సెక్సువల్ కంటెంట్ కోసం లక్షా 20 వేలకు పైగా హోమ్ కెమెరాల హ్యాకింగ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గేవిన్ బట్లర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇళ్లల్లోని వీడియోకెమెరాలను హ్యాకింగ్ చేశారనే ఆరోపణలపై దక్షిణకొరియాలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇళ్లు, వ్యాపారభవనాల్లోని లక్షా20వేలకు పైగా వీడియో కెమెరాలను హ్యాకింగ్ చేసినట్టు, లైంగికపరమైన కంటెంట్ కోసం ఆ ఫుటేజ్‌ను ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.
సింపుల్ పాస్‌వర్డ్‌లు వంటి లోపాలు ఉన్న ఇంటర్నెట్ ప్రోటోకాల్(ఐపీ)కెమెరాలను అనుమానితులు దుర్వినియోగం చేశారని పోలీసులు తెలిపారు.
సీసీటీవీ కెమెరాలకు చవకైన ప్రత్యామ్నాయం ఐపీ కెమెరాలు. వాటిని హోమ్ కెమెరాలు అని కూడా పిలుస్తారు.
ఇంట్లోని ఇంటర్నెట్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తారు. భద్రతపరంగా లేదా పిల్లలు, పెంపుడుజంతువులను జాగ్రత్తగా గమనించడానికి వీటిని ఏర్పాటుచేసుకుంటారు.

వేర్వేరుగానే హ్యాకింగ్
దక్షిణ కొరియాలోని కొన్ని ఇళ్లు, సౌండ్ ఫ్రూఫ్ గదులు, చిన్నపాటి వ్యాయామ సెంటర్లు, ఓ గైనకాలజిస్ట్ క్లినిక్‌లోని కెమెరాలను హ్యాక్ చేసినట్టు సమాచారం.
నలుగురు అనుమానితులు కలిసి కెమెరాల హ్యాకింగ్ చేయలేదని, ఎవరికి వారు సొంతంగా ఇది చేశారని దక్షిణ కొరియా జాతీయ పోలీసు ఏజెన్సీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
అనుమానితుల్లో ఒకరు 63వేల కెమెరాలు హ్యాకింగ్ చేసి 545 లైంగికపరమైన కంటెంట్ ఉన్న వీడియోలను తయరుచేశారని, వాటిని ఆయన దాదాపు రూ. 22 లక్షలకు(35మిలియన్ల వాన్లు) అమ్ముకున్నారని తెలిపారు.
మరో అనుమానితుడు 70వేల కెమెరాలు హ్యాక్ చేశారని, దాదాపు రూ. 11 లక్షలకు(18 మిలియన్ వాన్లు) 648 వీడియోలు అమ్ముకున్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
62 శాతం కంటెంట్ ఇచ్చింది ఈ ఇద్దరే
ఆ వెబ్‌సైట్‌లో గత ఏడాది పోస్టు చేసిన వీడియోల్లో దాదాపు 62శాతానికి ఈ ఇద్దరు అనుమానితులే బాధ్యులని, ఆ వెబ్‌సైట్ ఐపీ కెమెరా హ్యాకింగ్ ఫుటేజ్‌ను అక్రమంగా తీసుకుంటుందని పోలీసులు చెప్పారు.
ప్రస్తుతం పోలీసులు ఆ వెబ్‌సైట్‌ను మూసివేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. దాని ఆపరేటర్ ఎవరో తెలుసుకునేందుకు విదేశీ సంస్థల దర్యాప్తుకు సహకరిస్తున్నారు. అలాగే ఆ వెబ్‌సైట్ కంటెంట్ కొని చూస్తున్నారని అనుమానిస్తున్న ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
''ఐపీ కెమెరాలను హ్యాక్ చేయడం, అక్రమంగా చిత్రీకరించడం బాధితులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తాయి. అందుకే ఇవి తీవ్రమైన నేరాలు. కఠినమైన దర్యాప్తుతో మేం వాటిని నిర్మూలిస్తాం'' అని నేషనల్ పోలీస్ ఏజెన్సీలో సైబర్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ పార్క్ వూ-హ్యూన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అలాంటి వీడియోలు చూడడం కూడా నేరమే’
అక్రమంగా చిత్రీకరించిన వీడియోలను చూడడం, వాటిని దగ్గర ఉంచుకోవడం కూడా తీవ్రమైన నేరాలేనని, తాము లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పారు.
అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి 58 ప్రాంతాల్లో బాధితులను గుర్తించి వారికి ఈ వీడియోల గురించి సమాచారమిచ్చారు. పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచించారు.
బాధితులు కంటెంట్ డిలీట్ చేయడానికి, బ్లాక్ చేయడానికి కూడా వారు సహాయమందిస్తున్నారు. ఇంకొందరు బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇళ్లల్లో, వ్యాపారాలు చేసే చోట ఐపీ కెమెరాలు అమర్చుకునే వ్యక్తులు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని పాస్‌వర్డ్స్‌ను వెంటనే మార్చుకోవాలని, తరచూ మార్చుకుంటుండాలని ద నేషనల్ పోలీస్ ఏజెన్సీ ఒక స్టేట్‌మెంట్‌లో తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














