప్ర‌యోగం క‌లిసి రాలేదు. సంక‌ల్పం, సందేశం మంచివే అయినా ప్రేక్ష‌కుని కూర్చోపెట్ట‌డానికి అవి చాల‌వు.

ఎమోష‌న‌ల్ డ్రామా అవ‌స‌రం.

(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)