కప్పులో మిగిలిన కాఫీని కాలువలో పోసినందుకు రూ.17,623 జరిమానా, తరువాత ఏం జరిగిందంటే..

గల్లీలో ద్రవ వ్యర్థాలను పారేయడం చట్టవిరుద్దమని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెప్పారని బుర్కు తెలిపారు
ఫొటో క్యాప్షన్, గల్లీలో ద్రవ వ్యర్థాలను పారేయడం చట్టవిరుద్దమని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెప్పారని బుర్కు తెలిపారు
    • రచయిత, ఫ్రాంకీ మెకెమ్లీ, జేమ్స్ కె కెల్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

కప్పులో మిగిలిన కాఫీని వర్షపునీరు పారే కాలువలో పారపోసినందుకు ఓ మహిళపై 17,623 రూపాయలు జరిమానా విధించాలనే నిర్ణయాన్ని నైరుతి లండన్ పురపాలక సంఘం వెనక్కు తీసుకుంది.

కప్పులో మిగిలిపోయిన కాఫీని కాలువలో పారపోస్తున్నప్పుడు దాన్నొక బాధ్యతాయుత చర్యగా భావించానని లండన్‌లోని కివ్ ప్రాంతంలో నివసించే బుర్కు యెసిల్ యుర్ట్ చెప్పారు. పైగా ఆ కప్పులో మిగిలిన కాఫీ తాను వెళ్లే బస్సులో కదలికలకు తనపై పడే అవకాశం ఉండటంతో దానిని పక్కనే ఉన్న కాలువలో పారపోసినట్టు తెలిపారు.

అలా చేసినందుకు రిచ్‌మండ్ స్టేషన్ సమీపంలోని ఒక బస్టాప్‌లో ఆమెను ఆపిన ముగ్గురు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు, పర్యావరణ పరిరక్షణ చట్టం-1990లోని సెక్షన్ 33 కింద జరిమానా విధించారు.

ఈ సెక్షన్ ప్రకారం నేల, నీరు కలుషితమయ్యేలా వ్యర్థాలను పారేయడం, డ్రెయిన్లలో ద్రవాలను పోయడం నేరం.

బుర్కుకు విధించిన జరిమానాను రద్దు చేస్తున్నట్లు తాజాగా రిచ్‌మండ్ థేమ్స్ పాలక సంఘం ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ముగ్గురు వ్యక్తులు నన్ను వెంబడించారు’

ఇది చిన్న ఉల్లంఘనే అని, మరోసారి ఇలాంటి పని చేయనని బుర్కు అంగీకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలక సంఘం తెలిపింది.

జరిమానాను కౌన్సిల్ రద్దు చేయడానికంటే ముందు బీబీసీతో మాట్లాడిన బుర్కు, తాను ఎక్కాల్సిన బస్సు రావడంతో కప్పులో అడుగున మిగిలిన కాఫీని డ్రెయిన్‌లో పారబోశానని చెప్పారు.

'కాఫీ పారబోస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు గమనించి నన్ను వెంబడించారు. వెంటనే నన్ను ఆపారు. వారు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు' అని ఆమె తెలిపారు.

ఒక కాలువలో కాఫీ పారేయడం చట్టవిరుద్ధమనే సంగతి తనకు తెలియదని ఆమె చెప్పారు. ఈ ఘటనతో తాను భయపడ్డానని, పని మొదలుపెట్టాక కూడా తనలో ఆందోళన తగ్గలేదని ఆమె తెలిపారు.

'అదొక షాక్ లాంటిది' అని ఆమె అన్నారు.

చట్టం గురించి ప్రజలను హెచ్చరించేలా అక్కడ ఏదైనా సమాచారం లేదా బోర్డులు ఉన్నాయా? అని అధికారులను అడిగినప్పుడు వారేమీ చెప్పలేదని ఆమె తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి శరీరానికి ధరించిన (బాడీ వోర్న్) కెమెరాలో రికార్డయిన ఫుటేజీని సమీక్షించామని, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ల స్పందన సరిగ్గా లేదని రిచ్‌మండ్ కౌన్సిల్ అధికార ప్రతినిధి తెలిపారు.

రిచ్‌మండ్ జల మార్గం

ఫొటో సోర్స్, Getty Images

కాఫీని డ్రెయిన్‌లో కాకుండా ఎక్కడ పారబోయాలి?

కప్పులో మిగిలిన కాఫీని డ్రెయిన్‌లో కాకుండా ఏం చేసి ఉండాల్సిందని ఆఫీసర్లను అడిగినప్పుడు, సమీపంలోని చెత్తబుట్టలో పారేయాలని వారు బదులిచ్చారని ఆమె చెప్పారు.

'ఇది అన్యాయం. ఆ జరిమానా చాలా ఎక్కువ. అంత విధించడం సరికాదు' అని ఆమె అభిప్రాయపడ్డారు.

కౌన్సిల్ నుంచి బుధవారం తనకు వచ్చిన ఈమెయిల్‌ను ఆమె బీబీసీకి చూపించారు.

'ఈ కేసును సమీక్షించిన తర్వాత, పెనాల్టీని (ఎఫ్‌పీఎన్) రద్దు చేయాలని నిర్ణయించాం. మీకు కలిగిన అసౌకర్యానికి, బాధకు మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం' అని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.

జరిమానా రద్దు

జరిమానా రద్దు చేస్తూ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం గురించి ఆమె బీబీసీతో మాట్లాడారు.

'చాలా సంతోషంగా ఉంది. ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో కౌన్సిల్ గుర్తించింది. నా అభ్యర్థనను వారు పరిగణించారు. వీధిలో ద్రవాలు పారేయడం ఒక నేరమని తెలిసిన వాళ్లెవరినీ నేను ఇంతవరకు చూడలేదు. చట్టం గురించి తెలిసేలా చెత్తడబ్బాలు, బస్టాప్‌ల వద్ద స్పష్టమైన గుర్తులు, సంకేతాలు ఏర్పాటు చేయాలి' అని ఆమె అన్నారు.

'జరిమానా విధిస్తూ జారీచేసే నోటీసుల్లోనే ఒక విషయం క్లియర్‌గా ఉంటుంది. వాటిని ఎవరైనా సవాలు చేయాలనుకుంటే అప్పీల్ ప్రాసెస్ అందరికీ అందుబాటులో ఉంటుందని ఆ నోటీసుల్లో స్పష్టంగా రాసి ఉంటుంది' అని కౌన్సిల్ అధికార ప్రతినిధి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)