అదానీ కంపెనీలో పెట్టుబడికి ఎల్‌ఐసీపై ప్రభుత్వం ఒత్తిడి చేసిందా? వాషింగ్టన్ పోస్ట్ కథనంపై ఎవరెవరు ఏం చెప్పారు?

అదానీ గ్రూప్

ఫొటో సోర్స్, Indranil Aditya/Bloomberg via Getty Images

ఫొటో క్యాప్షన్, అదానీ గ్రూప్‌పై గతంలో కూడా మోసానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ అధికారుల ప్రతిపాదన మేరకు భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) అదానీ గ్రూప్ కంపెనీలలో సుమారు 3.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 32 వేల కోట్లు)ను పెట్టుబడిగా పెట్టిందని అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ తన పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది.

అంతర్గత పత్రాలను ఉటంకిస్తూ, ప్రభుత్వ ఒత్తిడితో ఒక ప్రణాళికను రూపొందించి అమలు చేశారని తెలిపింది.

ప్రతిపక్ష కాంగ్రెస్ ఇది 'ప్రజా ధనాన్నిదుర్వినియోగం చేయడం'గా అభివర్ణించింది. ఈ విషయంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

వాషింగ్టన్ పోస్ట్ కథనంలోని ఆరోపణలు నిరాధారమైనవి, అవాస్తవమని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ నిర్ణయంలో ఎవరి పాత్రా లేదని, బయటి శక్తుల ప్రభావం లేదని తెలిపింది. అదానీ గ్రూపు కూడా వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ఖండించింది.

ఈ కథనంపై ఇప్పటివరకు నీతీ ఆయోగ్ స్పందించలేదని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

అదానీ గ్రూప్ కంపెనీల యజమాని గౌతమ్ అదానీ సంపద దాదాపు 90 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7.5 లక్షల కోట్లు). అదానీ కంపెనీ గతంలో మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. అమెరికాలో దర్యాప్తు జరుగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వాషింగ్టన్ పోస్ట్ ఏం రాసింది?

భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గురించి వాషింగ్టన్ పోస్ట్‌లో శనివారం ఒక కథనం ప్రచురితమైంది.

ఆ కథనం ప్రకారం, కంపెనీపై రుణ భారం పెరుగుతోందని, అనేక అమెరికన్, యూరోపియన్ బ్యాంకులు కంపెనీకి డబ్బులు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయని పేర్కొంది. దీంతో, కంపెనీకి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించినట్టు రాసింది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అదానీ గ్రూపులకు దాదాపు 3.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులను మళ్లించేందుకు 2025 మే నెలలో భారత అధికారులు ఒక ప్రతిపాదనను ఎలా రూపొందించారో దానిని ఎలా ముందుకు తీసుకెళ్లారో తను పొందిన అంతర్గత పత్రాల ద్వారా ది వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్ఐసీని, పేద, గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల బీమా, ఆర్థిక అవసరాలను తీర్చే సంస్థగా పరిగణిస్తుంటారు.

వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, అదానీ పోర్ట్స్ కంపెనీ తన రుణాన్ని తిరిగి చెల్లించడానికి బాండ్లను జారీ చేయడం ద్వారా సుమారు 585 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,850 కోట్లు) సేకరించాల్సిన సమయంలోనే ఈ ప్రణాళిక వచ్చింది. దీంతో మొత్తం ఈ బాండ్లకు కావాల్సిన నిధులను ఎల్ఐసీ సమకూర్చిందని అదానీ గ్రూప్ మే 30న తెలిపింది. ఇది ప్రభుత్వ అధికారుల భారీ ప్రణాళికలో ఒక చిన్న భాగం, ప్రభుత్వంలో అదానీ ప్రభావానికి ఇదొక ఉదాహరణ.

ఎల్ఐసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎల్ఐసీని పేద, గ్రామీణ ప్రాంత ప్రజల బీమా, ఆర్థిక అవసరాలను తీర్చే సంస్థగా పరిగణిస్తుంటారు.

ఎల్ఐసీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) నుంచి పొందిన డాక్యుమెంట్స్ ఆధారంగా ఈ రిపోర్టు తయారైందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ ఏజెన్సీలకు చెందిన పలువురు ప్రస్తుత, మాజీ అధికారులతో అలాగే అదానీ గ్రూపు ఆర్థిక లావాదేవీల గురించి తెలిసిన ముగ్గురు బ్యాంకర్లతో మాట్లాడినట్లు ఆ వార్తాపత్రిక రాసింది. వారందరూ పేరు వెల్లడించవద్దనే నిబంధనపై ఇంటర్వ్యూలు ఇచ్చారని తెలిపింది.

ప్రణాళికా సంఘం స్థానంలో భారత ప్రభుత్వ నిధులతో రూపొందిన మేథోమధన సంస్థ నీతీ ఆయోగ్, అలాగే ఎల్ఐసీ సహకారంతో డీఎఫ్‌ఎస్ అధికారులు ఈ ప్రణాళికను అభివృద్ధి చేశారని ఆ కథనం తెలిపింది

అదానీ గ్రూప్ జారీ చేసిన 3.5 బిలియన్ డాలర్ల విలువైన కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేయాలని, 507 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 4,208 కోట్లు)ను ఉపయోగించి కంపెనీలో వాటాను పెంచుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఎల్ఐసీకి సలహా ఇచ్చినట్టు పత్రాలు తెలుపుతున్నాయని ఆ కథనం పేర్కొంది.

అదానీ గ్రూపు ఏం చెప్పింది?

ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్‌ను సంప్రదించి, వారి స్పందనను తెలుసుకున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ రాసింది. ఎల్ఐసీ నిధుల పెట్టుబడికి సంబంధించి ఏ ప్రభుత్వ పథకంలోనూ ప్రమేయం లేదని అదానీ గ్రూపు నిర్ద్వంద్వంగా ఖండించింది.

"ఎల్ఐసీ అనేక కార్పొరేట్ గ్రూపులలో పెట్టుబడి పెడుతుంది. అదానీకి అనుకూలంగా ఉందనే వాదనలు తప్పుదారి పట్టించేవి. ఎల్ఐసీ మా పోర్ట్‌ఫోలియోలో తన పెట్టుబడులతో రాబడిని ఆర్జించింది" అని కంపెనీ పేర్కొంది.

"రాజకీయ పక్షపాతం ఉందనే వాదనలు నిరాధారమైనవి. ప్రధానమంత్రి మోదీ జాతీయ నాయకుడు కాకముందు నుంచి కంపెనీ అభివృద్ధి చెందుతోంది" అని తెలిపింది.

ఎల్ఐసీ ఏం చెప్పింది?

మీడియా రిపోర్టును ఖండిస్తూ శనివారం ఎల్ఐసీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాషింగ్టన్ కథనంలోని ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవమని తెలిపింది.

"అదానీ గ్రూపు కంపెనీలలో పెట్టుబడికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించే ఎటువంటి డాక్యుమెంట్ లేదా ప్రణాళికను ఎల్ఐసీ ఎప్పడూ సిద్ధం చేయలేదు. పెట్టుబడి నిర్ణయాలన్నీబోర్డు విధానాలకు అనుగుణంగా, స్వతంత్రంగా జరుగుతాయి. ఈ నిర్ణయాలలో ఆర్థిక శాఖ లేదా మరే ఇతర గ్రూపు ప్రమేయం లేదు" అని ఎల్ఐసీ ఆ ప్రకటనలో తెలిపింది.

"కథనంలోని ఆరోపణలు ఎల్ఐసీ విశ్వసనీయత, ప్రతిష్ఠను మసకబార్చేందుకు, అలాగే భారతదేశ బలమైన ఆర్థిక రంగ పునాదిని దెబ్బతీసేందుకు ఉద్దేశించినట్లు కనిపిస్తోంది" అని తెలిపింది.

ఎంపీ జైరామ్ రమేష్

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, ఎంపీ జైరామ్ రమేష్

జేపీసీకి కాంగ్రెస్ డిమాండ్

ఎల్‌ఐసీ రూ.33,000 కోట్ల విలువైన ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది.

" అదానీపై అమెరికాలో లంచాల ఆరోపణపై కేసు నమోదవడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయని వాషింగ్టన్ పోస్ట్ కథనం చెబుతోంది. దీని తరువాత మోదీ ప్రభుత్వం ఎల్‌ఐసీపై ఒత్తిడి తెచ్చి అదానీ కంపెనీలలో 3.9 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని ఆదేశించింది" అని కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

"ఈ పెట్టుబడిని ఎల్‌ఐసీ నుంచి బలవంతంగా వసూలు చేశారు. అయితే ఎల్‌ఐసీ ఇప్పటికే అదానీ షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది" అని తెలిపింది.

దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంతకుముందు, పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని పేర్కొంది.

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ జైరామ్ రమేష్ తన ఎక్స్ పోస్టులో "ప్రశ్న ఏంటంటే, తీవ్రమైన నేరారోపణల కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ కంపెనీని రక్షించడమే తమ పని అని ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ అధికారులను ఎవరు ఒత్తిడి చేశారు?" తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)