ఎం.ఎస్. స్వామినాథన్: దేశాన్ని ఆకలి బాధల నుంచి బయటపడేసిన శాస్త్రవేత్త

ఫొటో సోర్స్, The India Today Group via Getty Images
- రచయిత, సుధా జీ తిలక్
- హోదా, దిల్లీ
అది 1965 సంవత్సరం. దిల్లీ శివార్లలోని జౌంటి అనే చిన్న గ్రామంలో ఓ ఆదివారంనాడు పొలాలను సందర్శించడానికి వచ్చిన శాస్త్రవేత్తతో ఓ రైతు కరచాలనం చేశారు.
‘‘డాక్టర్ సాబ్ మీరు తయారుచేసిన విత్తనాలను తీసుకుంటాం" అని ఆ రైతు.. శాస్త్రవేత్తతో అన్నారు.
ఆ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్. టైమ్ మ్యాగజీన్ ఆయన్ను "హరిత విప్లవ పితామహుడు"గా ప్రశంసించి, గాంధీ, ఠాగూర్‌లతో పాటు 20వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా నిలిపింది.
అధిక దిగుబడినిచ్చే కొత్త గోధుమ రకాన్ని మీ పొలంలో పండించడానికి ఎందుకు ఒప్పుకుంటున్నారు అని స్వామినాథన్ ఆ రోజు ఆ రైతును అడిగారు.
అందుకు ఆయన " ఆదివారాల్లో కూడా పొలాల మధ్య తిరుగుతున్నారంటే లాభం కోసం కాక విలువల కోసం పని చేస్తున్నారని అర్ధం. ఇదే నాకు నమ్మకం కలిగించింది" అని రైతు బదులిచ్చారు.
ఆ రైతు విశ్వాసం భారతదేశ భవిష్యత్తును మార్చింది.

ప్రియంబదా జయకుమార్ తాజా బయోగ్రఫీ ‘ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా’ లో స్వామినాథన్ జీవితం ‘‘నౌకలపై ఆధారపడిన దేశం’’ నుంచి ఆహారంలో స్వయం సమృద్ధి సాధించిన దేశపు కథలా ఉంది. ఇది కేవలం భారతదేశాన్నే కాదు, ఆసియాలో ఆహార భద్రతా దృక్పథాన్నే మలిచిన పరిణామం అని రాశారు.
దశాబ్దాల వలసవాద విధానాల కారణంగా దేశంలో వ్యవసాయరంగం కుదేలైంది. దిగుబడి తగ్గింది. లక్షలాదిమంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారు.
1960ల మధ్య నాటికి, భారతీయుడు సగటున రోజుకు కేవలం 417 గ్రాముల ఆహారంతోనే రోజు వెళ్లదీశాడు. అమెరికా గోధుమల దిగుమతి మీదే దేశం ఆధారపడేది. ఇలా నిత్యం ఆహార నౌకల కోసం ఎదురు చూడటం దేశానికి ఓ గాయంగా మారింది.
ఆహార కొరత తీవ్రంగా ఉండడంతో, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గోధుమలకు బదులుగా చిలగడ దుంపలను తినాలని కోరాల్సి వచ్చింది. కానీ దేశంలో ప్రధాన ఆహారమైన బియ్యం కొరత అలాగే కొనసాగింది.
ఆ సమయంలో ‘హరిత విప్లవం’ బీడువారిన పొలాలను బంగారుపంటలతో నింపింది. కొన్నేళ్లలోనే గోధుమ దిగుబడి రెట్టింపు అయింది. కరువు అంచున ఉన్న దేశాన్ని ఆసియాలో ఆహార సమృద్ధి దేశాల సరసన నిలిపింది. ఇది ‘బతుకుబాటకు సేవ చేసిన శాస్త్రం’.. ఆ దారి వేసినది ఎంఎస్. స్వామినాథన్.
స్వామినాథన్ తమిళనాడులోని కుంభకోణంలో 1925లో జన్మించారు. విద్య, సేవకు ప్రాధాన్యం ఇచ్చే భూస్వామ్య రైతు కుటుంబంలో పెరిగారు. ఆయనను డాక్టర్ చేయాలని కుటుంబం భావించింది. కానీ 30 లక్షలమందికిపైగా ప్రాణాలు తీసిన 1943నాటి బెంగాల్ దుర్భిక్షం స్వామినాథన్ మనసును బలంగా కదిలించింది. ఆయన జీవిత దిశను మార్చింది.
"ఎక్కువ ఆహారం ఉత్పత్తి చేయగల మంచి పంటలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తను కావాలని నిర్ణయించుకున్నా. వైద్యం కొద్దిమందినే కాపాడగలదు. కానీ వ్యవసాయం లక్షల మందిని రక్షిస్తుంది" అని తన జీవిత చరిత్ర రచయితతో స్వామినాథన్ అన్నారు.
తరువాత ఆయన వృక్ష జన్యుశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. తరువాత నెదర్లాండ్స్, ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ)లో పనిచేశారు.
అమెరికన్ వ్యవసాయ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాగ్‌ను స్వామినాథన్ మెక్సికోలో కలిశారు. నార్మన్ బోర్లాగ్ సృష్టించిన అధిక దిగుబడినిచ్చే చిట్టి గోధుమ రకం 'హరిత విప్లవానికి' వెన్నెముకగా మారింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
మెక్సికన్ గోధుమ వంగడాలను భారతదేశానికి పంపేలా 1963లో బోర్లాగ్‌ను, స్వామినాథన్ ఒప్పించారు .
మూడేళ్ల తర్వాత, భారతదేశం 18,000 టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంది. స్వామినాథన్ వాటిని భారతదేశ పరిస్థితులకు తగిన విధంగా మార్చారు. ఫలితంగా కొత్త పసుపువర్ణ వంగడాలు పుట్టాయి. ఇవి స్థానిక గోధుమల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ దిగుబడినిచ్చి, వ్యాధులు, క్రిమి కీటకాలను తట్టుకున్నాయి.
అయితేఈ విత్తనాల దిగుమతి అంత సులభం కాలేదని ప్రియంబద జయకుమార్ రాశారు. విదేశీ వంగడాలపై ఆధారపడటం వల్ల సమస్యలు వస్తాయని అధికారులు భయపడ్డారు. రవాణా, కస్టమ్స్ పనులు నత్తనడకన సాగాయి. అలాగే రైతులు కూడా తమకు తెలిసిన పొడవైన, సంప్రదాయ గోధుమ వంగడాలను వదలుకోవడానికి ఇష్టపడలేదు.
కానీ స్వామినాథన్ ఈ అడ్డంకులన్నింటినీ స్వయంగా రైతుల మధ్యన తిరుగుతూ శాస్త్రీయ ఆధారాలు,అవగాహనతో అధిగమించారు. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ, రైతులకు నేరుగా విత్తనాలు అందించారు. పంజాబ్‌లో అయితే విత్తన సంచులు త్వరగా తయారు చేయడానికి ఖైదీల సాయాన్ని కూడా తీసుకున్నారు.
మెక్సికోలోని పొట్టి గోధుమ వంగడాలు ఎరుపు రంగులో ఉండేవి. కానీ స్వామినాథన్ కొత్త హైబ్రిడ్ జాతులను బంగారు రంగులో పెంచి, నాన్, రోటీల వంటి భారతీయ రొట్టెలకు అనుకూలంగా చేశారు. వాటిని కల్యాణ్ సోనా, సోనాలికా అని పేర్లు పెట్టారు . హిందీలో "సోనా" అంటే బంగారం. ఈ అధిక దిగుబడిగల గోధుమలు ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హరియాణాను ఆహార గోదాములుగా మారాయి.
స్వామినాథన్ పరిశోధనల కారణంగా, భారతదేశం ఆహారకొరత దశ నుంచి ఆహార మిగులు దశకు చేరుకుంది. 1971 నాటికి గోధుమల దిగుబడి రెట్టింపు అయ్యింది. కరువుతో కష్టాలు పడిన దేశాన్ని కేవలం నాలుగేళ్లలో ఆహార సమృద్ధి దేశంగా మార్చిన అద్భుతమది.
‘‘రైతే ప్రథమం’’ అనేది స్వామినాథన్ తత్త్వమని జయకుమార్ చెప్పారు.
"పొలం కూడా ఒక ప్రయోగశాల అని మీకు తెలుసా? రైతులే నిజమైన శాస్త్రవేత్తలు.నాకంటే వారికి చాలా ఎక్కువ తెలుసు " అని స్వామినాథన్ తన జీవిత చరిత్ర రచయితతో చెప్పారు.
శాస్త్రవేత్తలు పరిష్కారాలను సూచించే ముందు రైతులు చెప్పేది వినాలని ఆయన సూచించారు. వారాంతాల్లో గ్రామాల్లో గడిపి, నేలలో తేమ, విత్తనాల ధరలు, తెగుళ్ల గురించి అడిగి తెలుసుకునేవారు.
ఒడిశాలో, వరి రకాలను మెరుగుపరచడానికి ఆయన స్థానిక గిరిజన మహిళలతో కలిసి పనిచేశారు. తమిళనాడులో మెట్ట ప్రాంతాల్లో, ఉప్పును తట్టుకోగల పంటలను పెంపొందించాలని ప్రోత్సహించారు. ఆకలిని నివారించడానికి కేవలం శాస్త్రం మాత్రమే సరిపోదని, "శాస్త్రం.. దయ, సహానుభూతితో కలసి నడవాలి" అని పంజాబ్‌లో అవిశ్వాసంతో ఉన్న భూయజమానులతో ఆయన అన్నారు.
స్వామినాథన్ భారత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బాగా అర్థం చేసుకున్నారు. జాతీయ రైతు కమిషన్ చైర్మన్‌గా, 2004 నుంచి 2006 వరకు ఐదు నివేదికలను పర్యవేక్షించారు. చివరి నివేదికలో రైతులు ఎందుకు కష్టపడుతున్నారో, ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయో విశ్లేషించి, సమగ్ర జాతీయ రైతుల విధానం రూపొందించాలని సూచించారు.
90 ఏళ్లు దాటినా, రైతులతోనే ఉండేవారు స్వామినాథన్. 98 ఏళ్ల వయసులో, పంజాబ్, హరియాణాలో వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై నిరసన చేపట్టిన రైతులకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.
స్వామినాథన్ ప్రభావం భారతదేశం ఎల్లలు దాటి విస్తరించింది.
ఫిలిప్పీన్స్‌లో అంతర్జాతీయ బియ్యం పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ)కు 1980లలో ఆయన తొలి భారతీయ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఆయన నేతృత్వంలో దక్షిణాసియాలో వరి ఉత్పత్తి విస్తరించారు, ఇండోనేసియా, వియత్నాం ఫిలిప్పీన్స్‌లలో దిగుబడులు పెరిగాయి.
మలేసియా నుంచి ఇరాన్, ఈజిప్ట్ నుంచి టాంజానియా వరకు, ఆయన ప్రభుత్వాలకు సలహాలిచ్చారు. కంబోడియా రైస్ జీన్ బ్యాంక్ పునర్నిర్మాణంలో సహాయం చేశారు. ఉత్తర కొరియా మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు. ఇథియోపియా కరువు సమయంలో ఆఫ్రికన్ వ్యవసాయ శాస్త్రవేత్తలకు సహాయం చేశారు. ఆసియా అంతటా కొత్త తరాలకు మార్గదర్శకత్వం వహించారు.ఆయన ఆలోచనలు చైనా హైబ్రిడ్ బియ్యం ప్రణాళికకు దారి చూపాయి. ఆఫ్రికాలో హరిత విప్లవానికీ బాట వేశారు.

ఫొటో సోర్స్, Pallava Bagla/Corbis via Getty Images
ఎం.ఎస్.స్వామినాథన్ 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను అందుకున్న తొలివ్యక్తిగా నిలిచారు. ఆకలిని అంతం చేయడంలో స్వామినాథన్ పాత్రను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ‘‘లివింగ్ లెజెండ్’’గా ఆయనను గౌరవించింది.
తర్వాత, చెన్నైలోని ఎం.ఎస్. స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్ ద్వారా, జీవవైవిధ్యాన్ని రక్షించడం, తీరాలను పునరుద్ధరించడం, "పేదలకు, మహిళలకు, ప్రకృతికి అనుకూలమైన" అభివృద్ధి విధానాన్ని ప్రోత్సహించడంపై పనిచేశారాయన.
హరిత విప్లవం విజయంతమైనప్పటికీ తీవ్ర నష్టాలను కూడా కలిగించింది. అధిక దిగుబడి కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. భూసారం క్షీణించింది. పురుగుమందులతో పొలాలు కలుషితమయ్యాయి. గోధుమ, బియ్యం పంటలను మాత్రమే పెంచడంతో జీవవైవిధ్యం దెబ్బతింది. ముఖ్యంగా పంజాబ్, హరియాణా ప్రాంతాలు వాతావరణ మార్పులకు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.
స్వామినాథన్ ఈ సమస్యలను గుర్తించి, 1990లలో "ఎవర్‌గ్రీన్ రివల్యూషన్"ను సూచించారు. పర్యావరణానికి హానికరమయ్యే ప్రక్రియ లేకుండా అధిక పంట ఉత్పత్తి సాధించడం దీని లక్ష్యం. భవిష్యత్తులో వ్యవసాయం అధిక ఎరువులపై ఆధారపడకూడదు, నీరు, మట్టి, విత్తనాలను సంరక్షించడంపై దృష్టి పెట్టాలి అని ఆయన చెప్పారు.
జ్ఞానాన్ని సానుభూతితో కలిపి చూపించిన స్వామినాథన్ అరుదైన ప్రజాప్రముఖుడిగా నిలిచారు. 1971 రామన్ మెగసేసే అవార్డులో పొందిన మొత్తంలో ఎక్కువ భాగం గ్రామీణ విద్యార్థుల విద్యకోసం ఇచ్చారు.
"అగ్రి-టెక్" అనే పదం ప్రాచుర్యం పొందకముందే, లింగ సమానత్వం, రైతుల డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధిపై ఆయన పనిచేశారు.
"ఆకలి నుంచి విముక్తి అనేది అన్నింటికంటే గొప్ప స్వేచ్ఛ అని ఆయన వారసత్వం మనకు గుర్తు చేస్తుంది." అని స్వామినాథన్ కృషిని గుర్తిస్తూ ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు.
స్వామినాథన్ జీవితంలో, సైన్స్, కరుణ కలిసి లక్షల మంది ఆకలిబారిన పడకుండా కాపాడాయి. ఆయన 2023లో 98 సంవత్సరాల వయస్సులో మరణించారు. సుస్థిరమైన, రైతు కేంద్రంగా సాగే వ్యవసాయ వారసత్వాన్ని ఆయన వదిలి వెళ్లారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














