ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు.. 31 మంది మృతి, 160 మందికి పైగా గాయాలు

పేలుడు స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లు

ఫొటో సోర్స్, Rescue 1122

చదివే సమయం: 2 నిమిషాలు

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో తర్లాయీ ప్రాంతం ఇమాంబాడాలో జరిగిన భారీ పేలుడులో కనీసం 31 మంది పైగా మరణించారు. 160 మందికి పైగా గాయపడ్డారు.

ఇది ఆత్మాహుతి దాడి అని పోలీస్ అధికారులను ఉటంకిస్తూ 'బీబీసీ ఉర్దూ' చెప్పింది.

అక్కడి అధికారులు చెబుతున్న ప్రకారం.. నగరంలోని మూడు ఆసుపత్రుల వద్ద అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో పాటు గాయపడిన వారి చికిత్సను పర్యవేక్షించడానికి వివిధ ఆసుపత్రులలో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులను నియమించారు.

పేలుడు జరిగిన ప్రాంతానికి ఎవరూ రాకుండా మూసివేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పాకిస్తాన్ హోం మంత్రి మొహిసిన్ నఖ్వీ సూచనల మేరకు... హోం శాఖ సహాయ మంత్రి తలాల్ చౌదరి ఇస్లామాబాద్‌లోని పిమ్స్ ఆసుపత్రికి చేరుకుని, గాయపడిన వారిని పరామర్శించారు.

ఈ సందర్భంగా తలాల్ చౌదరి మాట్లాడుతూ.. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఏం చెప్పారు?

ఈ పేలుడును పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఖండించారు.

షాబాజ్ షరీఫ్ తన ప్రకటనలో.. ఈ మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

హోం మంత్రి మొహిసిన్ నఖ్వీతో నిర్వహించిన సమావేశంలో ఆయన.. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే గుర్తించాలని సూచనలు ఇచ్చారు.

గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని షరీఫ్ ఆదేశించారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిని ఆదేశించారు.

పేలుడుకు కారణమైనవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని షాబాజ్ షరీఫ్ అన్నారు.

దేశంలో శాంతిభద్రతలను చెడగొట్టడానికి ఎవరినీ అనుమతించబోమని ఆయన అన్నారు.