వేమూరి కావేరి ట్రావెల్స్ ఎవరిది?

వేమూరి కావేరి ట్రావెల్స్

ఫొటో సోర్స్, vkaveribus

కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ బస్సు ‘వి కావేరి’ (వేమూరి కావేరి) యాజమాన్యం బస్సుగా అధికారులు నిర్ధరించారు.

ఈ విషయంపై వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రతినిధి కూడా మీడియాతో మాట్లాడారు.

ఇంతకీ, ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాని ఎవరు? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

ప్రైవేటు ట్రావెల్స్ , వికావేరి

ఫొటో సోర్స్, vkaveribus

యజమాని ఎవరు?

తెలుగు రాష్ట్రాల్లో ‘వేమూరి కావేరి’ ట్రావెల్స్ పేరిట ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి.

గతంలో కావేరి ట్రావెల్స్ పేరుతో సంస్థ నడపగా.. అందులో ఉన్న ముగ్గురు పార్టనర్స్ విడిపోయినట్లుగా ‘వి కావేరి’ యాజమాన్యం ప్రతినిధులు చెబుతున్నారు.

ఇలా విడిపోయిన క్రమంలో తెలంగాణలోని పటాన్ చెరు కేంద్రంగా వేమూరి కావేరి ట్రావెల్స్ ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నారు.

తెలంగాణ ఆర్టీవో రికార్డుల ప్రకారం.. కంపెనీయజమానిగా వేమూరి వినోద్ కుమార్ పేరు ఉంది. ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పామూరు.

అయితే, తాజాగా ప్రమాదానికి గురైన బస్‌ను ఒడిశాలోని రాయగడలో రిజిస్ట్రేషన్ చేయించారు.ఆ సమయంలో వినోద్ కుమార్ తన చిరునామాను రాయగడలోని సాయి లక్ష్మీనగర్‌లో చూపించారని తెలంగాణ రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

వినోద్ కుమార్‌తో మాట్లాడేందుకు బీబీసీ ఫోన్‌లో ప్రయత్నించింది.. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వేమూరి కావేరి ట్రావెల్స్

ఫొటో సోర్స్, vkaveribus

'70 బస్సులు ఆపరేట్ చేస్తున్నాం'

అయితే, ‘వి కావేరి’ ట్రావెల్స్ యాజమాన్యానికి చెందిన సుమారు 70 బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయని కంపెనీ ప్రతినిధి వేమూరి వెంకటేశ్వర్లు మీడియాకు చెప్పారు. వీటిల్లో స్లీపర్, సీటర్ బస్సులు ఉన్నాయి.

హైదరాబాద్‌లోని పటాన్‌చెరు నుంచి బస్సులు ఆపరేట్ చేస్తుంటారు.

బస్సులు ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ పట్టణాలు, నగరాలకు నడుస్తున్నాయి.

ఇవి కాకుండా బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, పుణె, శిర్డీ, గోవా, ముంబయి, మంగళూరు, నాగ్‌పుర్ వంటి ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు నడుపుతున్నట్లుగా వేమూరి కావేరి ట్రావెల్స్ వెబ్‌సైట్ బట్టి తెలుస్తోంది.

అలాగే బస్సులు ఎక్కువగా ఒడిశా, నాగాలాండ్, దాద్రా అండ్ నగర్ హవేలి, దమన్ అండ్ దీవ్ వంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయినట్లుగా వెబ్‌సైట్‌లోని బస్సుల ఫొటోల ఆధారంగా స్పష్టమవుతోంది.

ముఖ్యంగా గతంలో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ బస్సులకు రిజిస్ట్రేషన్ లేకపోవడం, తర్వాత అనుమతులు వచ్చినప్పటికీ ట్యాక్స్ ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తుంటారు ప్రైవేటు ట్రావెల్స్ యజామానులు.

ఈ విషయంపై గతంలో బీబీసీ తెలుగు అందించిన కథనాన్ని ఇక్కడ చదవచ్చు.

వేమూరి కావేరి ట్రావెల్స్

ఫొటో సోర్స్, vkaveribus

ఫొటో క్యాప్షన్, ఒడిశాకు సంబంధించి రిజిస్ట్రేషన్ రావడానికి ఏడాది సమయం ఉన్నందున పాత నంబరు డీడీ01ఎన్ 9490తో తిప్పుతున్నట్లుగా అధికారులు చెప్పారు.

తెలంగాణలో రిజిస్ట్రేషన్

మరోవైపు ప్రమాదానికి గురైన వేమూరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ – బెంగళూరు మధ్య నడుస్తోంది.

ఈ బస్సుకు సీటర్ పర్మిషన్ తీసుకుని స్లీపర్‌గా మార్చి నడుపుతున్నారని కొన్ని ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనిపై, బస్సు మొదటగా రిజిస్ట్రేషన్ అయిన మేడ్చల్ రవాణాశాఖ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది.

బస్సుకు 2018లో మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిందని మేడ్చల్ జిల్లా రవాణా శాఖాధికారి రఘునందన్ గౌడ్ చెప్పారు.

''బస్సు 2023 మార్చి 31 నుంచి ‘దమన్ అండ్ దీవ్’కు ట్రాన్స్‌ఫర్ అయ్యింది'' అని చెప్పారు.

మొదట్లో మేడ్చల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 53 సీట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రఘునందన్ గౌడ్ బీబీసీతో చెప్పారు.

''దమన్ అండ్ దీవ్‌కు మార్చాక అక్కడ ఎలాంటి ఆల్ట్రేషన్ చేశారనే విషయంపై మాకు స్పష్టత లేదు. ఇక్కడ ఉన్నప్పుడు సీటర్ పర్మిషన్‌తోనే నడిచింది. తర్వాత స్లీపర్ పర్మిషన్ తీసుకున్నారా? లేదా అన్నది మాకు సమాచారం లేదు'' అని చెప్పారు.

అయితే, బస్సు వివరాలను అధికారులతో బీబీసీ విచారించినప్పుడు, దామన్ అండ్ దీవ్ నుంచి ఎన్‌ఓసీ తీసుకుని ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒడిశాలోని రాయగడలో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా చెప్పారు రవాణాశాఖ అధికారులు.

ఒడిశా ఆర్టీవో నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ ఏడాదిలోపు రానుంది, దీంతో అప్పటివరకు పాత నంబరు డీడీ01 ఎన్ 9490తో తిప్పుతున్నట్లుగా చెప్పారు అధికారులు.

బస్సుకు ఫిట్‌నెస్ 2027 మార్చి 31 వరకు, ఇన్సూరెన్స్ 2026 ఫిబ్రవరి 24 వరకు, రోడ్ ట్యాక్స్ వ్యాలిడిటీ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉన్నట్లుగా యాజమాన్యం ప్రతినిధి వేమూరి వెంకటేశ్వర్లు మీడియాతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)