అఫ్గానీ బాలుడు, విమానం చక్రాల బాక్సులో దాక్కుని దిల్లీ వచ్చేశాడు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నికితా యాదవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అఫ్గానిస్తాన్ బాలుడు చేసిన అత్యంత ప్రమాదకరమైన చర్య అందర్నీ నివ్వెరపరుస్తోంది. అతని వయసు 13 సంవత్సరాలు. విమానం ల్యాండింగ్ గేర్ (చక్రాలు ఉండే ప్రదేశం) లో దాక్కొని కాబూల్ నుంచి దిల్లీ దాకా వచ్చాడు.
పీటీఐ వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం జరిగింది.
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ బాలుడిని పట్టుకున్న భద్రతాధికారులు, విచారణ తర్వాత అతన్ని మళ్లీ అదే విమానంలో అఫ్గానిస్తాన్ తిప్పి పంపేశారు.
కాబూల్ నుంచి వచ్చిన కామ్ ఎయిర్‌లైన్స్ విమానం (నంబరు ఆర్‌క్యూ-4401) సమీపం నుంచి ఒక బాలుడు నడుచుకుంటూ వెళ్లడాన్ని ఆ విమానం సిబ్బంది గమనించారు.
వారు వెంటనే విమానాశ్రయంలోనున్న సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆ బాలుడిని పట్టుకొని టెర్మినల్ 3 భవనంలోకి తీసుకెళ్లి ప్రశ్నించారు.


ఫొటో సోర్స్, Getty Images
ఈ విచారణలో తాను అఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌కు చెందినవాడిగా చెప్పాడు ఆ పిల్లాడు.
కాబూల్ విమానాశ్రయంలోకి దొంగచాటుగా చొరబడ్డానని, ఏదోవిధంగా విమానం వెనుక భాగంలోని సెంట్రల్ ల్యాండింగ్ కంపార్ట్‌మెంట్‌కు చేరుకున్నానని ఆ బాలుడు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
కాబూల్ విమానాశ్రయ భద్రతపై సందేహాలు...
పీటీఐ వార్తాసంస్థ వివరాల ప్రకారం, తనిఖీ సమయంలో కామ్ ఎయిర్‌లైన్స్ భద్రతాధికారులు విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో ఒక చిన్న ఎర్రటి స్పీకర్‌ను గుర్తించారు. బహుశా అది ఆ బాలుడిదై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
దర్యాప్తు తర్వాత, అధికారులు విమానం సురక్షితంగా ఉందని ప్రకటించారు. ఎటువంటి డ్యామేజ్ జరగలేదని నిర్ధరించారు. ఆ బాలుడి పేరు, పూర్తి వివరాలను బహిర్గతం చేయలేదు.
ఈ సంఘటనపై అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మాత్రం తాలిబాన్ ప్రభుత్వ బోర్డర్ పోలీసు విభాగ ప్రతినిధి అబ్దుల్లా ఫరూఖీ బీబీసీతో అన్నారు.
''విమానాశ్రయంలోని రన్‌వేను 24 గంటలూ పర్యవేక్షిస్తారు. ఇది ప్రత్యేక భద్రతా కవచంలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులే కాదు వేరెవ్వరూ రన్‌వే వద్దకు వెళ్లలేరు. దేవుడు అనుమతించడు. ఒకవేళ ఎవరైనా అధికారి అనుకోకుండా రన్ వే వద్దకు వస్తే, అన్ని విమానాలను నిలిపేసి తనిఖీ నిర్వహిస్తారు. విమానాశ్రయాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటారు'' అని అబ్దుల్లా ఫరూఖీ చెప్పారు.
బాలుడి చొరబాటు ఘటనతో కాబూల్ విమానాశ్రయం భద్రతా చర్యలపై సందేహాలు తలెత్తాయి. అయితే, ''విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు, ఎవరినీ అక్రమంగా ప్రయాణించడానికి అనుమతించరు'' అని ఫరూఖీ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బతికి బయటపడటం ఒక అద్భుతమే...
ఎవరైనా విమానంలో దాక్కొని ప్రయాణించడం ఇదే తొలిసారి కాదు. కానీ, విమానంలోని ల్యాండింగ్ గేర్ పైభాగంలో ఇలా ఒకరు దాక్కొని ప్రయాణించడం బహుశా ఇదే మొదటిది కావచ్చు.
ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్‌లలో తమ దేశాల నుంచి తప్పించుకోవడానికి కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
విమానం అంత ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు తగిన స్థాయిలో ఆక్సిజన్ లేకపోవడం, తీవ్రమైన చలి వంటి పరిస్థితుల కారణంగా బతికి ఉండటం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. పైగా విమానం చక్రాలు కిందికి వచ్చినప్పుడు బాక్స్ నుంచి పడిపోయే ప్రమాదం ఉంటుందని కూడా వారు వెల్లడించారు.
2022లో కెన్యా జాతీయుడైన ఓ 22 ఏళ్ల యువకుడు ఆమ్‌స్టర్‌డామ్‌లో విమానం చక్రాల మధ్య ఇరుక్కుని కనిపించాడు. అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














