స్పై కెమెరా పోర్న్: మొన్నటిదాకా తానే ప్రేక్షకుడు... ఇప్పుడు బాధితుడు

- రచయిత, వాన్చింగ్ ఝాంగ్
- హోదా, బీబీసీ గ్లోబల్ చైనా యూనిట్, ఐ ఇన్వెస్టిగేషన్స్
- చదివే సమయం: 7 నిమిషాలు
హాంకాంగ్‌కు చెందిన ఎరిక్ (ఇది ఆయన అసలు పేరు కాదు) 2023లో ఒకరోజు రాత్రి, తానుఎప్పుడూ చూసేఓ సోషల్ మీడియా పోర్న్ చానెల్‌ని బ్రౌజ్ చేస్తున్నారు. ఆ చానల్‌లో ఓ వీడియో మొదలైన కొద్ది క్షణాలకే ఆయన నిర్ఘాంతపోయారు.
ఒక గదిలోకి అడుగుపెట్టిన ఓ జంట, తమ చేతుల్లోని బ్యాంగులు కింద పెట్టారు. తర్వాత సెక్స్ చేసుకున్నారు. అదీ ఆ వీడియోలో కనిపించిన దృశ్యం.
అయితే, ఆ జంట ఎవరో కాదు- ఎరిక్, ఆయన గర్ల్ ఫ్రెండే.
వారిద్దరూ అప్పటికి మూడు వారాల క్రితమే దక్షిణ చైనాలో షెన్‌జెన్ నగరంలోని ఒక హోటల్‌లో ఒక రాత్రి గడిపారు.
అక్కడ తాము ఏకాంతంగా ఉన్నారనుకున్నారే తప్ప, తమను ఎవరో గమనిస్తున్నారనే విషయం తెలుసుకోలేకపోయారు.
వారి ఏకాంత క్షణాలన్నీ ఆ హోటల్‌లోని రహస్య కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆయన బ్రౌజ్ చేస్తున్న చానెల్ ఒక్కదానిలోనే కాదు వేలాది మందికి చేరింది.
ఇప్పటివరకు చైనాలోని 'స్పై-కెమెరా పోర్న్' పరిశ్రమకు ఒక వీక్షకుడిగా ఉన్న ఎరిక్ ఇప్పుడు అందులో బాధితుడిగా మారిపోయారు.
(గమనిక: ఈ కథనంలో కొన్ని చోట్ల భాష కొంత అఫెన్సివ్‌గా అనిపించొచ్చు)

'స్పై-క్యామ్'కు చిక్కకుండా హోటల్ గదుల్లో టెంట్...
పోర్న్ చిత్రీకరణ, ప్రసారం చట్టరీత్యా నేరం. కానీ దాదాపు పదేళ్లుగా రహస్య కెమెరాలతో చిత్రీకరించే అశ్లీల చిత్రాలు (స్పై-కెమెరా పోర్న్) ఉనికిలో ఉన్నాయి.
కానీ రెండేళ్లుగా సోషల్ మీడియాలో ఈ అశ్లీల చిత్రాలు చర్చనీయాంశంగా మారాయి.
పెన్సిల్ చివరన ఉండే ఎరేజరంతటి పరిమాణంలో ఉండే ఈ రహస్య కెమెరాలను ఎలా గుర్తించాలో ఒకరికొకరు, ముఖ్యంగా మహిళలు జాగ్రత్తలు చెప్పుకొంటున్నారు.
కొంతమంది, హోటల్ గదుల్లో ఆ కెమెరాల కంటికి చిక్కకుండా ఉండటానికి బెడ్‌పై టెంట్ వేసుకుంటున్నారు.
ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో స్పై కెమెరాలను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం నిరుడు ఏప్రిల్‌లో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
ఆ నిబంధనల ప్రకారం, హోటల్ గదులలో రహస్యంగా అమర్చిన కెమెరాలను కనిపెట్టేందుకు సంబంధిత యజమానులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాల్సి ఉంటుంది.
కానీ, హోటల్ గదుల్లో ఏకాంత క్షణాలను రహస్యంగా చిత్రీకరిస్తున్న ముప్పు మాత్రం ఇంకా తొలగిపోలేదు.
హోటల్ గదుల్లో రహస్య కెమెరాలతో రికార్డు చేసిన వేలాది సంఖ్యలో లేటెస్ట్ 'స్పై-కెమెరా' వీడియోలు వివిధ వెబ్‌సైట్లలో 'పోర్న్'గా విక్రయిస్తున్న విషయాన్ని 'బీబీసీ వరల్డ్ సర్వీస్' గుర్తించింది.
ఈ వీడియోల గురించి చాలావరకూ మెసేజ్‌లు, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ ద్వారానే ప్రచారం జరుగుతోంది.
గత 18 నెలల్లో, టెలిగ్రామ్ ద్వారా ప్రచారం పొందుతున్న ఆరు వేర్వేరు వెబ్‌సైట్లు, యాప్‌లను గుర్తించాం.
ఇవన్నీ కలిసి 180 కంటే ఎక్కువ హోటల్ గదుల్లోని స్పై-కెమెరాలను నియంత్రిస్తున్నాయని తెలిసింది. హోటల్‌కు వచ్చిన అతిథుల వ్యక్తిగత దశ్యాలను కేవలం రికార్డు చేయడమే గాక, నేరుగా ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) కూడా చేస్తున్నాయి.

'స్పై-కెమెరా' బాధితుల పరిస్థితి భయానకం...
'స్పై-కెమెరా' వీడియోలను చూడటం ఎరిక్ టినేజర్‌గా ఉన్నప్పుడే మొదలైంది. వాటిలో దృశ్యాలు ఎలాంటి ఎడిటింగ్ లేకుండా చాలా సహజంగా ఉండటంతో ఆయన బాగా ఆకర్షితులయ్యారు.
''ఈ వీడియోల పట్ల ఆకర్షితులవ్వడానికి ప్రధాన కారణమేమిటంటే, తమ ఏకాంతం దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అవుతున్నాయనే విషయం అందులోనున్న వ్యక్తులకు తెలియకపోవడమే''నని 30 ఏళ్ల వయసులోనున్న ఎరిక్ చెబుతున్నారు.
''సాధారణ పోర్న్ అంతా ముందే ప్లాన్ ప్రకారం చిత్రీకరించినట్లుగా, చాలా కృత్రిమంగా అనిపిస్తుంది'' అని ఆయన వెల్లడించారు.
కానీ, తన గర్ల్ ఫ్రెండ్ 'ఎమిలీ'తో ఉన్న వీడియోను తానే వెబ్‌సైట్‌లో చూసినప్పుడు, ఈ పోర్న్ ప్రసార వ్యవస్థలో బాధితుల అనుభవం ఎంత భయంకరంగా ఉంటుందో ఎరిక్‌కు స్వయంగా అనుభవమైంది.
హోటల్‌లో తాము ఉన్నప్పుడు రహస్యంగా చిత్రీకరించి, ఒక గంట నిడివిగల క్లిప్‌గా ఎడిట్ చేసి టెలిగ్రామ్‌లో ఎవరో అప్‌లోడ్ చేశారని ఎరిక్ చెబితే, ఎమిలీ మొదట నమ్మలేదు. జోక్ చేస్తున్నారనుకుంది.
కానీ తర్వాత ఆ వీడియోను స్వయంగా చూసిన ఎమిలీ దిగ్భ్రాంతికి గురయ్యారు. తీవ్రమైన అవమానంతో కుంగిపోయారు.
ఆ వీడియో క్లిప్ ఎక్కడ తన సహోద్యోగులు, కుటుంబసభ్యుల కంట పడుతుందోనని ఆమె భయాందోళన చెందారు.
ఈ పరిణామంతో ఎరిక్, ఎమిలీ జంట కొన్ని వారాల పాటు ఒకరికొకరు మాట్లాడుకోలేకపోయారు.

క్షేత్రస్థాయిలో పరిశోధనతో బయటపడిన కెమెరా...
జంటల అత్యంత వ్యక్తిగతమైన, లైంగిక కార్యకలాపాలను డబ్బు చెల్లించి చూసే మనస్తత్వం గల వినియోగదారులను వాడుకొనేందుకు 'స్పై-కెమెరా పోర్న్' పరిశ్రమ అసలు ఎలా పనిచేస్తుంది, దీని వెనుక ఉన్నవారెవరు?
అత్యంత ప్రముఖ స్పై-కెమెరా పోర్న్ వ్యాపారుల్లో 'ఏకేఏ' ఒకటి.
ఈ వ్యవహారం ఏమిటో కనిపెట్టేందుకు నేను కూడా వినియోగదారుడిలాగే 'ఏకేఏ' ప్రచారం చేస్తున్న ఒక లైవ్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్ వీక్షించేందుకు నెలకు 450 యువాన్లు (సుమారు రూ.5,866) రుసుం చెల్లించాను.
అలా ఆ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన వెంటనే, వివిధ హోటల్ గదులను చూపిస్తున్న ఐదు రకాల ఫీడ్లు కనిపించాయి. వాటిలో ఏదైనా ఎంచుకొనే అవకాశం ఉంది.
హోటల్ గది తీసుకున్న అతిథులు కీ-కార్డును రూమ్ స్లాట్‌లో పెట్టినప్పుడు విద్యుత్తు సరఫరా ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఆ గదిలో దృశ్యాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యేవి.
అంతేకాదు, ఆ లైవ్‌స్ట్రీమ్ వీడియోలను మళ్లీ మొదటి నుంచి రివైండ్ చేసే సౌకర్యం, పాత వీడియోలను డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం కూడా ఉంది.
టెలిగ్రామ్‌పై చైనాలో నిషేధం ఉంది. కానీ, 'ఏకేఏ' మాదిరిగానే అక్రమ కార్యకలాపాలకు దీన్ని విస్తృతంగా ఉపయోగించేస్తున్నారు.
మా దర్యాప్తు సమయంలో, ఒక టెలిగ్రామ్ ఛానెల్‌లో ఏకంగా 10వేల మంది వరకు సభ్యులు ఉండటాన్ని గుర్తించాం.
నిర్ణీత రుసుం చెల్లిస్తే, టెలిగ్రామ్ చానెల్ లైబ్రరీలో ఎడిట్ చేసిన లైవ్‌స్ట్రీమ్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక ఆర్కైవ్‌లో 2017 నుంచి సేకరించిన 6వేల కంటే ఎక్కువగానే వీడియోలు ఉండటాన్ని గమనించాం.
ఈ 'ఏకేఏ' వినియోగదారుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, హోటల్ గదిలో అతిథుల కార్యకలాపాలను రహస్య కెమెరాల ద్వారా వీక్షిస్తూనే వారి రూపం, సంభాషణలు, లైంగిక సామర్థ్యం గురించి టెలిగ్రామ్ చానెల్ ఫంక్షన్‌లో కామెంట్స్ చేస్తూ ఉంటారు.
గదిలో వారు సెక్స్ పాల్గొనడం మొదలుపెట్టినప్పుడు వీరిక్కడ సంబరాలు చేసుకుంటారు. ఒకవేళ గదిలో లైట్లు ఆపేస్తే ఫిర్యాదులు చేస్తారు. మహిళలను అత్యంత అభ్యంతరకరమైన పదజాలంతో దూషిస్తూ ఉంటారు.
వెబ్‌సైట్ సబ్‌స్క్రైబర్లు, సోషల్ మీడియా వినియోగదారులు ఇచ్చిన సమాచారం, మా పరిశోధనలో సేకరించిన ఆధారాలను బట్టి మేం చేసిన పరిశోధనతో, మధ్యచైనాలోని జెంగ్‌జౌ నగరంలోనున్న ఒక హోటల్ గదిలో స్పై-కెమెరాను కనిపెట్టగలిగాం.
గోడలో వెంటిలేషన్ యూనిట్‌లోపల అమర్చిన ఆ కెమెరా లెన్స్ సరిగ్గా బెడ్ వైపు గురిపెట్టి ఉన్నాయి. దాన్ని ఆ భవనం ప్రధాన విద్యుత్తు సరఫరా వ్యవస్థకు అనుసంధానం చేశారు.
మరో విషయమేమిటంటే, హోటల్‌కు వెళ్లే అతిథుల వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువంటూ ఆన్‌లైన్‌లో విరివిగా విక్రయిస్తున్న 'హిడెన్ కెమెరా డిటెక్టర్' కూడా ఆ స్పై-కెమెరాను గుర్తించలేకపోయింది. ఆ గదిలోకి తీసుకెళ్లినప్పుడు అది ఎటువంటి హెచ్చరికలనూ చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అదొక పెద్ద వ్యాపారం...
హోటల్ గదిలోనున్న స్పై కెమెరాను మా బృందం నిలిపేసిన విషయం టెలిగ్రామ్‌లో చాలా త్వరగా వ్యాపించింది.
'జోంఘువా (కెమెరా పేరు) తొలగించారు' అని ఏకేఏ నిర్వహిస్తున్న ప్రధాన టెలిగ్రామ్ చానెల్‌లో ఒక సబ్‌స్క్రైబర్ రాశారు.
''అయ్యో, ఎంత పని జరిగింది. ఆ గదిలో సౌండ్ క్వాలిటీ చాలా బాగుండేది' అని 'ఏకేఏ' ఆ చాట్‌లో స్పందించింది.
అంతేకాదు మరొక హోటల్‌లో కొత్త కెమెరా యాక్టివేట్ అయ్యిందంటూ మెసేజ్ చేసింది.
''ఇదీ మన లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వేగం. అద్భుతంగా ఉంది కదా?' అని 'ఏకేఏ' తన సబ్‌స్క్రైబర్లకు చెబుతోంది.
'ఏకేఏ' లాంటి పదుల సంఖ్యలోనున్న ఏజెంట్ వెబ్‌సైట్‌లు మా 18 నెలల పరిశోధనలో గుర్తించాం.
సబ్‌స్క్రైబర్లతో ఆ వెబ్‌సైట్‌ల చాట్‌ను బట్టి, ఆ సప్లై చైన్‌లో ఇతర వ్యక్తుల కోసం పనిచేస్తున్నాయని తెలిసింది. వారిని కెమెరా ఓనర్స్ అని పిలుచుకుంటారు. వారే హోటల్ గదులలో స్పై-కెమెరాల ఏర్పాటును పర్యవేక్షిస్తారు. లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్వహిస్తారు.
'ఏకేఏ'తో మేం నేరుగా చాట్ చేసినప్పుడు, అటు నుంచి పొరపాటున మాకొక స్క్రీన్‌షాట్‌ను పంపింది. అది కెమెరా యజమాని పంపిన సందేశమని చెప్పింది. ఆ యజమాని ప్రొఫైల్ పేరు 'బ్రదర్ చున్' అని తెలిసింది.
ఆ పొరపాటును గ్రహించిన 'ఏకేఏ' వెంటనే ఆ మెసేజ్‌ను తొలగించింది. ఆ విషయం గురించి మాట్లాడటానికి నిరాకరించింది.
కానీ, మేం నేరుగా ఆ 'బ్రదర్ చున్' ఆచూకీ కనిపెట్టాం.
అతను తాను కేవలం ఒక సేల్స్ ఏజెంట్‌ను మాత్రమేనని వాదించారు.
అయితే, ఈ అక్రమ వ్యవహారాల్లో భారీగా సంపాదిస్తున్నారనే విషయమైతే మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.
చానెల్ సభ్యత్వం పొందినవారు, వారి చెల్లించిన రుసుంను బట్టి అంచనా వేస్తే, 'ఏకేఏ' ఒక్కటే నిరుడు ఏప్రిల్ నుంచి కనీసం 1,63,200 యువాన్లు (సుమారు రూ.21.35 లక్షలు) సంపాదించింది.
చైనా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం, నిరుడు చైనాలో సగటు వార్షికాదాయం కేవలం 43,377 యువాన్లు (రూ.5.67 లక్షలు) మాత్రమే.
నిబంధనలు కఠినం - కొనుగోలు సులభం
చైనాలో స్పై-కెమెరాల విక్రయం, వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 'హువాకియాంగ్‌బే'లో మాకొక కెమెరా కొనడం చాలా సులభమనిపించింది.
కానీ చైనా అధికారులు ఇటీవల కాలంలో చట్టపరమైన కేసులకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం చాలా అరుదుగా జరుగుతోంది.
'స్పై-కెమెరా పోర్న్' కేసుల్లో ఇప్పటివరకూ ఎంతమందిని పట్టుకొని కోర్టులలో హాజరుపరిచారనే ఖచ్చితమైన వివరాలు బయటకురావడం చాలా కష్టమైన వ్యవహారం.

అశ్లీల వీడియోల తొలగింపు కష్టమే...
''రహస్యంగా చిత్రీకరించిన అశ్లీల వీడియోలను ఇంటర్‌నెట్ నుంచి తొలగించడానికి హాంకాంగ్ కేంద్రంగా 'రెయిన్ లిల్లీ' అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది.
తమ సేవల కోసం డిమాండు పెరుగుతోందని, కానీ ఆ వీడియోలను తొలగించడం గతం కంటే ఇప్పుడు మరింత కష్టతరమవుతోందని ఆ సంస్థ ప్రతినిధి బ్లూ లీ చెప్పారు.
అశ్లీల వీడియోలను తొలగించాలని తాము చేసే విజ్ఞప్తులకు టెలిగ్రామ్ ఎప్పుడూ స్పందించదని, అందువల్ల చేసేదేమీ లేక నేరు ఆ గ్రూపు అడ్మినిస్ట్రేటర్లనే సంప్రదించాల్సి వస్తోందని ఆమె అన్నారు.
అసలు ఈ స్పై-కెమెరా పోర్నోగ్రఫీని విక్రయిస్తున్నవారు, షేర్ చేస్తున్నవారు ఆ అడ్మినిస్ట్రేటర్లే కావడం వల్ల, వాటిని ఇంటర్‌నెట్ నుంచి తొలగించడానికి వారు ఏమాత్రం ఆసక్తి చూపరని బ్లూ లీ వెల్లడించారు.
''టెక్నాలజీ సంస్థలు కేవలం తటస్థ వేదికలు మాత్రమే కావు. ఆ కంటెంట్ ఎంతవరకు విస్తరిస్తుందో వాటి పాలసీలే నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వాటిపై ఎంతో ఉంది'' అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ దర్యాప్తులో బహిర్గతమైన వివరాలను బీబీసీ పంపించిన పది రోజుల తర్వాత టెలిగ్రామ్ స్పందించింది.
''టెలిగ్రామ్ సర్వీసు నిబంధనల ప్రకారం, అభ్యంతరకరమైన అశ్లీలతను షేర్ చేయడం ఖచ్చితంగా నిషేధం. అనుచితమైన కంటెంట్‌పై వచ్చే ఫిర్యాదులు మేం స్వీకరిస్తాం. హానికరమైన లక్షలాది పోస్టులను తొలగించడానికి ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నాం'' అని తెలిపింది.
ఎరిక్, ఎమిలీ జంట ఆ చేదు అనుభవం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. తీవ్రమైన మానసిక క్షోభలోనే ఉన్నారు. తమను ఎవరైనా గుర్తుపడతారరేమోనని బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా టోపీలు ధరిస్తున్నారు. హోటళ్లలో బస చేయడం దాదాపుగా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.
అశ్లీల వీడియోలు చూడటానికి ఆ టెలిగ్రామ్ చానెళ్లను బ్రౌజ్ చేయట్లేదని ఎరిక్ చెప్పినప్పటికీ, మళ్లీ తమ పాత క్లిప్ ఎక్కడైనా ప్రత్యక్షమవుతుందేమోనన్న భయంతో వాటిని చెక్ చేస్తూనే ఉన్నారు.
(అడిషనల్ రిపోర్టింగ్: కేట్ బ్రౌన్, బ్రిడ్జెట్ వింగ్, మెంగ్యూ డోంగ్)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














