ఆస్ట్రేలియా బాలికలను హింసకు పురిగొల్పుతున్న ఆన్‌లైన్ నేర ముఠాలు

ఆస్ట్రేలియా, బాలికలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టిఫానీ టర్న్‌బుల్
    • హోదా, సిడ్నీ

ఆన్‌లైన్ నేర ముఠాలు ఆస్ట్రేలియా బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. తమపైతాము, లేదా తమ సోదరులు, పెంపుడు జంతువులపై హింసాత్మక చర్యలకు వారిని ప్రేరేపిస్తున్నాయని, ఇదొక "వికృత ఆన్‌లైన్ గేమ్"లో భాగమని పోలీసులు హెచ్చరించారు.

"ఇది సంప్రదాయ లింగ హింసకు కొత్త, భయంకరమైన రూపం. ఈ సమస్యను ప్రపంచం మొత్తం కలిసి ఎదుర్కోవాలి, ఇందుకు సాయం చేసేందుకు ఆస్ట్రేలియన్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ (ఏఎఫ్‌పీ) కమిషనర్ క్రిస్సీ బారెట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆస్ట్రేలియాలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా, ప్రపంచవ్యాప్తంగా మరో తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ, ఈ నిందితులు తీవ్రవాద భావజాలం కలిగి ఉన్నారని,"సరదా కోసం" ప్రజలను బాధపెట్టాలని అనుకుంటున్నారని కమిషనర్ క్రిస్సీ బారెట్ వెల్లడించారు చెప్పారు.

ఈ నిందితులు ఎక్కువగా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినవారు. వయసు పద్దెనిమిది నుంచి ఇరవైయేళ్లలోపే ఉంటుంది. రోబ్లాక్స్ వంటి గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు లేదా డిస్కార్డ్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా పన్నెండేళ్లలోపు లేదా టీనేజ్‌ వయసులో ఉన్న బాలికలను వలలో వేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ యువకులను "క్రైమ్‌ఫ్లూయెన్సర్స్" గా కమిషనర్ క్రిస్సీ బారెట్ పేర్కొన్నారు. వీరు జీవితానికి అర్థం లేదని భావించే నిహీలిజంతోపాటు, శాడిజం, నాజీయిజం, సైతానిజం వంటి తీవ్ర, ప్రమాదకర భావజాలాలను అనుసరిస్తున్నారు. తక్కువ ఆత్మవిశ్వాసం కలిగిన, మానసిక సమస్యలతో బాధపడుతున్న బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారు అని క్రిస్సీ తెలిపారు.

"ఈ గ్యాంగుల సంస్కృతి మల్టీప్లేయర్ ఆన్‌లైన్ గేమింగ్ కల్చర్‌లాగే ఉంటుంది. వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బాధితులను వేటాడి, వెంటాడి, ఆకర్షించి వలలో వేసుకుంటారని, అంతేకాకుండా, తమ ప్రవర్తన వల్ల కలిగే ఫలితాలు, దాని తీవ్రతను వీరిలో చాలా మంది పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారని" బారెట్ అన్నారు.

"ఈ నెట్‌వర్క్‌లలో ఉన్న వ్యక్తుల ఉద్దేశ్యం డబ్బు సంపాదించడం కాదు, లైంగిక సంతృప్తి కోసం కాదు. కేవలం వినోదం కోసం, సరదా కోసం, లేదా ఆన్‌లైన్‌లో పాపులర్ కావాలనే కోరికతో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు" అని ఆమె వెల్లడించారు.

ఆస్ట్రేలియాలోనే దాదాపు 60 మంది నిందితులను గుర్తించామని, ఈ నేర గ్యాంగులను అరికట్టేందుకు అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాలతో కలిసి ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారని కమిషనర్ క్రిస్సీ బారెట్ వెల్లడించారు.

"టెక్ కంపెనీలు కూడా పోలీసులకు సాయం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో జరుగుతున్న వికృత దోపిడీ చర్చల్లో ఉపయోగించే కోడ్ పదాలు, స్లాంగ్‌లు, ఎమోజీలను గుర్తించడానికి ప్రత్యేక ఏఐ సాధనాన్ని (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్) అభివృద్ధి చేయడంలో సహకరిస్తున్నాయి" అని అధికారులు వెల్లడించారు.

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు చేయడానికి ఆస్ట్రేలియా సిద్ధమవుతున్న సమయంలో క్రిస్సీ మాట్లాడారు. ఈ చట్టం ప్రపంచంలోనే తొలిసారి అమలుకానుండగా, దీని లక్ష్యం పిల్లలను ఆన్‌లైన్ హానికర ప్రభావాల నుంచి రక్షించడం అని అధికారులు తెలిపారు.

అయితే, ఈ కొత్త చట్టం నుంచి గేమింగ్, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు మినహాయింపు పొందాయి. కొత్త చట్టం డిసెంబర్ నెలనుంచి అమల్లోకి రానుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)